యోనా
1
1 యెహోవానుంచి అమిత్తయి కొడుకు యోనాకు ఈ వాక్కు వచ్చింది: 2 “నీవు లేచి నీనెవె అనే మహా నగరానికి వెళ్ళి దానికి వ్యతిరేకంగా నోరెత్తి పలుకు. ఎందుకంటే, దానిలో ఉన్న చెడుతనం నా దృష్టిలో చాలా ఘోరం అయింది.”
3 అయితే యోనా యెహోవా సన్నిధానంనుంచి తర్‌షీషుకు పారిపోదామని యొప్పేకు వెళ్ళాడు. అక్కడ తర్‌షీషుకు పోయే ఓడ చూచి ప్రయాణంకోసం డబ్బిచ్చి ఓడ ఎక్కి ఓడవారితో పాటు ప్రయాణమయ్యాడు. యెహోవా సముఖంనుంచి పారిపోవాలనుకొన్నాడు. 4 అయితే యెహోవా సముద్రంమీద పెనుగాలి పుట్టించాడు. ఓడ బ్రద్దలైపోయే అపాయం వచ్చేటంతగా సముద్రంలో తీవ్రమైన తుఫాను రేగింది. 5 నావికులకు భయం పుట్టింది. ఒక్కొక్కడు తన తన దేవుడికి మొర పెట్టాడు, ఓడ తేలిక చేయడానికి వారు దానిలో ఉన్న సరుకులు సముద్రంలో పారవేశారు. అంతలో యోనా ఓడ లోపలి భాగానికి వెళ్ళి పడుకొని బాగా నిద్రపోయాడు.
6 ఓడ నాయకుడు యోనాదగ్గరికి వెళ్ళి, “ఓరీ! నువ్విలా నిద్రపోతున్నావా? లేచి నీ దేవుడికి మొరపెట్టు! ఒకవేళ ఆయన మనలను గమనించి మనం నాశనం కాకుండా చేస్తాడేమో” అన్నాడు.
7 అప్పుడు నావికులు “ఎవరి కారణంగా ఈ ఆపద మనమీదికి వచ్చిందో చీట్లు వేసి తెలుసుకొందాం, పట్టండి” అని చెప్పుకొన్నారు. వారు చీట్లు వేసినప్పుడు చీటి యోనా పేర వచ్చింది.
8 కాబట్టి వారు అతణ్ణి చూచి, “ఎవరి కారణంగా ఈ ఆపద మనమీదికి వచ్చిందో మాకు చెప్పు. నీ వ్యాపారమేమిటి? నువ్వెక్కణ్ణుంచి వచ్చావు? నీదే దేశం? నీదే జనం? మాకు చెప్పు” అని అడిగారు.
9 అందుకు యోనా “నేను హీబ్రూవాణ్ణి. యెహోవా పట్ల భయభక్తులున్నవాణ్ణి. ఆయన ఆకాశాన్నీ భూమినీ సృజించిన పరలోక దేవుడు” అని జవాబిచ్చాడు.
10 అప్పుడు వారికి మహా భయం వేసింది. యోనా యెహోవా సన్నిధానంనుంచి పారిపోతున్నట్టు వారికి తెలుసు. అతడా సంగతి వారికి చెప్పాడు. “నువ్వు ఇలా ఎందుకు చేశావు?” అని వారు అడిగారు.
11 సముద్రం మరీ ఎక్కువగా పొంగసాగింది గనుక వారు యోనాను చూచి “సముద్రం మా మీదికి రాకుండా ప్రశాంతం అయ్యేలా మేము నీకేం చేయాలి?”
12 అందుకు యోనా “నా కారణంగానే ఈ పెను తుఫాను మీమీదికి వచ్చిందని నాకు తెలుసు. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి. అప్పుడు సముద్రం మీమీదికి రాకుండా ప్రశాంతమవుతుంది” అని జవాబిచ్చాడు.
13 అయినా, వారు ఓడను సముద్రం ఒడ్డుకు చేర్చడానికి తెడ్లు చాలా బలంగా వేశారు గానీ గాలి వారికి ఎదురు కావడంచేతా సముద్రం మునుపటికంటే మరీ ఎక్కువగా పొంగుతూ ఉండడంవల్లా వారి ప్రయత్నం సఫలం కాలేదు. 14 అప్పుడు వారు యెహోవాకు ఇలా ప్రార్థన చేశారు: “యెహోవా! నీవు ఇష్టం వచ్చినట్లు ఇలా జరిగించావు. మేము ఈ మనిషి ప్రాణం తీసినందుకు మమ్మల్ని నాశనం చేయవద్దు. నిర్దోషి చావు విషయం మామీద నేరం మోపవద్దు.”
15 అప్పుడు వారు యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారు. వెంటనే పొంగుతూ ఉన్న సముద్రం ప్రశాంతం అయింది. 16 అందుచేత ఆ మనుషులు యెహోవాకు ఎంతో భయపడి యెహోవాకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేశారు.
17 అంతలో బ్రహ్మాండమైన చేప యోనాను మ్రింగివేసేలా యెహోవా నియమించాడు. యోనా మూడు రోజులు, రాత్రింబగళ్ళు, ఆ చేప కడుపులో ఉన్నాడు.