మీకా
1
1 ఇది యోతాం, ఆహాజు, హిజ్కియా అనే యూదా దేశం రాజుల రోజులలో మోరెషతు పురవాసి మీకాకు యెహోవానుంచి వచ్చిన వాక్కు. ఇది షోమ్రోను, జెరుసలం గురించి దర్శనరీతిగా వచ్చింది.
2 జనాల్లారా! మీరంతా ఆలకించండి! లోకమా! సర్వ భూనివాసులారా! చెవి ఒగ్గి వినండి! ప్రభువైన యెహోవా మీమీద సాక్ష్యం చెప్పబోతున్నాడు, ప్రభువు తన పవిత్రాలయంలో ఉండి మాట్లాడబోతున్నాడు. 3 ఇదిగో! యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుతున్నాడు! ఆయన దిగి భూమిమీది ఎత్తయిన స్థలాలపై నడుస్తూ ఉన్నాడు! 4 ఆయన పాదాలక్రింద పర్వతాలు నిప్పుకు కరిగిపోయే మైనంలాగా కరిగిపోతున్నాయి. లోయలు చీలిపోతున్నాయి. వాలుమీద పడ్డ నీళ్ళు పారే విధంగా అవి కరిగి పారుతున్నాయి. 5 దీనంతటికీ కారణం యాకోబు వంశీయుల అపరాధాలు. యాకోబు వంశీయుల తిరుగుబాటుకు మూలం ఏది? షోమ్రోనులోనే గదా. యూదా దేశస్థుల ఎత్తయిన పూజాస్థలం ఉండేది ఎక్కడ? జెరుసలంలోనే గదా.
6 “అందుచేత నేను షోమ్రోనును పొలంలో ఉన్న రాళ్ళ కుప్పలాగా చేస్తాను, ద్రాక్షతోటలను నాటేస్థలంగా చేస్తాను. దాని రాళ్ళు లోయలో పారబోస్తాను, దాని పునాదులు కనబడేలా చేస్తాను. 7 షోమ్రోనులో ఉన్న చెక్కుడు బొమ్మలు చిన్నాభిన్నం అవుతాయి. దాని కానుకలు మంటలపాలవుతాయి. నేను దానిలో ఉన్న విగ్రహాలన్నిటినీ పాడు చేస్తాను. వేశ్యల సంపాదన చేత షోమ్రోను వాటిని పోగు చేసింది. అవి మళ్ళీ వేశ్యల సంపాదన అవుతాయి.”
8 ఈ కారణంచేత నేను కేకలుపెట్టి విలపిస్తాను. చెప్పులూ బట్టలూ వేసుకోకుండా తిరుగుతాను. నక్కలలాగా అరుస్తాను. నిప్పుకోళ్ళలాగా మూలుగుతాను. 9 షోమ్రోనుకు తగిలిన గాయాలు నయం కానివి. అవి యూదాదేశానికి కూడా తగిలాయి. అవి జెరుసలం వరకు - నా ప్రజాద్వారాలవరకు - వ్యాపించాయి. 10 ఈ సంగతి గాతులో చెప్పకు. అక్కడ ఏమాత్రం ఏడ్వకు. బేత్‌లెయప్రలో ధూళిలో పడి పొర్లాలి. 11 షాఫీరు పురవాసులారా, దిగంబరులై సిగ్గుపడుతూ వెళ్ళిపోండి. జయనాను కాపురస్థులు బయలుదేరలేక పోతున్నారు, బేత్‌ఎజెల్‌లో విలాపం వినబడుతూ ఉంది. అక్కడ మీకు ఆధారం లేకుండా పోయింది. 12 మారోతు గ్రామ వాసులు తాము కోల్పోయిన క్షేమం కారణంగా బాధ అనుభవిస్తున్నారు. ఎందుకంటే, యెహోవా విపత్తు కలిగించాడు. అది జెరుసలం ద్వారాలవరకూ వచ్చింది. 13 లాకీషు పట్టణస్థులారా! రథాలకు యుద్ధాశ్వాలను పూన్చండి. ఇస్రాయేల్ ప్రజ చేసిన తిరుగుబాట్లు మీ మధ్య కనిపించాయి. మీరు సీయోను కుమార్తె అపరాధానికి ప్రథమ కారణంగా ఉన్నారు. 14 మీరు విడుదలకోసం మోరెషత్‌గాతుకు కానుకలిస్తారు. అక్‌జీబు ఊరు ఇస్రాయేల్ రాజులను మోసగిస్తుంది. 15 మారేషా పురవాసులారా! మిమ్ములను వశపరచుకొనేవాణ్ణి మీమీదికి నేను రప్పిస్తాను. ఇస్రాయేల్ ప్రజల్లో ఉన్న ఘనుడు అదుల్లాంకు వెళ్ళిపోతాడు. 16 మీ తలలు బోడి చేసుకోండి. ప్రియమైన పిల్లలు బందీలుగా దేశాంతరం వెళ్ళిపోతారు. రాబందులాగా మీ బోడితనం ఎక్కువ చేసుకోండి.