5
1 ✽ఇస్రాయేల్ ప్రజలారా! మిమ్ములను గురించి నేనెత్తే ఈ మాట, ఈ విలాపం వినండి: 2 “కన్యక అయి ఉన్న ఇస్రాయేల్✽ పతనం అయింది. అది ఇంకా ఎన్నడూ లేవదు✽. లేవనెత్తేవారెవ్వరూ లేక అది తన భూమిమీద పడి ఉంది”. 3 ✝ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, “ఇస్రాయేల్ ప్రజలో ఒక పట్టణం నుంచి వెయ్యిమంది బయలు దేరితే వందమంది మాత్రమే తప్పించుకొని తిరిగి వస్తారు. వందమంది బయలుదేరితే పదిమంది మాత్రమే తప్పించుకు వస్తారు.”4 యెహోవా ఇస్రాయేల్ ప్రజతో ఇలా అంటున్నాడు: “నన్ను వెదికి బ్రతకండి✽. 5 బేతేల్‌ను వెదకకండి. గిల్‌గాల్✽లో అడుగు పెట్టకండి. బేర్షెబా✽కు పయనించకండి. గిల్‌గాల్ వారు తప్పని సరిగా బందీలుగా దేశాంతరం పోతారు. బేతేల్ శూన్యం అవుతుంది.”
6 యెహోవాను వెదకి బ్రతకండి. లేకపోతే యోసేపు వంశీయుల✽మీద ఆయన కోపం మంట✽లాగా రగులుకొని వారిని దహించివేస్తుంది. బేతేల్✽లో దాన్ని ఆర్పివేయగల వాడెవ్వడూ ఉండడు. 7 ✽మీరు న్యాయాన్ని అన్యాయానికి మార్చి నీతి నిజాయితీని నేల మీద పడవేస్తున్నారు. 8 ✽ఆయన సప్తఋషి✽ నక్షత్రాలను మృగశీర్ష నక్షత్రాలనూ సృజించినవాడు. ఆయన చీకటిని ఉదయానికి మారుస్తాడు, పగటిని రాత్రి చీకటిగా మారుస్తాడు. సముద్రంలోని నీళ్ళను భూతలం మీద కుమ్మరించడానికి రప్పిస్తాడు. ఆయన పేరు యెహోవా. 9 ఆయన బలాఢ్యుల మీదికి నాశనం తెప్పిస్తాడు, కోటలను పాడు చేస్తాడు.
10 అయితే మీరు పంచాయితీలో హెచ్చరిక చెప్పేవారిని ఏవగించుకొంటారు. యథార్థంగా మాట్లాడే వారంటే మీకు అసహ్యం. 11 ✽మీరు బీదలను అణగ ద్రొక్కుతూ ధాన్యం ఇమ్మని వారిని బలవంతం చేస్తారు. అందుచేత మీరు రాళ్ళతో భవనాలు కట్టుకొన్నా వాటిలో కాపురముండరు. అందమైన ద్రాక్షతోటలను నాటినా మీరు ఆ పండ్ల రసం త్రాగరు. 12 ఎందుకంటే, మీ అపరాధాలు అనేకం, మీ పాపాలు ఘోరం. నాకు తెలుసు✽, మీరు లంచాలు✽ తీసుకొని న్యాయవంతులను బాధిస్తారు. పంచాయితీకి వచ్చే బీదలకు న్యాయం చేకూరకుండా చేస్తారు. 13 ✽గనుక, ఈ కాలం చెడ్డది కావడంవల్ల అలాంటి సమయాలలో బుద్ధిమంతులు ఊరుకొంటారు.
14 మీరు బ్రతికేలా✽ మంచిని వెదకండి కాని చెడుగును కాదు. అలా చేస్తే మీరు అనుకొన్న విధంగా✽ సేనలప్రభువువైన యెహోవా దేవుడు మీకు తోడై ఉంటాడు. 15 ✝చెడుగును ఏవగించుకోండి, మంచిని ఆశించండి. పంచాయితీలో న్యాయాన్ని నిర్వహించండి. అలాంటప్పుడు ఒకవేళ✽ సేనల ప్రభువైన యెహోవాదేవుడు యోసేపు వంశీయులలో తక్కిన వారిమీద✽ దయ చూపుతాడేమో.
16 ✽అందుచేత సేనలప్రభువైన యెహోవా దేవుడు ఇలా అంటున్నాడు: “నేను మీ మధ్య సంచరించబోతున్నాను✽ గనుక ప్రతి రాజమార్గంలో విలాపం వినబడుతుంది, ప్రతి నడివీధిలో ప్రజలు సమకూడి ‘అయ్యో! అయ్యో!’ అని అరుస్తారు. విలాపం చేయడానికి వారు కర్షకులను పిలుస్తారు. రోదనం చేయడం నేర్చినవారిని శోకించడానికి రప్పిస్తారు. 17 ప్రతి ద్రాక్షతోటలో కూడా విలాపం వినబడుతుంది. ఇది యెహోవా వాక్కు.”
18 ✽ యెహోవా దినం రావాలని ఆశించే మీకు బాధ తప్పదు. ఆ దినాన మీకు ఏమి కలుగుతుందనుకొంటారు? యెహోవా దినం చీకటిమయం గానీ వెలుగు కాదు. 19 ఒక మనిషి సింహం దగ్గరనుంచి పారిపోతే ఎలుగుబంటి ఎదురవు తుందనుకోండి. ఇంట్లోకి వచ్చి గోడమీద చెయ్యి ఉంచితే పాము అతణ్ణి కరుస్తుందనుకోండి. యెహోవా దినం అలాగే ఉంటుంది. 20 ఆ దినం చీకటిమయం గానీ వెలుగు కాదు. కాంతి ఏమీ లేక కారుచీకటిగా ఉంటుంది. 21 ✝“మీ పండుగలంటే నాకు గిట్టవు. అవి నాకు అసహ్యం. మీ సభలలో ధూపం ఆఘ్రాణించను. 22 మీరు హోమాలూ నైవేద్యాలూ✽ నాకు సమర్పించినా నేను వాటిని స్వీకరించను. మీరు శాంతి బలులు✽గా అర్పించే క్రొవ్విన పశువులను నేను చూడను. 23 నా ఎదుట మీ పాటల ధ్వని చాలించండి. మీ తంతివాద్యాల✽ నాదం వినడం నాకు ఇష్టం లేదు. 24 ✽ మీ మధ్య న్యాయం నది ప్రవాహంలాగా ప్రవహించాలి, నీతినిజాయితీ ఎన్నడూ వట్టిపోని కాలువలాగా పారాలి. 25 ✽ఇస్రాయేల్‌ప్రజలారా! ఎడారిలో నలభై సంవత్సరాలు మీరు బలులూ నైవేద్యాలూ నాకు సమర్పించారా? 26 ✽మీరు మీకోసం చేసుకొన్న మోలెకుదేవుడి గుడారాన్ని, మీ విగ్రహాల పీఠాన్ని మోసుకువచ్చారు గదా. 27 ✽అందుచేత నేను దమస్కు అవతలికి✽ మిమ్ములను బందీలుగా✽ పంపిస్తాను. ఇది యెహోవా వాక్కు. ఆయన పేరు సేనల దేవుడు.”