2
1 ✽ఆ చేప కడుపులో ఉండి యోనా తన దేవుడు యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు: 2 ✝“నా ఆపదలో నేను కంఠమెత్తి యెహోవాకు మొరపెట్టాను✽. ఆయన నాకు జవాబిచ్చాడు. మృత్యులోకం✽లో ఉండి సహాయంకోసం నిన్ను ప్రాధేయ పడ్డప్పుడు నా ప్రార్థన అంగీకరించావు✽. 3 నీవు✽ నన్ను అగాధంలో సముద్ర గర్భంలో పడవేశావు. ప్రవాహాలు నన్ను ఆవరించాయి. నీ అలలూ తరంగాలూ✽ నన్ను ముంచి వేశాయి. 4 ✝అప్పుడు నేను నీ సన్నిధానం నుంచి త్రోసి వేయబడ్డాను. అయినా✽ నీ పవిత్రాలయం✽వైపు తిరిగి చూస్తాను అనుకొన్నాను. 5 ✝నీళ్ళు నన్ను చుట్టుకోవడం మూలంగా నేను కొనప్రాణంతో ఉన్నాను. అగాధం నన్ను ఆవరించింది. సముద్రం నాచు నా తలకు చుట్టుకొంది. 6 పర్వతాల పునాదులవరకు నేను దిగాను. నేను ఇంకెన్నడూ పైకి రాకుండా భూమి గడియలు నన్ను మూసివేశాయి. అయితే, నా దేవా, యెహోవా! నీవు నా ప్రాణం నాశనకరమైన అగాధం✽లో నుంచి పైకి తీసుకువచ్చావు. 7 ✽ నా ప్రాణం కృశిస్తూ ఉంటే, యెహోవా, నిన్ను జ్ఞాపకం చేసుకొన్నాను. నా ప్రార్థన నీ పవిత్ర ఆలయానికీ నీ సన్నిధానానికీ చేరింది. 8 మోసకరమైన వట్టి విగ్రహాలను✽ పూజించేవాళ్ళు తాము పొందగల అనుగ్రహం వదలివేస్తున్నారు✽. 9 ✽నేను నీకే స్తుతిపాట పాడుతూ బలి సమర్పిస్తాను, నేను మొక్కుకొన్నదాన్ని✽ తప్పక చెల్లిస్తాను✽. రక్షణ యెహోవాదే✽.” 10 అప్పుడు యెహోవా ఆ చేపతో ఒక మాట చెప్పాడు✽. చేప యోనాను ఎండిన నేలమీద కక్కివేసింది.