నహూము
1
1 ✽ఇది నీనెవె గురించిన దేవోక్తి✽: ఎల్‌కోషు✽ పురవాసి నహూముకు వచ్చిన దర్శనం✽ కలిగి ఉన్న గ్రంథం.2 ✽యెహోవా రోషం గల దేవుడు, ప్రతీకారం✽ చేసే దేవుడు. యెహోవా ప్రతిక్రియ చేస్తాడు. ఆయన తీవ్ర కోపం✽ గలవాడు. తన శత్రువులకు✽ ప్రతీకారం చేస్తాడు, విరోధుల మీద కోపగించుకొంటూ ఉంటాడు. 3 ✽యెహోవా త్వరగా కోపపడడు. ఆయన మహా బలాఢ్యుడు. అపరాధాలను శిక్షించకుండా ఉండడు.✽ ఆయన మార్గం తుఫానులో, సుడిగాలిలో ఉంది. మేఘాలు ఆయన పాదాలు కదిలించే ధూళిలాంటివి. 4 ✝ఆయన సముద్రాన్ని మందలిస్తాడు - అది ఆరిపోతుంది. నదులన్నీ ఇంకిపోయేలా చేస్తాడు. బాషాను, కర్మెలు వాడిపోతాయి. లెబానోను పువ్వులు ఎండిపోతాయి. 5 ఆయనంటే పర్వతాలు కంపిస్తాయి. కొండలు కరిగిపోతాయి. ఆయన ఎదుట భూమి, భూనివాసులంతా వణకిపోతారు. 6 ✝ఆయన కోపగిస్తే దాన్ని తట్టుకోగలవాడెవడు? ఆయన తీవ్రకోపం ఎదుట నిలబడగలవాడెవడు? ఆయన ఆగ్రహం అగ్ని✽ ప్రవాహంలాంటిది. ఆయన వస్తే బండలు బ్రద్దలవుతాయి. 7 ✽యెహోవా ఉత్తముడు. బాధకాలంలో ఆయన ఆశ్రయం✽ లాంటివాడు. తనమీద నమ్మకం✽ ఉంచినవారెవరో ఆయనకు తెలుసు.✽
8 ✽పొర్లిపారే వరదలాగా ఆయన ఆ స్థలాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. తన శత్రువులు చీకటిలో దిగేవరకూ ఆయన వాళ్ళను తరుముతాడు. 9 ✽మీరు యెహోవాకు విరోధంగా ఏమి పన్నినా✽ మిమ్ములను నాశనం చేస్తాడు. ఆపద రెండోసారి రాదు. 10 శత్రువులు ముండ్లలో చిక్కుబడతారు. ద్రాక్షమద్యం త్రాగి మత్తుగా ఉంటారు. ఎండిపోయిన దుబ్బులాగా కాలిపోతారు. 11 నీనెవె! యెహోవాకు విరోధంగా కుట్ర పన్ని దురాలోచన చెప్పేవాడొకడు నీలోనుంచి బయలుదేరాడు.
12 ✽యెహోవా అంటున్నాడు: “వాళ్ళు చాలామంది. పటుత్వం గలవాళ్ళు. అయినా వాళ్ళను నరికివేయడం జరుగుతుంది. వారు గతించిపోతారు. యూదా! నేను మిమ్మల్ని బాధించినా ఇకనుంచి బాధించను. 13 ✽వాళ్ళు మీమీద మోపిన కాడిని విరగొట్టేస్తాను. మీ కట్లు తెంపివేస్తాను.”
14 ✽నీనెవే! నిన్ను గురించి యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ఏమంటే “నీ పేరు పెట్టుకొనే వాడు ఇకనుంచి పుట్టడు. నీ దేవుళ్ళ గుళ్ళలోని చెక్కిన విగ్రహాలనూ పోత విగ్రహాలనూ నాశనం చేస్తాను. నీవు నీచుడివి✽ గనుక నిన్ను సమాధిపాలు చేస్తాను.”
15 ✽ఇదిగో! పర్వతాలమీద శుభవార్త తెచ్చేవాని పాదాలు వస్తున్నాయి! అతడు “శాంతి” చాటిస్తున్నాడు. యూదాప్రజలారా! మీ మహోత్సవాలు ఆచరించండి. మీ మొక్కుబళ్ళు చెల్లించండి. ఇకమీదట దుర్మార్గుడు దండెత్తి మీ దేశంలోకి రాడు. వాడు సమూల నాశనమయ్యాడు.