హబక్కూకు
1
1 ఇది హబక్కూకుప్రవక్తకు దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి✽. 2 ✽యెహోవా! నీవు వినకుండా ఉంటే నేను ఎంత కాలమని సహాయంకోసం మొరపెట్టాలి? “దౌర్జన్యం జరుగుతూ ఉంది” అని నేను నీకు ఆక్రందన చేసినా నీవు రక్షణ ప్రసాదించడం లేదు. 3 ✽నేను చెడుగు చూచేలా చేస్తున్నావెందుకని? కష్టాలను నీవెందుకు చూచి ఊరుకుంటున్నావు? నా ఎదుట నాశనం, దౌర్జన్యం కనిపిస్తూ ఉన్నాయి. జగడాలూ కలహాలూ రేగుతూ ఉన్నాయి. 4 అందుచేత ధర్మశాస్త్రం నిష్ఫలం అయ్యింది, న్యాయం ఎప్పుడూ తప్పుతూ ఉంది. దుర్మార్గులు న్యాయవంతులను చుట్టుముట్టి ఉన్నారు గనుక న్యాయం తారుమారు అవుతున్నది.5 ✽“ఇతర జనాలలో జరుగుతున్నది చూస్తూ ఉండండి. చూచి కేవలం నిర్ఘాంతపోండి✽! మీ రోజుల్లో నేను చేయబోయే క్రియను గురించి మీకు ఎవరైనా చెపితే మీరు నమ్మేవారు కారు✽. 6 ✽ఇదిగో వినండి. నేను కల్దీయదేశస్థులను✽ పురికొలుపుతున్నాను✽. వారు ఉద్రేకం గల క్రూరులు, ఇతరుల నివాస స్థలాలను ఆక్రమించాలని విశాల భూభాగాల✽ గుండా దాటిపోయేవారు. 7 వారు భయంకరులు, బీకర జనం. ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలనూ ప్రభుత్వాన్నీ విధిస్తారు. 8 వారి గుర్రాలు చిరుతపులులకంటే వేగంతో పరుగెత్తగలవు. సాయంకాల సమయంలో తిరుగులాడే తోడేళ్ళకంటే అవి చురుకుగా ఉంటాయి. వారి రౌతులు దూరంనుంచి గుర్రాలను దొమ్మిగా పరుగులెత్తిస్తూ వస్తారు. ఎరను పట్టుకోవడానికి ఎగురుతున్న గరుడపక్షిలాగా అతి వేగంతో వస్తారు. 9 ఒక్క పెట్టున వాళ్ళంతా సూటిగా చూస్తూ దౌర్జన్యం చేయడానికి వస్తారు. ఇసుకరేణువుల్లా ఉన్న ప్రజలను చెరపట్టుకొంటారు. 10 రాజులను వెక్కిరిస్తారు, అధిపతులను హేళన చేస్తారు. కోటలన్నిటినీ చూచి నవ్వుకొంటారు. మట్టి దిబ్బలు చేసి వాటిని పట్టుకొంటారు. 11 అప్పుడు గాలి వీచేవిధంగా వడిగా సాగిపోతారు. వారు అపరాధులు. వారి బలమే వారికి దేవుడు✽.”
12 ✽యెహోవా! నా దేవా! నా పవిత్ర దేవా✽! నీవు ఆదినుంచి✽ ఉన్నావు గదా! మేము మృతి✽కి గురి కాబోము. యెహోవా! వారిని తీర్పు సాధనాలుగా నియమించావు. ఆధారశిలా✽! వారు దండన✽ చేసేలా నీవు వారిని నిర్ణయించావు. 13 నీ కండ్లు చెడుగును✽ చూడలేనంత పరిశుద్ధంగా ఉన్నాయి. కష్టాలను చూచి ఊరుకోలేవు. మరి, వంచకులను✽ చూచి ఎందుకు ఓర్చుకొంటున్నావు? దుర్మార్గులు తమకంటే✽ న్యాయవంతులను దిగమింగివేస్తూ ఉంటే నీవెందుకు ఊరుకొంటావు? 14 నీవు మనుషులను ఏలిక లేని చేపలలాగా, ప్రాకేప్రాణుల్లాగా చేయడం ఎందుకు? 15 ✽వాడు గాలాలు వేసి మనుషులందరిని గుచ్చి లాగివేస్తాడు. తన వలలో వారిని చిక్కించుకొంటాడు. వలలో సమకూర్చి సంతోషంతో గంతులు వేస్తాడు. 16 ✽అందుకని తన వల✽కు బలులు అర్పిస్తాడు, తన వలకు ధూపం వేస్తాడు. వాటివల్ల వాడి రాబడి అధికం, వాడి ఆహారం శ్రేష్ఠం. 17 ✽వాడు ఎడతెరపి లేకుండా నిండిపోయిన తన వల ఖాళీ చేస్తూ ఉంటాడా? ఎన్నటికీ మానకుండా జనాలను హతమారుస్తూ ఉంటాడా?