2
1 సిగ్గుమాలిన జనులారా✽! సమకూడండి. పొట్టు గాలికి కొట్టుకుపోయేలా సమయం గతిస్తూ ఉంది. 2 ✽నిర్ణీత కాలం కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీమీదికి రాకమునుపే, మిమ్ములను శిక్షించడానికి యెహోవా కోప దినం రాకమునుపే, సమకూడండి. 3 దేశంలో యెహోవా న్యాయ నిర్ణయాల ప్రకారం ప్రవర్తించే సాధువైన✽ వారలారా! మీరందరూ యెహోవాను వెదకండి.✽ న్యాయవర్తన✽, వినయం✽ కలిగేలా వెదకుతూ ఉండండి. అప్పుడు యెహోవా కోప దినం వచ్చేటప్పుడు మీకు ఆశ్రయం దొరుకుతుందేమో✽.4 ✽ ✽గాజా నిర్జనం అవుతుంది. అష్‌కెలోను పాడై పోతుంది. మధ్యాహ్న కాలంలో అష్‌కోదు నగరవాసులను పారదోలడం జరుగుతుంది. ఎక్రోను నిర్మూలం అవుతుంది. 5 సముద్ర ప్రదేశంలో కాపురమున్న క్రేతియ జనమా! మీకు బాధ తప్పదు. ఫిలిష్తీయప్రజ కాపురమున్న కనానుదేశమా! యెహోవా వాక్కు నీకు వ్యతిరేకం. “నీలో ఎవరూ మిగలకుండా నిన్ను నాశనం చేస్తాను” అన్నాడు. 6 సముద్ర ప్రదేశం గొర్రెలకాపరులు దిగే మేత స్థలంగా, గొర్రెల దొడ్లున్న స్థలంగా ఉంటుంది. 7 ఆ ప్రాంతం యూదా వంశంలో మిగతావారి✽ స్వాధీనం అవుతుంది. వారి దేవుడు యెహోవా వారిని ప్రత్యేకంగా సందర్శించి, వారు బందీలుగా వెళ్ళిన స్థలాలనుంచి మరల తీసుకువస్తాడు. ఆ ప్రాంతంలో వారు తమ మందలను మేపుతారు, సాయంకాల సమయంలో అష్‌కెలోను ఇండ్లలో పడుకొంటారు.
8 ✽“మోయాబువారు నా ప్రజను నిందించారు. అమ్మోనువారు దూషించారు. వారి మాటలు నాకు వినబడ్డాయి. వారు నా ప్రజల సరిహద్దులమీద గర్వంగా ఆక్రమించారు. 9 కాబట్టి, నా జీవంతోడు, మోయాబుదేశం సొదొమలాగా అవుతుంది. అమ్మోనుదేశం గొమొర్రా✽లాగా అవుతుంది. ఆ ప్రాంతం ముండ్ల చెట్లతో, ఉప్పు గుంటలతో నిండి ఉంటుంది. అది ఎప్పటికీ పాడు బీడై ఉంటుంది. నా ప్రజలో మిగిలినవారు ఆ దేశాలను దోచుకొంటారు. నా జనంలో శేషించినవారు వాటిని స్వాధీనం చేసుకొంటారు✽. ఇది ఇస్రాయేల్ ప్రజల దేవుడుగా ఉన్న సేనలప్రభువు✽ యెహోవా వాక్కు.”
10 వాళ్ళు విర్రవీగి సేనలప్రభువు యెహోవా ప్రజను నిందించారు. వాళ్ళ గర్వం✽ కారణంగా వాళ్ళకు అలా జరుగుతుంది. 11 యెహోవా వాళ్ళకు బీకరుడుగా ఉంటాడు. ఆయన లోకంలో ఉన్న దేవుళ్ళందరినీ నిర్మూలం చేస్తాడు. అప్పుడు అన్ని దేశాలలోను ప్రజలంతా వారివారి స్థలాలలో ఆయననే ఆరాధిస్తారు✽.
12 ✽ “కూషువారలారా! మీరు కూడా నా ఖడ్గం✽చేత హతమవుతారు.”
13 ✽అంతేగాక, ఆయన ఉత్తర దిక్కుకు వ్యతిరేకంగా చెయ్యి చాపి అష్షూరును నాశనం చేస్తాడు. నీనెవెను పాడు చేసి ఎడారిలాగా పొడిగా చేస్తాడు. 14 ఆ స్థలంలో మందలూ అన్నీ రకాల ప్రాణులూ పడుకొంటాయి. గూడకొంగలూ గుడ్లగూబలూ దాని స్తంభాలపై వాలి కూర్చుంటాయి. వాటి కూతలు కిటికీలలో వినబడుతాయి. శిథిలమైపోయిన ఇండ్లు గడపలమీద పడి ఉంటాయి. వాటి దేవదారు దూలాలు కనిపిస్తాయి. 15 “నాలాంటి నగరం మరొకటి లేనేలేదు” అనుకొంటూ సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉన్న నగరం అది. నిర్భయంగా ఉన్న నగరం, అది ఎంతగానో పాడైపోతుంది. అది మృగాలకు పడుకొనే స్థలం అవుతుంది. ఆ దారిన పోయేవారంతా చెయ్యి ఆడిస్తూ వెక్కిరిస్తూ ఉంటారు.