2
1 యెహోవా చెప్పేదేమంటే, “మోయాబు దేశస్థులు చేసిన మూడు అపరాధాలు, నాలుగు అపరాధాల కారణంగా నేను వారిని శిక్షించితీరుతాను. ఎందుకంటే వారు ఎదోం రాజు ఎముకలను కాల్చి సున్నం చేశారు. 2 మోయాబు మీద నేను మంటలు పంపిస్తాను. అవి కెరీయోతు భవనాలను దహించివేస్తాయి. అల్లరి చప్పుడూ యుద్ధ ధ్వనులూ బాకా నాదం వినబడుతూ ఉన్నప్పుడు మోయాబు అంతరిస్తుంది. 3 దాని పరిపాలకుణ్ణి నిర్మూలిస్తాను, అతడితోపాటు దాని అధిపతులందరినీ హతమారుస్తాను. ఇది యెహోవా వాక్కు.”
4 యెహోవా చెప్పేదేమంటే, “యూదాప్రజ చేసిన మూడు అపరాధాలు, నాలుగు అపరాధాల కారణంగా నేను వారిని శిక్షించితీరుతాను. ఎందుకంటే, వారు యెహోవా చట్టాలను పాటించక ఆయన ధర్మశాస్త్రాన్ని విసర్జించారు, వారి పూర్వీకులు అనుసరించిన వారి అబద్ధాలవల్ల దారి తప్పారు. 5 నేను యూదామీద మంటలు పంపిస్తాను. అవి జెరుసలం భవనాలను దహించివేస్తాయి.”
6 యెహోవా చెప్పేదేమంటే, “ఇస్రాయేల్‌ప్రజ చేసిన మూడు అపరాధాలు, నాలుగు అపరాధాల కారణంగా నేను వారిని శిక్షించితీరుతాను. ఎందుకంటే వారు నిర్దోషులను డబ్బుకు అమ్మివేస్తున్నారు. బీదలను పాదరక్షల కోసం అమ్మివేస్తున్నారు. 7 నేల మట్టి త్రొక్కినట్టు దిక్కులేనివారి తలలను త్రొక్కివేస్తున్నారు. దీనులను అవతలికి గెంటి వేస్తున్నారు. ఒక మనిషీ అతని కొడుకూ ఒకే ఒక స్త్రీని పొందుతారు. ఆ విధంగా నా పవిత్రమైన పేరును అవమానపరుస్తారు. 8 తాకట్టుగా ఉంచిన బట్టలు అప్పగించ కుండా ప్రతి బలిపీఠందగ్గర వాటిమీద పడుకొంటారు. జుల్మానా డబ్బుతో కొనుక్కొన్న ద్రాక్షమద్యం తమ దేవుని ఆలయంలో త్రాగుతారు.
9 “వారి ముందు నేను అమోరీవారిని నాశనం చేశాను గదా. వారు దేవదారు వృక్షమంత ఎత్తుగా, సిందూర వృక్షమంత బలంగా ఉన్నా, పైన వారి ఫలాన్నీ క్రింద వారి వేళ్ళనూ నాశనం చేశాను. 10 అమోరీవారి దేశాన్ని మీ స్వాధీనం చేయాలని ఈజిప్ట్‌దేశంనుంచి మిమ్ములను తీసుకువచ్చి నలభై సంవత్సరాలు ఎడారిలో సంచరించేలా చేశాను. 11 మీ సంతానంలో ప్రవక్తలను నియమించాను. మీ యువకులలో నాజీరులను ఎన్నుకొన్నాను. ఇస్రాయేల్ ప్రజలారా! ఇది నిజం కాదా? ఇది యెహోవా వాక్కు. 12 అయితే మీరు నాజీరులకు ద్రాక్షమద్యం త్రాగించారు. ప్రవక్తలను దేవుని మూలంగా పలకవద్దని ఆదేశించారు.
13 “ఇదిగో వినండి, ధాన్యం వెన్నుల కట్టలతో నిండిన బండి అణగిపోయిన విధంగా మిమ్ములను ఆణగిపోయేలా చేస్తాను. 14 వేగంగా పారిపోగలవారు తప్పించుకోలేకపోతారు. బలాఢ్యులు తమ బలాన్నిబట్టి ధైర్యం తెచ్చుకోలేకపోతారు. వీరులు తమ ప్రాణం దక్కించుకోలేక పోతారు. 15 విలుకాండ్లు నిలబడలేకపోతారు. వేగంగా పరుగెత్తగలవారు తప్పించుకోలేక పోతారు. రౌతులు తమ ప్రాణం దక్కించుకోలేక పోతారు. 16 ఆ రోజున పరాక్రమశాలురందరిలో ఎక్కువ ధైర్యం గలవారు కూడా దిగంబరులై పారిపోవలసి ఉంటుంది. ఇది యెహోవా వాక్కు.”