3
1 హబక్కూకుప్రవక్త చేసిన ప్రార్థన✽, భజన:2 యెహోవా! నిన్ను గురించిన వార్త నేను విన్నాను.
అది నాకు భయభక్తులు కలిగిస్తూ ఉంది✽.
యెహోవా! పూర్వం నీవు చేసిన క్రియలు
ఈ సంవత్సరాల్లో మళ్ళీ చెయ్యి.
ఈ సంవత్సరాల్లో వాటిని తెలియజెయ్యి.
కోపం✽లో కరుణ✽ మరచిపోకు.
3 దేవుడు తేమాను✽నుంచి బయలుదేరుతున్నాడు.
పవిత్ర దేవుడు పారాను✽కొండ సీమనుంచి
తరలి వస్తున్నాడు. (సెలా)
ఆయన ప్రకాశం ఆకాశ మండలమంతటా
కనబడుతూ ఉంది.
లోకం✽ ఆయన కీర్తితో నిండి ఉంది.
4 ✝ఆయన మహిమాప్రకాశం సూర్యకాంతిలాంటిది.
ఆయన బలం ఆయన చేతిలో మరుగై ఉంది.
ఆయన చేతిలో నుంచి కిరణాలు
తళతళలాడుతూ ఉన్నాయి.
5 ✝ఆయనకు ముందుగా చీడ తెగులు
నడుస్తూ ఉంది.
ఆయన అడుగు జాడలలో విష జ్వరాలు
వస్తూ ఉన్నాయి.
6 ✝ఆయన నిలబడితే భూమి కంపిస్తుంది.
ఆయన చూస్తే జనాలు వణకుతాయి,
ఆదికాల పర్వతాలు బ్రద్దలైపోతాయి,
పురాతనమైన కొండలు అణగిపోతాయి.
ఆయన విధానాలు శాశ్వతమైనవి✽.
7 ✽కూషానువాళ్ళ డేరాల మీదికి విపత్తు రావడం
నేను చూశాను.
మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గడగడ వణికాయి.
8 ✝యెహోవా! నీ గుర్రాలను కట్టుకొని
జయసూచకమైన రథాలమీద ఎక్కి వస్తున్నావు.
నీకు నదులమీద ఆగ్రహం వచ్చిందా?
నీవు కోపగించేది ప్రవాహాలమీదేనా?
నీ కోపం సముద్రంమీద ఉందా?
9 ✝నీ విల్లు వరలోనుంచి తీస్తున్నావు.
నీ వాక్కుతోడని ప్రమాణ పూర్వకంగా
నీ బాణాలు ఎక్కిస్తున్నావు. (సెలా)
నదులతో భూమిని చీలుస్తున్నావు.
10 ✝నిన్ను చూచి పర్వతాలు అల్లాడిపోతున్నాయి.
నీటిప్రవాహాలు వేగంగా పారుతున్నాయి.
జలాగాధం ఘోషిస్తూ, తన చేతులు పైకెత్తుతున్నది.
11 ✝తళతళలాడే నీ ఈటెలను, మెరిసే నీ బాణాలను
చూచి సూర్యమండలం,
చంద్రబింబం తమ స్థానాలలో ఆగిపోతున్నాయి.
12 ✽నీవు తీవ్ర కోపంతో భూమిమీద సాగిపోతున్నావు.
ఆగ్రహంతో జనాలను అణగద్రొక్కుతున్నావు.
13 ✝నీ ప్రజను రక్షించడానికి నీవు
బయలుదేరుతున్నావు.
నీ అభిషిక్తుణ్ణి కాపాడడానికి బయలు దేరుతున్నావు.
దుర్మార్గుల ఇంటి యజమానిని
నీవు చితగ్గొట్టివేస్తున్నావు.
వాళ్ళ మెడను ఖండించి వాళ్ళను
నిర్మూలం చేస్తున్నావు.
14 ✽దాక్కొన్న బాధితులను ఆతురతతో
దిగమ్రింగేవిధంగా ఆ యోధులు మమ్ములను
పారదోలడానికి తుఫానులాగా వస్తూ ఉంటే,
వాళ్ళ నాయకుణ్ణి అతడి సొంత ఈటెతో
పొడుస్తున్నావు.
15 నీ గుర్రాలను సముద్రంమీద త్రొక్కిస్తున్నావు.
ఉప్పొంగిపోతున్న మహా జలాలమీద త్రొక్కిస్తున్నావు.
16 ✽ఇది విని నేను అంతరంగంలో కలవరపడుతున్నాను.
ఆ శబ్దానికి నాపెదవులు కదులుతున్నాయి.
నా ఎముకలు కుళ్ళిపోతున్నట్టున్నాయి.
నా కాళ్ళు వణకుతున్నాయి✽.
అయితే మాపై పడబోయే✽ వాళ్ళమీదికి విపత్తు
వచ్చేవరకు నేను నెమ్మదిగా✽ ఎదురు చూస్తూ ఉంటాను.
17 ✽ అంజూరు చెట్లు వికసించకపోయినా,
ద్రాక్షచెట్లు పండ్లు ఇవ్వకపోయినా,
ఆలీవ్ చెట్ల పంట లేకపోయినా,
పొలాలలో పైరు కోతకు రాకపోయినా,
గొర్రెలు దొడ్డిలో లేకపోయినా,
పశువులు కొట్టంలో లేకపోయినా,
18 నేను యెహోవాను బట్టి ఆనందిస్తాను✽.
నా రక్షకుడైన✽ దేవుని మూలంగా సంతోషిస్తాను.
19 యెహోవాప్రభువు నాకు బలం✽.
ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళలాగా చేస్తాడు.
నేను ఎత్తు స్థలాలమీద✽ నడవగలిగేలా చేస్తాడు.
(ఇది గాయకుల నాయకుడికోసం తంతి వాద్యాలతో పాడతగ్గది.)