2
1 నా కావలి స్థలం✽లో ఉండిపోతాను, గోపురంమీద దృఢంగా నిలబడి ఉంటాను. యెహోవా నాతో ఏమి చెపుతాడో, నా వివాదం విషయం నేను ఏమి జవాబివ్వాలో ఎదురు చూస్తూ ఉంటాను.2 యెహోవా నీకు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు: ‘‘దర్శనంలో వెల్లడి అయిన విషయం✽ పలకలమీద వ్రాయి. పరుగెత్తేవాడు కూడా అది చదవగలిగేలా స్పష్టంగా వ్రాయి. 3 వెల్లడి అయిన విషయం నిర్ణయ కాలంలో జరుగుతుంది. దాని నెరవేర్పు త్వరగా✽ వస్తుంది. అది తప్పక జరుగుతుంది. అది ఆలస్యంగా వచ్చినా దానికోసం ఎదురు చూస్తూ ఉండు. కానీ ఆలస్యం కాకుండా అది జరిగితీరుతుంది. 4 ఇదిగో విను. వాడు✽ గర్విష్ఠుడు, హృదయంలో నిజాయితీగలవాడు కాదు. నిర్దోషి తన నమ్మకం✽వల్లే జీవిస్తాడు.
5 ✽“ద్రాక్షమద్యం ఆ అహంభావిని మోసగించింది✽. వాడికి నెమ్మది లేదు. వాడు మృత్యులోకమంత అత్యాశ✽ గలవాడు. మృత్యువులాగా వాడికి తృప్తి ఉండదు. వాడు అన్ని దేశాలవారిని వశపరచుకొంటాడు. అన్ని జనాలను✽ పోగు చేసుకొంటాడు. 6 అయితే వారంతా వాణ్ణి ఉద్దేశించి ఇలా సామెత, ఎగతాళి✽పాట ఎత్తుతారు: ‘తనది కానిదానిని పోగు చేసేవాడికి బాధ✽ తప్పదు. తాకట్టు వస్తువులవల్ల ధనం సంపాదించినవాడికి బాధతప్పదు. అలాంటివాడు ఎన్నాళ్ళవరకు అలా చేయగలడు? 7 ✽నీ రుణస్తులు హఠాత్తుగా లేస్తారు. వారు నిలబడి నిన్ను వణికిస్తారు. నీవు వారికి ఎరలాగా ఉంటావు. 8 అనేక దేశాలవారి ఆస్తిని నీవు దోచుకొన్నావు. రక్తపాతం జరిగించావు, దేశాలకూ పట్టణాలకూ వాటిలో ఉన్న నివాసులందరికీ దౌర్జన్యం చేశావు. గనుక మిగిలిన ప్రజలు నీ ఆస్తిని దోచుకొంటారు.
9 ✽“ఆపద రాకుండా చేసేందుకు నివాస స్థలాన్ని భద్రపరచుకోవడానికి కుటుంబంకోసం అన్యాయ లాభం చేకూర్చుకొన్న వాడికి బాధ తప్పదు. 10 నీవు దురాలోచన చేసి అనేక దేశాలవారిని నాశనం చేయడం మూలాన నీ ఇంటివారిని అవమానానికి గురి చేశావు, నీమీదికి దోష శిక్షను తెచ్చిపెట్టుకొన్నావు. 11 గోడల రాళ్ళు మొర పెట్టుకొంటాయి✽, ఇంటి వాసాలు జవాబిస్తాయి.
12 ✽“రక్తపాతంచేత నగరాన్ని నిర్మించేవాడికి, చెడుగు చేయడంచేత పట్టణాన్ని స్థాపించేవాడికి బాధ తప్పదు. 13 ప్రజల ప్రయాస అంతా మంటలపాలవుతుందని జనాలు వట్టిదానికోసం కష్టపడి నీరసించిపోవాలని సేనలప్రభువు యెహోవా నిర్ణయించాడు గదా? 14 ✽ అయితే సముద్రం నీళ్ళతో నిండి ఉన్నట్టు భూలోకం యెహోవా మహత్తు విషయమైన జ్ఞానంతో నిండి ఉంటుంది.
15 ✽“తన పొరుగువాళ్ళ దిగంబరత్వాన్ని చూడాలని వాళ్ళకు మత్తు ఎక్కేవరకు తిత్తులలోనుంచి ద్రాక్షమద్యం పోసేవాడికి బాధ తప్పదు. 16 ✽అలాంటి నీవు ఘనతకు బదులుగా అవమానానికే గురి అవుతావు. నీవే త్రాగి నీ మానాన్ని కనుపరచుకొంటావు. యెహోవా కుడిచేతిలో ఉన్న పాత్రలోనిది త్రాగడం నీ వంతవుతుంది. అపకీర్తి నీ ఘనతను కప్పుకొంటుంది. 17 ✽లెబానోనుకు చేసిన దౌర్జన్యం నీకు ముంచుకు వస్తుంది. జంతువులను నాశనం చేశావు - ఆ భయం నీమీదే పడుతుంది. నరహత్య చేశావు. ఆయాప్రాంతాలకు పట్టణాలకూ వాటి నివాసాలకూ బలాత్కారం చేశావు. గనుకనే నీకు అలా జరుగుతుంది.
18 ✽ “ప్రతిమవల్ల ఏమి ప్రయోజనం? శిల్పి దాన్ని చెక్కుతాడు గదా? విగ్రహం మోసకరం. దానివల్ల ఏమి ప్రయోజనం? తాను చేసిన దానిమీద తానే నమ్మకం ఉంచడం వల్ల ఏమి ప్రయోజనం? అతడు చేసినది మూగబొమ్మ. 19 కర్రను చూచి ‘మేలుకో’ అనీ మూగరాయిని చూచి ‘లే’ అనీ చెప్పేవాడికి బాధ తప్పదు. అది ఉపదేశం ఇవ్వగలదా? అది బంగారంతో వెండితో పూత పూసి ఉంది. దానికి ప్రాణం మాత్రం లేదు. 20 ✽కానీ యెహోవా తన పవిత్రాలయంలో ఉన్నాడు. ఆయన ఎదుట లోకమంతా మౌనం వహించాలి.”