జెఫన్యా
1
1 ఇది యూదా రాజైన ఆమోను✽ కొడుకు యోషియా✽ రోజులలో జెఫన్యాకు యెహోవానుంచి వచ్చిన వాక్కు✽. జెఫన్యా కూషీ కొడుకు, గెదల్యా మనుమడు, హిజ్కియా✽కు జన్మించిన అమర్యా మునిమనుమడు.2 ✽యెహోవా చెప్పేదేమంటే “భూతలంమీదనుంచి సమస్తాన్ని నేను తుడిచివేస్తాను. 3 మనుషులనూ జంతువులనూ తుడిచివేస్తాను. గాలిలో ఎగిరే పక్షులనూ సముద్రంలో ఉన్న చేపలనూ దుర్మార్గులనూ వారి పతనానికి కారణాలనూ తుడిచివేస్తాను. మానవకోటిని భూతలం మీదనుంచి నాశనం చేస్తాను. ఇది యెహోవావాక్కు.
4 ✽“యూదావారికి జెరుసలం నివాసులందరికీ వ్యతిరేకంగా నా చెయ్యి చాపుతాను✽. బయల్✽దేవుడి భక్తులలో మిగిలిన వాళ్ళనూ ఆ విగ్రహాన్ని పూజించే వాళ్ళ పేర్లనూ వాడి పూజారులనూ✽ నిర్మూలిస్తాను. 5 మిద్దెలమీద ఎక్కి ఆకాశంలో ఉన్న నక్షత్ర సమూహాన్ని✽ పూజించేవాళ్ళనూ యెహోవా పేర, మోలెక్✽ పేర కూడా మొక్కి ఒట్టు వేసుకొనే వాళ్ళనూ నేను నిర్మూలిస్తాను. 6 ✽యెహోవాను అనుసరించడం మాని వెనకకు తొలగిపోయిన వాళ్ళనూ యెహోవాను వెదకని✽ వాళ్ళనూ ఆయనను ఉద్దేశించి విచారణ చేయని వాళ్ళనూ నిర్మూలిస్తాను.
7 “ప్రభువైన యెహోవా దినం✽ ఆసన్నమైంది. గనుక ఆయన సన్నిధానంలో మౌనంగా✽ ఉండండి. యెహోవా బలిని✽ సిద్ధం చేశాడు. తాను పిలిచినవారిని ప్రత్యేక పరిచాడు. 8 యెహోవా అనే నేను నా బలి రోజున అధిపతులనూ రాకుమారులనూ విదేశీయుల బట్టల్లాంటి✽వాటిని వేసుకొనే వాళ్ళందరినీ దండిస్తాను. 9 తమ ప్రభువుల మందిరాల గడపలు✽ త్రొక్కకుండా ప్రవేశించి, ఆ మందిరాలను మోసంతో దౌర్జన్యంతో నింపేవాళ్ళను కూడా ఆ రోజున దండిస్తాను.” 10 ✝యెహోవా చెప్పేదేమంటే “ఆ రోజున జెరుసలంలో ఉన్న ‘మత్స్యద్వారం’ దగ్గర రోదనం, రెండో భాగంలో పెడబొబ్బలు వినబడతాయి. కొండల వైపునుంచి గొప్ప నాశనం వస్తుంది. ఇది యెహోవా వాక్కు. 11 మక్తేష్ భాగంలో నివసించే వారలారా, గోలపెట్టండి! కనాను వర్తకులంతా నాశనం అవుతారు. వెండితో వ్యాపారం చేసే వాళ్ళంతా హతమారి పోతారు. 12 ఆ కాలంలో నేను దీపాలతో జెరుసలం సోదా చేస్తాను. ‘యెహోవా మేలు గానీ కీడు గానీ ఏమీ చేయడు✽’ అనుకొంటూ మడ్డి✽మీద నిలిచిన ద్రాక్షరసం లాగా నెమ్మదిగా కూర్చుని ఉన్న✽వాళ్ళను దండిస్తాను. 13 వాళ్ళ ధనం దోపిడీ✽ అవుతుంది, వాళ్ళ ఇండ్లు పాడవుతాయి. వాళ్ళు కట్టుకొన్న ఇండ్లలో కాపురముండలేక పోతారు. ద్రాక్షతోటలు నాటినా వాటి రసం త్రాగ లేక పోతారు.
14 ✽“యెహోవా మహా దినం ఆసన్నమైంది. యెహోవా దినం ఆసన్నమై త్వరగా వస్తున్నది✽. వినండి! దాని చప్పుడు వినబడుతూ ఉంది. ఆ దినంలో బలాఢ్యులు ఘోరంగా కేకలు వేస్తారు. 15 ✝ఆ దినం కోపదినం. బాధ, ఆపద కలిగించే దినం. నాశనం, ధ్వంసం తెచ్చే దినం. చీకటి, అంధకారమయమైన దినం. మబ్బులు, గాఢాంధకారం కమ్మే దినం. 16 ✝ప్రాకారాలున్న పట్టణాల దగ్గర, ఎత్తయిన గోపురాల దగ్గర యుద్ధ ఘోష బాకానాదం వినబడే దినం.
17 ✽“ప్రజలు యెహోవాకు విరోధంగా అపరాధం చేశారు. గనుక నేను వాళ్ళను బాధిస్తాను. వాళ్ళు గుడ్డివారిలాగా నడుస్తారు. వాళ్ళ రక్తాన్ని దుమ్ములాగా, వాళ్ళ మాంసాన్ని పెంటలాగా పారవేయడం జరుగుతుంది. 18 యెహోవా కోప దినం✽లో వాళ్ళ వెండి బంగారాలు వాళ్ళను తప్పించలేక పోతాయి. ఆయన రోషాగ్ని చేత లోకమంతా దహనం✽ అవుతుంది. ఆయన భూనివాసులందరినీ హఠాత్తుగా సమూల నాశనం చేస్తాడు.