3
1 రక్తమయమైన ఆ నగరానికి బాధ తప్పదు! అందులో అన్నీ అబద్ధాలే, అంతటా దోపిడీ, ఎప్పుడూ ఎరను చీల్చడమే! 2 ఇప్పుడు కొరడా చప్పుడు, చక్రాల ధ్వని, దౌడు తీస్తున్న గుర్రాలు, వేగంతో పోతున్న రథాలు, 3 వడిగా పరుగెత్తుతున్న రౌతులు, తళతళలాడుతున్న ఖడ్గాలు, మెరుస్తున్న ఈటెలు! అనేకులు హతమవుతున్నారు. చచ్చినవాళ్ళు కుప్పలు కుప్పలుగా కూలుతున్నారు. లెక్క పెట్టలేనన్ని శవాలు కనిపిస్తున్నాయి. పీనుగులు కాలికి తగిలి ప్రజలు తొట్రుపడు తున్నారు. 4 దీనికి కారణం అది వేశ్యలాగా చేసిన పోకిరీ చేష్టలు. అది శృంగారమైనది. మంత్ర విద్యలో ఆరితేరినది. దాని పోకిరీ పనులద్వారా జనాలను, దాని మంత్రాలద్వారా జాతులను వశం చేసుకొంది.
5 సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, “నేను నీకు విరోధిని. నీ చెంగులు నీ ముఖం మీదికెత్తి జనాలకు నీ దిగంబరత్వాన్ని చూపిస్తాను. రాజ్యాలకు నీ అవమానాన్ని చూపిస్తాను. 6 నీ మీద అశుద్ధం వేసి నలుగురి ఎదుట నిన్ను సిగ్గుపరుస్తాను. 7 అప్పుడు నిన్ను చూచేవారందరూ నీ దగ్గరినుంచి పారిపోయి ఇలా అంటారు: ‘నీనెవె పాడైపోయింది. దానికోసం ఎవరు విలపిస్తారు?’ నిన్ను ఓదార్చడానికి ఇష్టమున్నవాళ్ళను నేను ఎక్కడ వెదకాలి?”
8 నైలునది ఒడ్డున ఉన్న నో అమోనుకంటే నీ స్ధితి మెరుగైనదా? దాని చుట్టూరా నీళ్ళున్నాయి. దానికి రక్ష ఆ గొప్ప నది. ఆ జలం దానికి ప్రాకారంలాంటిది. 9 దానికి బలం కూషు, ఈజిప్ట్. దానికి సరిహద్దులు లేవు. పూతు, లూబీయా దానికి సహాయం.
10 అయినా, దాని నివాసులు బందీలై దేశాంతరం పోయారు. దాని చిన్న పిల్లలను ప్రతి అడ్డుత్రోవలో శత్రువులు క్రింద వేసి ముక్కలు చేశారు. దాని ఘనులమీద చీట్లువేశారు, గొప్పవారందరినీ సంకెళ్ళతో బంధించారు.
11 నీకు కూడా మైకమెక్కుతుంది. నీవు దాక్కొంటావు. శత్రువుల బారినుంచి ఆశ్రయంకోసం వెదకుతావు. 12 నీ కోటలన్నీ మొదట పక్వమైన పండ్లు గల అంజూరు చెట్లలాంటివి. అలాంటి చెట్లు కదిలిస్తే పండ్లు తినవచ్చినవారి నోట పడతాయి. 13 నీ నివాసులంతా స్త్రీలలాంటివాళ్ళు. నీ దేశద్వారాలు శత్రువుల ఎదుట తెరచి ఉన్నాయి. వాటి అడ్డకర్రలు మంటలపాలయ్యాయి. 14 వారు ముట్టడి వేసే కాలానికి నీళ్ళు చేదుకో! నీ కోటలను బలమైనవిగా చెయ్యి! జిగటమట్టిలోకి దిగి ఇటుకల బురద త్రొక్కు! కొలిమి సిద్ధం చెయ్యి! 15 అక్కడే మంటలు నిన్ను కాల్చివేస్తాయి. ఖడ్గం నిన్ను కూలుస్తుంది, మిడతలు తినివేసే విధంగా నిన్ను నాశనం చేస్తుంది. మిడతలలాగా, ఎగిరే మిడతలలాగా నీ సంఖ్యను పెంపొందించు. 16 నీ వర్తకుల సంఖ్య ఆకాశంలో కనిపించే నక్షత్రాల లెక్కకంటే ఎక్కువ. అయితే వాళ్ళు అంతా తినివేసి ఎగిరిపోయే మిడతలలాంటివాళ్ళు. 17 నీ రక్షకభటులు లెక్కకు మిడతలలాగా ఉన్నారు. నీ సైనికులు మిడతల గుంపులలాగా ఉన్నారు. అవి చలికి కంచెలలో దిగుతాయి. ప్రొద్దు పొడిస్తే అవి ఎగిరిపోతాయి. ఎక్కడికి పోతాయో ఎవరికి తెలియదు.
18 అష్షూరు రాజా! నీ కాపరులు నిద్రపోయారు, నీ ప్రముఖులు పడుకొన్నారు, నీ ప్రజలు కొండలమీద చెదరివున్నారు, వారిని పోగు చేయడానికి ఎవ్వడూ లేడు. 19 నీకు తగిలిన దెబ్బ చాలా ఘోరం. నీ గాయం కుదరనిది. నీ విషయం కబురు వినేవారంతా నీ పతనాన్ని గురించి చప్పట్లు కొడతారు. ఎందుకంటే, నీవు ఎడతెగకుండా పెట్టే హింసకు గురి కానివారు ఎవరు!