4
1 షోమ్రోను కొండమీద ఉన్న బాషాను✽ ఆవులారా! దిక్కులేని వారిని బాధిస్తూ బీదలను✽ అణగద్రొక్కుతూ ఉన్న స్త్రీలారా! “మద్యపానం✽ తీసుకురా” అని మీ భర్తలతో చెప్పేవారలారా! 2 ప్రభువైన యెహోవా తన పవిత్రతతోడని ఇలా ప్రమాణం చేశాడు✽: “శత్రువులు మిమ్ములను కొంకీలతో✽ పట్టుకొని తీసుకుపోయే కాలం రాబోతుంది. మీలో మిగతావారిని గాలాలతో పట్టుకుపోతారు. 3 మీరంతా ప్రాకారాలలో పగుళ్ళగుండా తిన్నగా పోతారు. మిమ్ములను హెర్మోను వైపుకు బయట పారవేయడం జరుగుతుంది. ఇది యెహోవా వాక్కు.4 ✽“బేతేల్‌కు వెళ్ళి తిరుగుబాటు చేయండి! గిల్‌గాల్‌కు వెళ్ళి మరీ ఘోరంగా తిరుగుబాటు చేయండి! ప్రతి ఉదయం✽ బలులు తీసుకురండి, మూడు రోజులకు ఒకసారి మీరు చెల్లించే పదో భాగాలను✽ తెచ్చి అర్పించండి. 5 పొంగజేసే పదార్థంతో చేసిన రొట్టెను కృతజ్ఞతార్పణ✽గా కాల్చివేయండి! మీ స్వేచ్ఛార్పణల✽ విషయం గొప్పలు చెప్పుకోండి✽! పెద్దగా చాటించండి! ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలారా, ఇలా చేయడం మీకు ఇష్టం గదా! ఇది ప్రభువైన యెహోవా వాక్కు.
6 ✽“మీ పట్టణాలన్నిటిలోనూ మీకు తినడానికి ఏమీ లేకుండా చేశాను. మీరున్న స్థలాలన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేశాను. అయినా మీరు నావైపు తిరుగలేదు. ఇది యెహోవా వాక్కు.
7 ✽“కోత కాలానికి ముందు మూడు నెలలు వాన కురియకుండా చేశాను. ఒక పట్టణం మీద కురిపించి మరో పట్టణంమీద కురిపించలేదు. ఒక పొలం మీద వాన కురిసింది. వాన కురియని పొలం ఎండిపోయింది. 8 రెండు, మూడు పట్టణాలవారు నీళ్ళు త్రాగడానికి వేరే పట్టణానికి తొట్రుపడుతూ పోయారు. కానీ అక్కడ కూడా చాలినంత నీళ్ళు దొరకలేదు. అయినా మీరు నావైపు తిరుగలేదు. ఇది యెహోవా వాక్కు.
9 ✝“మీకున్న అనేక తోటలనూ ద్రాక్ష తోటలనూ మాడ్చే గాలిచేతా నల్లకుళ్ళు తెగులు చేతా పాడు చేశాను. మిడతలు మీ అంజూరు చెట్లనూ ఆలీవ్ చెట్లనూ తినివేశాయి. అయినా మీరు నావైపు తిరుగలేదు. ఇది యెహోవా వాక్కు.
10 “నేను మీమీదికి రప్పించిన విపత్తులు ఈజిప్ట్✽వారి మీదికి రప్పించిన విపత్తులాంటివి. మీ యువకులను మీరు కొల్లగొట్టిన గుర్రాలతోపాటు ఖడ్గధార✽కు గురి చేశాను. మీ శిబిరాలలో పుట్టిన దుర్గంధం మీ ముక్కు పుటాలకు ఎక్కింది. అయినా మీరు నావైపు తిరుగలేదు. ఇది యెహోవా వాక్కు.
11 “దేవుణ్ణయిన నేను సొదొమ✽ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినట్టు మీలో కొంత మందిని నాశనం చేశాను. మంటలో నుంచి తటాలున లాగుకొన్న కొరువులలాగా మిమ్ములను తప్పించడం జరిగింది. అయినా మీరు నావైపు తిరుగలేదు✽. ఇది యెహోవా వాక్కు.
12 ✽“అందుచేత, ఇస్రాయేల్ ప్రజలారా, నేను ఆ విధంగానే మీ పట్ల వ్యవహరిస్తాను. గనుక, ఇస్రాయేల్ ప్రజలారా! మీ దేవుని ఎదుట నిలబడడానికి సిద్ధపడండి.”
13 ✽పర్వతాలను రూపొందించేవాడూ గాలిని పుట్టించే వాడూ ఆయనే. ఆయన తన ఆలోచనలు మనుషులకు వెల్లడి చేస్తాడు✽. ఉదయాన్ని చీకటిగా మారుస్తాడు. భూమి ఎత్తయిన స్థలాల మీద త్రొక్కుతాడు. ఆయన పేరు సేనలప్రభువైన యెహోవా దేవుడు.