3
1 ✽నేనిలా అన్నాను: “యాకోబు సంతతి నాయకులారా! ఇస్రాయేల్ ప్రజల అధిపతులారా! వినండి! న్యాయం అంటే ఏమిటో మీరు తెలుసుకోకూడదా?✽ 2 అయితే మీరు మంచిని అసహ్యించుకొంటారు✽. చెడుగే మీకు ఇష్టం. మీరు నా ప్రజల చర్మాన్ని ఒలిచివేసి వారి ఎముకలమీద ఉన్న మాంసం చీల్చివేస్తారు. 3 ✽నా ప్రజల మాంసాన్ని దిగమ్రింగివేస్తారు. వారి చర్మాన్ని ఒలిచి వారి ఎముకలను విరుగగొట్టేస్తారు. మనుషులు కుండలో వేసే ఎముకలలాగా, బిందెలో వేసే మాంసం లాగా వారిని ముక్కలు చేస్తారు.”4 ఆ తరువాత వాళ్ళు✽ యెహోవాకు ప్రార్థన చేస్తారు గాని ఆయన వాళ్ళకు జవాబేమి ఇవ్వడు✽. వాళ్ళు చేసిన చెడుగు కారణంగా ఆ కాలంలో ఆయన తన ముఖం వాళ్ళకు కనిపించకుండా✽ చేస్తాడు.
5 ✽నా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రవక్తలను గురించి యెహోవా చెప్పేదేమంటే, “తమకు భోజనం పెట్టేవారికి ‘క్షేమం’ అని బిగ్గరగా చెపుతారు. ఎవరైనా తమకు భోజనం పెట్టకపోతే వారిమీద పోరాటం జరిగించడానికి సిద్ధపడుతారు. 6 ✽అందుచేత మీకు దర్శనాలేమి రాకుండా రాత్రి కమ్ముకువస్తుంది. మిమ్ములను చీకటి ఆవరిస్తుంది. మీరు భవిష్యత్తు చెప్పలేక పోతారు. ఇలాంటి ప్రవక్తలకు ప్రొద్దు క్రుంకుతుంది. పగలు చీకటిగా మారిపోతుంది. 7 అప్పుడు దీర్ఘదర్శు✽లకు సిగ్గు కలుగుతుంది. సోదె చెప్పే వాళ్ళు పాలిపోతారు. దేవుడు జవాబేమి ఇవ్వకుండా ఉండడం చూచి నోటిని కప్పుకుంటారు.”
8 నేనైతే యాకోబు సంతానానికి వాళ్ళ అతిక్రమాలను, ఇస్రాయేల్ ప్రజలకు వాళ్ళ అపరాధాలను చాటించడానికి✽ యెహోవా ఆత్మ✽ మూలంగా బలప్రభావాలతోను న్యాయ బుద్ధి తోను ధైర్యంతోను నిండినవాణ్ణి. 9 యాకోబు ప్రజల నాయకులారా! ఇస్రాయేల్ ప్రజల అధిపతులారా! వినండి! మీరు న్యాయాన్ని ఏవగించుకొంటూ✽, సక్రమమైన వాటిని వక్రం చేస్తూ ఉండేవాళ్ళు. 10 ✝మీరు రక్తపాతంతో సీయోనును కట్టేవాళ్ళు, చెడుగుతో జెరుసలం నిర్మించేవాళ్ళు. 11 ✽దాని నాయకులు లంచం తీసుకొని తీర్పు చెప్తారు. యాజులు జీతానికి ఉపదేశిస్తారు, ప్రవక్తలు డబ్బుకోసం సోదె చెప్తారు. అయినా✽ వాళ్ళు యెహోవాను ఆనుకొని “యెహోవా మన మధ్య ఉన్నాడు గదా. ఏ విపత్తు మనమీదికి రాదు” అంటారు. 12 గనుక మీ కారణంగానే సీయోనును పొలంలాగా దున్నడం జరుగుతుంది. జెరుసలం రాళ్ళ కుప్ప అవుతుంది. ఆలయమున్న కొండ దట్టమైన చెట్లు పెరిగిన మట్టి దిబ్బ అవుతుంది.