4
1 చివరి రోజులలో యెహోవా ఆలయ పర్వతం పర్వతాలన్నిట్లో ప్రధానమైనదిగా సుస్థిరం అవుతుంది. కొండలకంటే ఎత్తుగా ఉంటుంది. ప్రజలు ప్రవాహంలాగా అక్కడికి వస్తూ ఉంటారు. 2 ఆ కాలంలో అనేక దేశాలవారు వచ్చి ఇలా అంటారు: “యెహోవా పర్వతమెక్కి యాకోబు యొక్క దేవుని ఆలయానికి వెళ్దాం, రండి ఆయన తన విధానాలను మనకు నేర్పుతాడు. మనం ఆయన త్రోవల్లో నడచుకుందాం.” సీయోనులోనుంచి ఉపదేశం, జెరుసలంలో నుంచి యెహోవా వాక్కు వెలువడతాయి.
3 ఆయన అనేక జనాలకు మధ్యవర్తిగా న్యాయం తీరుస్తాడు, దూరంగా ఉన్న బలంగల వేరు వేరు దేశాలవారికి వివాదాలను పరిష్కరిస్తాడు. వారు తమ ఖడ్గాలను నాగటి నక్కులుగా, తమ ఈటెలను మచ్చుకత్తులుగా సాగగొట్టివేస్తారు. జనంమీదికి జనం ఖడ్గం ఎత్తకుండా ఉంటారు. యుద్ధ విద్య ఇకమీదట నేర్చుకోరు. 4 ఎవరి భయమూ లేకుండా ఒక్కొక్కరు తన తన ద్రాక్ష చెట్టుక్రింద, అంజూరు చెట్టు క్రింద కూర్చుంటారు. ఇది సేనల ప్రభువు యెహోవా నోటనుంచి వెలువడ్డ మాట. 5 కనుక ఇతర ప్రజలంతా తమ దేవుళ్ళ పేర తమ జీవిత విధానాలను అనుసరించినా, మనం మన దేవుడైన యెహోవా పేర శాశ్వతంగా నడచుకొంటాం.
6 యెహోవా ఇలా అంటున్నాడు: “ఆ రోజులలో నేను కుంటివారిని పోగు చేస్తాను, అవతలకు వెళ్ళగొట్టబడ్డవారినీ బాధకు గురి చేసినవారినీ సమకూర్చుకొంటాను. 7 కుంటి వారిని శేషంగా చేస్తాను, వెళ్ళగొట్టబడ్డవారిని బలమైన జనంగా చేస్తాను. యెహోవా సీయోను కొండమీద అప్పటినుంచి ఎల్లప్పుడూ వారిని పరిపాలిస్తాడు. 8 మందల కావలి గోపురమా! సీయోనుకుమార్తె పర్వతమా! మునుపటిలాగే అధికారం నీది అవుతుంది. రాజ్య పరిపాలన జెరుసలం కుమార్తెకు చేకూరుతుంది.”
9 ఇప్పుడు మీరెందుకు కేకలు వేస్తున్నారు? మీకు రాజు లేడా? మీ ఆలోచనకర్తలు నాశనమయ్యారా? స్త్రీ ప్రసవ వేదనలు పడినట్లు మీకీ వేదనలేమిటి? 10 సీయోనుకుమారీ! ప్రసవ వేదనలు పడే స్త్రీలాగా వేదనలతో అల్లాడిపోతూ ఉండు! ఇప్పుడు మీరు బయట నివాసం చేసేలా పట్టణం వదలిపెట్టండి. మీరు బబులోనుకు వెళ్తారు. అక్కడ మీరు విముక్తులవుతారు. అక్కడే యెహోవా మీకు శత్రువుల చేతిలోనుంచి మిమ్ములను విడిపిస్తాడు.
11 ఇప్పుడు అనేక దేశాల ప్రజలు మీమీదికి సమకూడి “సీయోను అపవిత్రం అవుతుంది గాక! దాని నాశనం మనం కండ్లారా చూడాలి!” అంటారు.
12 కానీ వారికి యెహోవా తలంపులు తెలియవు, ఆయన ఆలోచన అర్థం కాదు. మనుషులు కళ్ళంలో పనలు సమకూర్చే విధంగా యెహోవా వారిని సమకూర్చాడు. 13 “సీయోను కుమారీ! లేచి కళ్ళం త్రొక్కు. మీకు ఇనుప కొమ్ములూ కంచు డెక్కలూ ఇస్తాను. అనేక జనాలను మీరు అణగద్రొక్కుతారు” అంటాడు. వారికి దొరికిన లాభం మీరు యెహోవాకు సమర్పించాలి. వారి ఆస్తిపాస్తులు సర్వలోక ప్రభువుకు సమర్పించాలి.