4
1 ఇది యోనా దృష్టికి ఎంతమాత్రం మంచి అనిపించలేదు. అతడు కోపంతో✽ మండిపడ్డాడు. 2 ✽ “యెహోవా! నేను నా దేశంలో ఇంకా ఉన్నప్పుడు ఇలా జరుగుతుందని నేను చెప్పాను గదా! అందుకనే తర్‌షీషుకు పారిపోవడానికి త్వరపడ్డాను. నీవు దయాదాక్షిణ్యం గల దేవుడివనీ త్వరగా కోపగించేవాడివి కావనీ కరుణామయుడివనీ విపత్తు కలిగించడానికి వెనక్కు తీసేవాడివనీ నాకు తెలుసు. 3 ఇప్పుడు నాకు బతికేకంటే చావే మేలనిపిస్తుంది. యెహోవా! నా ప్రాణం✽ తియ్యి!” అంటూ యెహోవాను ప్రార్ధించాడు.4 ✽అందుకు యెహోవా “నీవిలా మండిపడడం మంచిదా?” అని అడిగాడు.
5 తరువాత యోనా నగరం బయటికి వెళ్ళి దానికి తూర్పుగా ఒక చోట కూర్చున్నాడు. అక్కడ ఒక పందిరి వేసికొని దాని నీడలో కూర్చుని నగరానికి ఏమి సంభవిస్తుందో✽ చూద్దామని అక్కడే ఉండిపోయాడు. 6 యోనాకు కలిగిన బాధను పోగొట్టడానికి ఒక సొర చెట్టు పెరిగి అతడి తలకు పైగా నీడ ఇచ్చేలా యెహోవా దేవుడు సిద్ధం చేసి ఉంచాడు✽. సొరచెట్టును చూచి యోనా ఎంతో సంతోషించాడు. 7 ✽మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగును సిద్ధం చేసి ఉంచాడు. అది ఆ చెట్టును తొలిచింది. చెట్టు వాడిపోయింది. 8 ✽ప్రొద్దు పొడిచినప్పుడు దేవుడు చాలా వేడిగల తూర్పు గాలిని సిద్ధం చేశాడు. యోనా తలకు ఎండ దెబ్బ తగిలింది. అతడు నీరసించిపోతూ, చావాలని కోరుతూ, “నాకు బతకడం కంటే చావడమే మేలనిపిస్తుంది” అన్నాడు. 9 యెహోవా “ఆ సొరచెట్టు విషయం నీవు కోపంతో మండిపడడం మంచిదా?” అని యోనాను అడిగాడు. యోనా “మంచిదే✽! ప్రాణం పోయేటంతగా మండి పడుతున్నాను” అన్నాడు.
10 ✽అందుకు యెహోవా ఇలా అన్నాడు: “నీవు ఆ సొరచెట్టును పెంచలేదు. అది నీ కష్టఫలం కాదు. ఒక్క రాత్రిలో మొలిచి పెరిగింది, ఒక్క రాత్రిలో వాడిపోయి చచ్చింది. అయినా దాని విషయం నీకు శ్రద్ధాసక్తులున్నాయి. 11 నీనెవెలో కుడి యెడమలు తెలియని లక్ష ఇరవై వేల మందికంటే ఎక్కువమంది ఉన్నారు. చాలా పశువులు కూడా ఉన్నాయి. ఆ మహా నగరం విషయం నాకు శ్రద్ధాసక్తులు ఉండకూడదా?”