2
1 ✽పడకలమీద పడుకొని వంచన విధానాలు కల్పించే వాళ్ళకూ దురాలోచనలు చేసేవాళ్ళకూ బాధ తప్పదు. వాటిప్రకారం చేయడానికి వాళ్ళు శక్తిమంతులు గనుక ప్రొద్దు పొడవగానే అలా చేస్తారు. 2 వాళ్ళు భూములనూ ఇండ్లనూ ఆశించి✽ ఆక్రమించుకొంటారు✽. ఇతరుల ఇండ్లనూ వారసత్వాన్నీ అన్యాయంగా పట్టుకొంటారు.3 అందుచేత యెహోవా చెప్పేదేమంటే, “నేను ఈ వంశస్థుల మీదికి విపత్తు రప్పించదలుస్తున్నాను✽. దాని క్రిందనుంచి మీ మెడలను వదలించుకోలేరు✽. ఆ ఆపద కాలం వచ్చేటప్పుడు మీరు గర్వంగా✽ నడవలేరు. 4 ✝ఆ కాలంలో మనుషులు మీ విషయం తిట్టుకవిత చెపుతారు. శోకరసం ఉట్టిపడే ఈ పాటతో ఎత్తిపొడుస్తారు: ‘మేము పూర్తిగా పాడైపోయాం! నా ప్రజల భూభాగాన్ని ఆయన ఇతర జనాలకు ఇచ్చాడు. అది నాకు లేకుండా చేశాడు. మా పొలాలు ద్రోహులకు పంచియిచ్చాడు.”
5 అందుచేత చీట్లు వేసి✽ మీకు భూమి పంచిపెట్టడానికి యెహోవా సమాజంలో ఎవరూ ఉండరు. 6 “మీరు ఏమీ ప్రకటించకూడదు✽. దీన్ని గురించి ప్రకటించకూడదు. మేము నిందలపాలు కాబోము” అని వాళ్ళు✽ ప్రకటన చేస్తారు. 7 ✽“యాకోబు వంశీయులారా! ‘యెహోవా సహనం తగ్గిపోయిందా? ఆయన ఇలాంటి పనులు చేస్తాడా?’ అని చెప్పడం యుక్తమా? యథార్థంగా ప్రవర్తించేవారికి నా మాటలు క్షేమం కలిగిస్తాయి గదా. 8 అయితే ఇటీవల నా ప్రజలు శత్రువులు✽గా నామీదికి లేచారు. యుద్ధరంగం నుంచి తిరిగి వచ్చి నిర్భయంగా దారిన పోతూ ఉంటే, వారు వేసుకొన్న పైవస్త్రాలను మీరు లాగివేస్తారు. 9 నా ప్రజలలో స్త్రీలను వారికి హాయిగొలిపే ఇండ్ల నుంచి పారదోలుతారు. వారి సంతానం మధ్య నా ఘనతను ఎన్నటికీ ఉండకుండా చేస్తున్నారు. 10 ✽మీరు లేచి వెళ్ళిపోండి! ఇక్కడ మీకు విశ్రాంతి కలగదు✽. ఈ స్థలం అశుద్ధమై సమూల నాశనానికి గురి అవుతుంది. 11 ✽మోసగాడు, అబద్ధికుడు ఎవడైనా వచ్చి ‘ఎక్కువ ద్రాక్షరసం, మద్యం ఇస్తే నేను మీతో దైవావేశంతో పలుకుతాను’ అని అబద్ధం చెప్తాడనుకోండి. అలాంటివాడే ఈ ప్రజలకు తగిన ప్రవక్త!
12 ✽“యాకోబు వంశంవారలారా! తరువాత మిమ్ముల నందరినీ పోగు చేసితీరుతాను. ఇస్రాయేల్ ప్రజలలో మిగిలినవారిని సమకూర్చి✽తీరుతాను. దొడ్డిలో ఉన్న గొర్రెలలాగా✽, మేత స్థలంలో ఉన్న మందలాగా వారిని సమకూరుస్తాను. ఈ స్థలాలలో అంతటా మనుషులు చేసే కలకలం వినబడుతూ ఉంటుంది. 13 ✽గోడలు పడగొట్టే వాడు వారికి ముందుగా వెళ్తాడు. వారు గుమ్మాన్ని పడగొట్టి దానిగుండా బయటికి వస్తారు. వారి రాజు వారికి ముందుగా నడుస్తాడు. యెహోవా తానే వారికి నాయకుడుగా ఉంటాడు.”