5
1 సైన్య సమూహాలు గల నగరమా! నీ సైన్య సమూహాలను సమకూర్చు. శత్రువులు మనలను ముట్టడించారు. వారు ఇస్రాయేల్ ప్రజల పరిపాలకుణ్ణి బెత్తంతో చెంపమీద కొడతారు. 2 “బేత్‌లెహేం ఎఫ్రాతా! యూదావారి కుటుంబాల మధ్య నీవు చిన్న గ్రామం. అయినా నాకోసం ఇస్రాయేల్‌ప్రజలను పరిపాలించబోయేవాడు నీలోనుంచి వస్తాడు. ఆయన పూర్వ కాలంనుంచి, అనాది కాలంనుంచి గమనంలో ఉండేవాడు.
3 అందుచేత ప్రసవవేదన పడబోయే ఆమె శిశువును కనేవరకు ఆయన ఇస్రాయేల్ ప్రజలను ఇతరులకు అప్పగిస్తాడు. అప్పుడు ఆయన సోదరులలో మిగిలినవారు ఇస్రాయేల్‌ప్రజల మధ్యకు తిరిగి చేరుతారు. 4 ఆయన యెహోవా బలంమూలంగా, తన దేవుడైన యెహోవా నామ మహత్తుచేత నిలుచుండి తన మందకు కాపరిగా ఉంటాడు. ఆయన మహాత్మ్యం భూమికొనలవరకు కనిపిస్తుంది. ఆయనే వారికి శాంతి అవుతాడు గనుక వారు నిర్భయంగా నివాసం చేస్తారు. 5 అష్షూరువాడు దండెత్తి మన దేశంలోకి వచ్చి మన భవనాలలో చొరబడేటప్పుడు వాణ్ణి ఎదిరించడానికి మేము ఏడుగురు కాపరులనూ ఎనిమిదిమంది నాయకులనూ నియమిస్తాం. 6 వారు ఖడ్గం చేతపట్టుకొని అష్షూరుదేశాన్ని దాని నగర ద్వారాలలో నిమ్రోదు దేశాన్ని పరిపాలిస్తారు. అష్షూరువాళ్ళు దండెత్తి మన సరిహద్దులను దాటి మన దేశంలోకి వచ్చేటప్పుడు వాళ్ళ బారినుంచి ఆయన మనలను రక్షిస్తాడు. 7 యాకోబు సంతానంలో మిగిలినవారు అనేక జనాలమధ్య నివసిస్తూ, యెహోవా కురిపించే మంచులాగా ఉంటారు. మనుషుల ప్రయత్నమూ ఆలోచనా లేకుండా గడ్డిమీద పడే వానలాగా ఉంటారు. 8 యాకోబు సంతతిలో మిగిలినవారు జనాలమధ్య, అనేక దేశాలవారి మధ్య నివసిస్తారు, అడవి మృగాలలో సింహం ఎలాగుంటుందో అలాగే ఉంటారు. గొర్రెల మందలలో కొదమ సింహంలాగా మందలోకి చొచ్చి ఎవ్వడూ గొర్రెలను విడిపించలేనంతగా వాటిని త్రొక్కుతూ, చీలుస్తూ ఉన్న కొదమ సింహంలాగా ఉంటారు. 9 మీ హస్తం మీ విరోధులమీద విజయం సాధిస్తుంది. మీ శత్రువులంతా నాశనమవుతారు.
10 యెహోవా చెప్పేదేమంటే, “ఆ రోజులలో నేను మీ మధ్య ఉన్న గుర్రాలన్నిటినీ లేకుండా చేస్తాను. మీ రథాలను ధ్వంసం చేస్తాను. 11 మీ దేశంలో ఉన్న పట్టణాలను నాశనం చేస్తాను. మీ కోటలన్నిటినీ పడకొట్టిస్తాను. 12 మీ మధ్య మంత్రవిద్య లేకుండా నిర్మూలం చేస్తాను. అప్పటినుంచి మీ మధ్య శకునగాండ్లు ఉండరు. 13 చెక్కిన విగ్రహాలూ దేవతాస్తంభాలూ మీ మధ్య లేకుండా నాశనం చేస్తాను. అప్పటినుంచి మీరు చేతులతో చేసినవాటికి మ్రొక్కరు. 14 మీ మధ్య ఉన్న అషేరాదేవి చిహ్నాలను నిర్మూలిస్తాను. మీ పట్టణాలను ధ్వంసం చేస్తాను. 15 నా మాట వినని ఇతర జనాలకు మహా కోపంతో ప్రతీకారం చేస్తాను.”