3
1 ఆ తరువాత రెండోసారి✽ యెహోవానుంచి యోనాకు ఈ వాక్కు వచ్చింది: 2 “నీవు లేచి నీనెవె మహా నగరానికి వెళ్ళి నేను నీకు ఇవ్వబోయే సందేశం దానికి చాటించు✽.”3 యోనా యెహోవా ఇచ్చిన ఆజ్ఞ శిరసావహించి✽ నీనెవెకు వెళ్ళాడు. ఆ నగరం దేవుని అంచనాలో గొప్పది. అది మూడు రోజుల✽ ప్రయాణమంత పెద్దది. 4 ✽యోనా నగరంలో రోజు ప్రయాణమంత దూరం వెళ్ళి “ఇంకా నలభై రోజులకు నీనెవె నాశనం అవుతుంది” అంటూ ప్రకటన చేశాడు.
5 ✽నీనెవె నగరవాసులు దేవుణ్ణి నమ్మారు. ఉపవాసం కోసం సమయం నిర్ణయించి చాటించారు. అందరూ - ఘనులు గానీ అల్పులు గానీ - గోనె పట్ట✽ కట్టుకొన్నారు.
6 ✽ఆ సంగతి నీనెవె రాజుకు వినబడ్డప్పుడు అతడు సింహాసనం దిగి రాజ వస్త్రాన్ని తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిద✽లో కూర్చున్నాడు. 7 అప్పుడతడు నీనెవెలో ఒక ప్రకటన చేయించాడు: “రాజూ, రాజ మంత్రులూ ఆజ్ఞాపించేదేమంటే, ఎవ్వరూ దేనినీ తినకూడదు, త్రాగకూడదు✽. పశువులూ ఎద్దులూ గొర్రెలూ మేత మేయకూడదు, అవి కూడా నీళ్ళు త్రాగకూడదు. 8 మనుషులూ పశువులూ గోనెపట్టతో కప్పబడాలి. అందరూ తమ దుర్మార్గాలను విడిచిపెట్టి దౌర్జన్యం✽ చేయడం మాని మనసారా దేవునికి ప్రార్థన చేయాలి. 9 ఒకవేళ దేవునికి మనసు కరుగుతుందేమో. ఎవరికి తెలుసు✽? ఒకవేళ ఆయన జాలిపడి తన కోపాగ్ని చల్లార్చి మనల్ని నాశనం చేయకుండా ఉంటాడేమో.”
10 ✽నీనెవెవారు ఇలా చేయడం - వారి చెడు ప్రవర్తన వదలిపెట్టడం - చూచి దేవుడు వారిమీద జాలిపడ్డాడు, వారికి చేస్తానన్న కీడు✽ చేయలేదు.