3
1 ఇస్రాయేల్ ప్రజలారా! ఈజిప్ట్‌దేశంనుంచి యెహోవా తీసుకువచ్చిన వంశంవారలారా! మీ అందరి విషయం యెహోవా పలికినది వినండి:
2 “లోకంలో ఉన్న వంశాలన్నిటిలో మిమ్ములను మాత్రమే ఎరిగి ఎన్నుకొన్నాను. అందుచేత మీరు చేసిన అపరాధాలన్నిటికీ మిమ్ములను శిక్షిస్తాను.”
3 ఇద్దరిలో సమ్మతి లేకపోతే వారు కలిసి నడుస్తారా? 4 ఏమీ దొరకకపోతే సింహం అడవిలో గర్జిస్తుందా? దేనినీ పట్టుకోకుండానే కొదమ సింహం గుహలో గుర్రుమంటుందా? 5 నేలమీద ఎర పెట్టనిదే పక్షి ఉరిలో చిక్కుపడుతుందా? ఉరిలో ఏది చిక్కుపడకపోతే దాన్ని పెట్టినవాడు దాన్ని వదిలివేస్తాడా? 6 పట్టణంలో బూర ధ్వని వినబడితే అక్కడి ప్రజలకు భయం పుట్టదా? యెహోవా కలిగించనిదే పట్టణంలో ఆపద కలుగుతుందా? 7 ప్రభువైన యెహోవా తాను చేయదలచినదేదీ తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచకుండా చేయడు. 8 సింహం గర్జించింది, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా పలికాడు, ఆయనమూలంగా చెప్పలేనివాడెవడు? 9 అష్డాదు భవనాలలో, ఈజిప్ట్‌దేశంలో ఉన్న భవనాలలో ఇలా చాటించండి: “మీరు షోమ్రోను పర్వతాలమీద సమకూడి అక్కడి ప్రజలమధ్య జరుగుతున్న గొప్ప అల్లరి, దౌర్జన్యం చూడండి.”
10 యెహోవా చెప్పేదేమిటంటే, “వారు తమ భవనాలలో కొల్లగొట్టిన దోపిడీ సొమ్ము సమకూర్చుకొంటారు. న్యాయప్రవర్తన అంటే వారికి తెలియదు. 11 అందుచేత ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: శత్రువులు వచ్చి దేశమంతటా వ్యాపిస్తారు. మీ బలాన్ని పడగొట్టి మీ భవనాలలోది దోచుకొంటారు.”
12 యెహోవా చెప్పేదేమిటంటే, “గొర్రెల కాపరి సింహం నోటనుంచి గొర్రె రెండు కాళ్ళు గానీ చెవి ముక్క గానీ విడిపించే విధంగా ఇస్రాయేల్ ప్రజలకు విడుదల కలుగుతుంది. షోమ్రోనులో మంచాల మీద, బుట్టాలు వేసిన పరుపుల మీద కూర్చుని ఉన్నవారికి ఆ విధంగానే విడుదల కలుగుతుంది.”
13 ప్రభువైన యెహోవా, సేనలప్రభువైన దేవుడు ఇలా అంటున్నాడు: “నేను చెప్పేది విని యాకోబు వంశీయులకు వ్యతిరేకంగా సాక్ష్యమియ్యి. 14 ఇస్రాయేల్ ప్రజ చేసిన అపరాధాలకు నేను వారిని శిక్షించే రోజున బేతేల్‌లో ఉన్న బలిపీఠాలను నాశనం చేస్తాను. ఆ బలిపీఠాల కొమ్ములు విరిగిపోయి నేల రాలుతాయి. 15 చలికాలంకోసమైన భవనాలనూ ఎండకాలంకోసమైన భవనాలనూ నేను పడగొట్టిస్తాను. దంతంతో అలంకరించబడ్డ నగరులు పాడవుతాయి. గొప్ప భవనాలు నాశనం అవుతాయి. ఇది యెహోవా వాక్కు”.