8
1 ప్రభువైన యెహోవా దర్శన రీతిగా నాకు కనుపరచినది ఇది: వేసవికాలం పండ్లు ఉన్న గంప ఉంది. 2 “ఆమోసు! నీకేమి కనిపిస్తున్నది?” అని ఆయన అడిగాడు.
“వేసవి కాలం పండ్లు ఉన్న గంప కనిపిస్తున్నద”ని నేను జవాబిచ్చాను. అప్పుడు యెహోవా నాతో అన్నాడు, “నా ఇస్రాయేల్ ప్రజలకు కాలం పండింది. ఇకమీదట నేను వారిని శిక్షించకుండా ఉండను. 3 గుడిలో వారు పాడే పాటలు ఆ రోజు గోలకు మారుతాయి. చాలా శవాలు ఉంటాయి. అవి అంతటా పడి ఉంటాయి. ఊరుకో! ఇది ప్రభువైన యెహోవా వాక్కు”.
4 దేశంలో దీనావస్థలో ఉన్న భక్తులు నిర్మూలం కావాలని ఆ బీదలను మింగి వేసేవారలారా! 5 అలా చేస్తూ “మనం ధాన్యం అమ్ముకోవడానికి అమావాస్య ఎప్పుడు పోతుందో, గోధుమల వ్యాపారం చేసుకొనేందుకు విశ్రాంతి దినం ఎప్పుడు గడచి పోతుందో” అని చెప్పుకొంటారు. మీరు కొలతగంప చిన్నదిగా చేస్తారు. మోసం చేసి ఎక్కువ డబ్బు తీసుకుంటారు. దొంగ త్రాసు చేసి వంచిస్తారు. 6 తాలు ధాన్యం కూడా అమ్మివేస్తూ దిక్కులేని వారిని వెండికి కొంటారు, చెప్పులు ఇచ్చి బీదలను కొంటారు. ఇప్పుడు వినండి!
7 యాకోబు అతిశయాస్పదం తోడని యెహోవా ఇలా ప్రమాణం చేశాడు: “వారు చేసిన పనులలో ఒకటి కూడా నేను ఎన్నటికీ మరువను. 8 ఈ కారణం చేత ఈ దేశం కంపించదా? దేశవాసులందరూ దుఃఖపడరా? నైలునదిలాగా ఈ దేశమంతా లేస్తుంది. ఈజిప్ట్‌లోని నదిలాగా పొంగుతుంది. తరువాత దానిలాగా అణగిపోతుంది.”
9  ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, “ఆ రోజున మధ్యాహ్న కాలంలో ప్రొద్దు క్రుంకేలా నేను చేస్తాను, పట్టపగటి వేళ భూమికి చీకటి కమ్మేలా చేస్తాను. 10 మీ ఉత్సవాలు విలాపానికి మారుస్తాను, మీ పాటలన్నీ విషాద గీతాలకు మారుస్తాను. మీరంతా నడుముకు గోనెపట్ట కట్టుకొనేలా తలలు బోడి చేసుకొనేలా చేస్తాను. ఒకే ఒక కుమారుడి చావుకు పుట్టిన శోకంలాంటి శోకాన్ని పుట్టిస్తాను. ఆ రోజుల ముగింపు ఘోరమైన బాధ కాలంగా ఉంటుంది.”
11 ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే “రాబోయే రోజులలో నేను ఈ దేశంలో కరవు పుట్టిస్తాను. ఆహారానికి నీళ్ళకూ కరవు కాదు, యెహోవా వాక్కులు వినే అవకాశాలు కరవైపోయేలా చేస్తాను. 12  అప్పుడు ప్రజలు యెహోవా వాక్కు విందామని వెదకుతూ ఆ సముద్రం నుంచి ఈ సముద్రం వరకు, ఉత్తర దిక్కునుంచి తూర్పు దిక్కు వరకు తిరుగుతారు గానీ యెహోవా వాక్కు వారికి దొరకదు. 13 ఆ రోజుల్లో చక్కని కన్యలూ యువకులూ దప్పికి మూర్ఛపోతారు. 14 షోమ్రోను వారి అపరాధానికి కారణమైనదానితోడని ఒట్టుపెట్టుకొనే వారు కూలుతారు. ‘దానూ! నీ దేవుడి జీవంతోడు’, లేక ‘బేర్‌షెబాలోని దేవుడి జీవంతోడు’ అని ప్రమాణం చేసేవాళ్ళు కూలుతారు. మళ్ళీ ఎన్నడూ నిలబడరు.”