2
1 ✽నీనెవే! నాశనకారుడు నీమీదికి వస్తున్నాడు. నీ కోటలను కాపాడు! త్రోవలో కావలి ఉండు! నడుము బిగించుకో! నీ శాయశక్తులా ఎదిరించడానికి సిద్ధపడు! 2 ✝దోపిడీదారులు యాకోబు సంతానానికి ఏమి లేకుండా చేసినా, వారి ద్రాక్ష చెట్లను నరికివేసినా, ఇస్రాయేల్ దివ్యస్థితి యెహోవా వారికి మళ్ళీ ప్రసాదిస్తాడు.3 ✽అతని శూరుల డాళ్ళు ఎర్రగా ఉన్నాయి. యోధులు ధరించిన బట్టలు సిందూర వర్ణం. సైన్యం వ్యూహమేర్పడ్డ రోజున రథాలు మెరుగుపెట్టిన ఉక్కులాగా తళతళ లాడుతున్నాయి. సరళవృక్షం మ్రాను ఈటెలు ఆడించబడు తున్నాయి. 4 రథాలు వీధులలో చాలా తొందరగా చొరబడుతున్నాయి. రాజమార్గాలలో అవి అటు ఇటు దొమ్మిగా పోతూ ఉన్నాయి. అవి దివిటీలలాగా కనిపిస్తున్నాయి, మెరుపులాగా వేగంతో పోతున్నాయి. 5 అతడు తన అధిపతులను జ్ఞాపకం చేసుకొని రప్పిస్తున్నాడు. వాళ్ళు త్రోవలో తడబడుతున్నారు. ప్రాకారం దగ్గరికి పరుగెత్తి రక్షకమైన అడ్డును నిలబెట్టిస్తున్నారు. 6 నదికి ఎదురుగా ఉన్న ద్వారాలు తెరవడం జరుగుతున్నది. భవనం కూలుతూ ఉన్నది.
7 నగరవాసులు బందీలుగా కొనిపోబడాలని నిర్ణయం అయింది. అందులో ఉన్న దాసీలు గువ్వల్లాగా ఆర్తధ్వని చేస్తూ, గుండెలు బాదుకొంటూ ఉన్నారు. 8 నీనెవె చెరువులాగా ఉంది. నీటి ప్రవాహం లాగా దాని జనులు పారిపోతున్నారు. “ఆగండి! ఆగండి!” అని కేకలు వినబడుతున్నాయి గాని ఎవరూ వెనక్కు చూడడం లేదు. 9 వెండి దోచుకోండి! బంగారం కొల్లగొట్టండి! ద్రవ్యం అపారం! చాలా రకాల విలువైన ప్రశస్త వస్తువులు ఉన్నాయి. 10 దానిని దోచుకోవడం, వట్టిదిగా పాడుగా చేయడం జరుగుతున్నది. ప్రజలకు ధైర్యం చెడిపోయింది. వాళ్ళ మోకాళ్ళు వణకుతూ ఉన్నాయి. ఒళ్ళు అల్లాడిపోతూ ఉంది. అందరి ముఖాలు తెల్లబారుతున్నాయి.
11 ✽సింహాల గుహ ఏమయింది? అవి పిల్లలను పోషించిన స్థలం ఏమయింది? ఎవరి భయమూ లేకుండా సింహం, ఆడ సింహం, సింహం పిల్లలు తిరుగులాడిన స్థలం ఏమయింది? 12 పిల్లలకు కావలసినంతగా సింహం ఎరను చీల్చివేసింది, ఆడ సింహాలకు చాలినంతగా గొంతుక నొక్కి చంపింది. చంపినదానిని గుహలనిండా పెట్టింది, ఉనికిపట్లను చీల్చిన మాంసంతో నింపింది. 13 ✽సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, “నేను నీ విరోధిని. నీ రథాలను పొగపాలయ్యేలా కాల్చివేస్తాను. నీ సింహం పిల్లలు కత్తికి గురి అవుతాయి. నీవు పట్టుకొన్నది దేశంలో లేకుండా చేస్తాను. నీ వార్తాహరుల కంఠం ఇకమీదట వినబడదు.”