6
1 సీయోనులో అశ్రద్ధగా బ్రతికేవాళ్ళకు బాధ తప్పదు. షోమ్రోను కొండమీద నిర్భయంగా నివసించేవాళ్ళకు బాధ తప్పదు. జనాలమధ్య ప్రముఖ జనంలో ప్రసిద్ధులుగా, ఇస్రాయేల్ ప్రజకు ఆలోచనకర్తలుగా ఉన్నవాళ్ళకు బాధ తప్పదు. 2 మీరు కల్నే వెళ్ళి చూడండి. అక్కడనుండి మహాహమాతు నగరానికి వెళ్ళండి. తరువాత ఫిలిష్తీయలో ఉన్న గాతుకు వెళ్ళండి. అవి ఈ రాజ్యంకంటే గొప్పవి గదా. వాటి సరిహద్దులు మీ సరిహద్దులకంటే విశాలమైనవి గదా. 3 మీరు విపత్తు రోజు దూరంగా ఉందనుకొని దౌర్జన్య పరిపాలన శీఘ్రంగా రప్పించిన వారవుతున్నారు. 4 దంతపు మంచాలమీద పడుకొంటారు, పరుపులపై ఒరుగుతారు. మందలోనుంచి శ్రేష్ఠమైన గొర్రెపిల్లలను, కొట్టంలోనుంచి క్రొవ్విన దూడలను వధించి తింటారు. 5 తంతివాద్యాలు వాయిస్తూ వెర్రి పాటలు పాడుతారు. దావీదులాగా వాద్యవిశేషాలు కల్పించుకొంటారు. 6 ద్రాక్షరసంతో పాత్రలు నింపి త్రాగుతారు. పరిమళ తైలాలు పూసుకొంటారు. అయితే యోసేపు సంతతివారికి వచ్చే నాశనం విషయం వాళ్ళకు విచారమేమీ లేదు. 7 అందుచేత బందీలుగా దేశాంతరం పోయేవారిలో వీళ్ళే మొట్టమొదటి వాళ్ళవుతారు. అప్పుడు ఈ సుఖాసక్తుల ఉత్సవ ధ్వనులు గతించిపోతాయి.
8 “యాకోబు వంశీయుల గర్వం నాకు అసహ్యం. వారి భవనాలంటే నాకు ద్వేషం. వాళ్ళ పట్టణాలనూ వాటిలో ఉన్నదంతా శత్రువుల వశం చేస్తాన”ని ప్రభువైన యెహోవా తనతోడని ప్రమాణం చేశాడు. ఇది సేనలప్రభువైన యెహోవా దేవుని వాక్కు.
9 ఒక్క కుటుంబంలో పదిమంది ఉన్నా వాళ్ళంతా చస్తారు. 10 ఆ శవాలను ఇంట్లోనుంచి ఎత్తుకుపోవడానికి ఒక బంధువు వాటిని దహనం చేయబోయే వాడితోపాటు వస్తాడనుకోండి. ఇంట్లో ఎవరైనా దాక్కొని ఉంటే, అతణ్ణి చూచి “మీతో కూడా ఇంకా ఎవరైనా ఉన్నారా?” అని అడిగితే ఆ వ్యక్తి “ఎవరూ లేరు” అంటాడు. అప్పుడు “ఊరుకోండి! యెహోవా పేరును జ్ఞప్తికి తేకూడదు” అంటాడు. 11 ఎందుకంటే, యెహోవా ఇచ్చిన ఆజ్ఞానుసారంగా గొప్ప కుటుంబాలూ చిన్న కుటుంబాలూ పాడవుతాయి. చిన్నాభిన్నమవుతాయి. 12 గుర్రాలు బండలమీద పరుగెత్తుతాయా? బండలమీద ఎవరైనా ఎద్దులతో దున్నుతారా? మీరైతే న్యాయాన్ని విషతుల్యం చేశారు. ధర్మఫలాన్ని చేదుకు మార్చారు.
13 “మాకు మా బలం చేతనే ప్రభావం కలిగింది” అంటూ మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషిస్తారు. 14 అయితే సేనల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, “ఇస్రాయేల్ ప్రజలారా! నేను మీమీదికి ఒక జనాన్ని రప్పిస్తాను. వాళ్ళు హమాతు ప్రదేశం దగ్గర మొదలుకొని అరాబా లోయలోని నది వరకు మిమ్ములను బాధిస్తారు.”