3
1 ✽భ్రష్టత్వం✽, కల్మషం✽, దౌర్జన్యం✽తో నిండి ఉన్న నగరానికి బాధ తప్పదు. 2 ✝అది దేవుని మాట వినదు. క్రమశిక్షణకు లోబడదు. యెహోవామీద నమ్మకం ఉంచదు. దాని దేవుని సన్నిధానానికి రాదు. 3 ✽దాని అధికారులు గర్జించే సింహాలలాంటివాళ్ళు. దాని న్యాయాధిపతులు రాత్రివేళ తిరుగాడుతూ, ప్రొద్దు పొడిచేవరకు ఎరలో ఏమీ మిగలకుండా మ్రింగివేసే తోడేళ్ళలాంటివాళ్ళు. 4 ✽దాని ప్రవక్తలు గొప్పలు చెప్పుకొనేవాళ్ళూ వంచకులూ. దాని యాజులు ధర్మశాస్త్రాన్ని త్రోసివేసి పవిత్ర స్థలాన్ని అపవిత్రపరచేవాళ్ళు. 5 ఆ నగరంలో✽ యెహోవా ఉన్నాడు. ఆయన న్యాయవంతుడు✽, అక్రమమేమీ చేయనివాడు. ప్రతిరోజూ ఆయన న్యాయాన్ని వెల్లడిస్తాడు. ఆయన తప్పనిసరిగా అలా చేస్తాడు. అయినా అక్రమకారులకు సిగ్గు✽ అంటూ తెలియదు.6 ✽“నేను వేరు వేరు జనాలను నిర్మూలనం చేశాను. వారి కోటలు పాడైపోయాయి. వారి వీధులను పాడు చేశాను. వాటిలో నడవడానికి ఎవరూ లేరు. 7 ఈ నగరం✽ మీదికి కూడా నేను నియమించిన దండనంతా రాకుండేలా, దాని నివాస స్థలాలు నాశనం కాకుండా ఉండేలా ‘మీరు నామీద భయభక్తులు ఉంచి క్రమశిక్షణకు లోబడాలి’ అన్నాను గాని వారు ఆసక్తితో✽ అక్రమకార్యాలే చేస్తూ వచ్చారు.”
8 అందుచేత యెహోవా చెప్పేదేమంటే, “నేను లేచి కొల్లగొట్టే రోజువరకూ నాకోసం చూస్తూ ఉండండి✽. నేను ఇతర జనాలను పోగు చేయడానికి రాజ్యాలవారిని సమకూర్చడానికి నిశ్చయించుకొన్నాను. వారిమీద నా ఆగ్రహాన్ని✽ నా తీవ్ర కోపమంతటినీ కుమ్మరిస్తాను. నా రోషాగ్నిచేత భూమి అంతా కాలిపోతుంది✽. 9 ✽అప్పుడు జనాలన్నీ యెహోవా పేర ప్రార్థన చేసేలా, ఆయనకు ఏకగ్రీవంగా సేవ చేసేలా నేను వారి పెదవులను పవిత్రం చేస్తాను. 10 కూషు✽ నదుల అవతలనుంచి చెదరిపోయిన నా ప్రజలూ✽ నా ఆరాధకులూ నాకు అర్పణలను✽ తీసుకువస్తారు. 11 ఆ రోజున నీవు✽ నాకు ఎదురుతిరిగి చేసిన క్రియలకారణంగా సిగ్గుపడనవసరం ఉండదు. ఎందుకంటే గర్వంతో✽ ఉప్పొంగిపోయిన వారిని నీలో లేకుండా తొలగిస్తాను. అప్పటినుంచి నీవు నా పవిత్ర పర్వతం మీద విర్రవీగవు. 12 అణగిపోయిన సాధువైన✽వారిని మాత్రమే నీలో ఉండనిస్తాను. వారు యెహోవా పేరుమీద నమ్మకం ఉంచుతారు. 13 అప్పుడు ఇస్రాయేల్ ప్రజలలో మిగతావారు✽ అక్రమమేమి చెయ్యరు, అబద్ధాలు చెప్పరు. వంచన మాటలు వారి నోట ఉండవు. ఎవరి భయం లేకుండా వారు తింటారు, పడుకొంటారు.”
14 ✽సీయోనుకుమారీ✽! ఆనంద ధ్వనులు చేయి! ఇస్రాయేల్! జయ ధ్వనులు చేయి! జెరుసలంకుమారీ! హృదయపూర్వకంగా సంతోషిస్తూ గంతులు వేయి! 15 యెహోవా నీ దండన తొలగించాడు. నీ శత్రువులను వెళ్ళగొట్టాడు. ఇస్రాయేల్ ప్రజల రాజైన యెహోవా✽ మీమధ్య ఉన్నాడు. ఇకమీదట ఆపద వస్తుందేమో అని మీరు భయపడరు✽. 16 ఆ కాలంలో✽ జెరుసలం ఈ మాటలు వింటుంది: సీయోను! భయపడకు! నీ చేతులు దించకు✽! 17 ✽నీ దేవుడు యెహోవా నీలో ఉన్నాడు. ఆయన బలాఢ్యుడు. ఆయన నిన్ను కాపాడుతాడు✽. నిన్ను చూచి ఆనంద భరితుడవుతాడు✽. తన ప్రేమచేత✽ నిన్ను శాంతపరుస్తాడు. నీ కారణంగా ఆనంద ధ్వనులతో✽ సంతోషిస్తాడు.
18 ✽“నీ నియామక మహోత్సవాలకు✽ దూరమై శోకించే నీవారిని నేను సమకూరుస్తాను. వారు గొప్ప అవమానం పొందినవారు. 19 ఆ కాలంలో నిన్ను హింసించిన వారందరినీ✽ దండిస్తాను. కుంటుతూ నడిచేవారినీ విడిపిస్తాను. చెదరగొట్టబడ్డవారిని✽ సమకూరుస్తాను. ఏఏ దేశాలలో వారు అవమానానికి గురి అయ్యారో ఆ దేశాలలో వారు గౌరవం, పేరుప్రతిష్ఠలు పొందేలా చేస్తాను. 20 ✝ఆ కాలంలో మిమ్ములను సమకూరుస్తాను. మీరు బందీలుగా పోయిన స్థలాలనుంచి ఆ కాలంలో మిమ్మల్ని ఇక్కడికి తీసుకువస్తాను. అది మీరు చూస్తారు. అప్పుడు భూమిమీద ఉన్న ప్రజలందరి దృష్టికీ మీరు గౌరవం, పేరు ప్రతిష్ఠలు✽ పొందేలా చేస్తాను. ఇది యెహోవా వాక్కు.”