7
1 ప్రభువైన యెహోవా నాకు కనుపరచినది ఇది: రాజుకు రావలసిన కోత తరువాత గడ్డి మళ్ళీ మొలిచినప్పుడు యెహోవా మిడతల గుంపును పుట్టించాడు. 2 మొలిచినదంతా ఆ మిడతలు తినివేశాయి. అది చూచి నేను “యెహోవా! ప్రభూ! యాకోబు వంశం ఎలా నిలిచి ఉంటుంది? వాళ్ళు అల్పజనంగా ఉన్నారు గదా. నీవు దయ ఉంచి వారిని క్షమించు” అని మనవి చేశాను. 3 యెహోవాకు మనసు కరిగింది. “అలా జరగదు” అన్నాడు.
4 ప్రభువైన యెహోవా దర్శనరీతిగా నాకు కనుపరచినది ఇది: ప్రభువైన యెహోవా వారిని దండించడానికి మంటలను రప్పించాడు. అవి వచ్చి మహా జలాగాధాన్ని ఇంకించి వారసత్వ భూమిని మ్రింగి వేయసాగింది. 5 అప్పుడు నేను “యెహోవా! ప్రభూ! దయ ఉంచి అలా చేయవద్దు! చేస్తే యాకోబు వంశం ఎలా నిలిచి ఉంటుంది? వారు అల్ప జనం కదా” అని మనవి చేశాను. 6 యెహోవాకు మనసు కరిగింది. “అదికూడా జరగదు” అన్నాడు.
7 ప్రభువు నాకు కనుపరచింది ఇది: ఆయన సీసం గుండు చేత పట్టుకొని చక్కగా కట్టి ఉన్న గోడమీద నిలబడి ఉన్నాడు. 8 యెహోవా “ఆమోసూ! నీకేమి కనిపిస్తున్నది?” అని నన్ను అడిగాడు. “సీసం గుండు కనిపిస్తున్నద”ని నేను జవాబిచ్చాను. అందుకు ప్రభువు అన్నాడు, “నా ఇస్రాయేల్ ప్రజల మధ్య సీసం గుండు వేయబోతున్నాను. ఇకమీదట వారిని శిక్షించకుండా ఉండను. 9 ఇస్సాకు వంశస్థులు కట్టుకొన్న ఎత్తయిన పూజా స్థలాలు పాడవుతాయి. ఇస్రాయేల్ ప్రజల గుళ్ళు నాశనం అవుతాయి. నేను ఖడ్గం చేతపట్టుకొని యరొబాం రాజవంశం వారి మీద పడుతాను.”
10 తరువాత బేతేల్‌లో ఉన్న అమజ్యా అనే యాజి ఇస్రాయేల్ రాజైన యరొబాంకు ఇలా కబురంపాడు: “ఇస్రాయేల్ ప్రజల మధ్యలోనే ఆమోసు నీ మీద కుట్ర చేస్తున్నాడు. 11 యరొబాం ఖడ్గంచేత చస్తాడనీ ఇస్రాయేల్ ప్రజ ఈ దేశంనుంచి బందీలుగా పోతారనీ అతడు చాటిస్తున్నాడు. అతడి మాటలు దేశం ఓర్చుకోవడం అసాధ్యం.”
12 అప్పుడు అమజ్యా ఆమోసుతో ఇలా అన్నాడు: “దీర్ఘదర్శీ! వెళ్ళిపో! యూదా దేశానికి పారిపో! అక్కడే బత్తెం సంపాదించుకో. అక్కడే నీ వార్తలు చాటించు. 13 బేతేల్‌లో మాత్రం నీ వార్తలు చాటించకు. రాజు గుడి ఇక్కడ ఉంది. రాజభవనం ఉంది.”
14 ఆమోసు అమజ్యాకు ఇలా జవాబిచ్చాడు: “మునుపు నేను ప్రవక్తను కాను, ప్రవక్త కొడుకునూ కాను. నేను గొర్రెలు కాస్తూ మేడి పండ్లు ఏరుకొంటూ ఉండే వాణ్ణి. 15 నేను మందలను కాస్తూ ఉంటే యెహోవా నన్ను పిలిచి ‘నీవు వెళ్ళి నా ఇస్రాయేల్ ప్రజలకు నా మూలంగా పలుకు’ అన్నాడు. 16 అందుచేత యెహోవా చెప్పేది నీవు విను. నీవంటావు గదా, ‘ఇస్రాయేల్ ప్రజల విషయం నీ వార్తలు చాటించకు, ఇస్సాకు వంశం వారి విషయం మాట జారకూడద’ని. 17 కనుక యెహోవా చెప్పేదేమిటంటే, నీ భార్య పట్టణంలో వేశ్య అవుతుంది. నీ కొడుకులూ కూతుళ్ళూ కత్తిపాలవుతారు. ఇతరులు నీ భూమి కొలత తీసుకొని పంచుకొంటారు. నీవు అశుద్ధప్రదేశంలో చస్తావు. తప్పని సరిగా ఇస్రాయేల్ ప్రజలు తమ దేశం నుంచి బందీలుగా పోతారు.”