ఆమోసు
1
1 ఆమోసు తెకోవ✽లో ఉన్న కాపరులలో✽ ఒకడు. ఇవి అతని మాటలు. భూకంపం కలగడానికి రెండు సంవత్సరాలు ముందు ఇస్రాయేల్ ప్రజలను గురించి అతనికి వెల్లడి అయిన✽ విషయాలు ఇవి. ఆ రోజుల్లో యూదామీద ఉజ్జియా✽ రాజుగా ఉన్నాడు. ఇస్రాయేల్ మీద యెహోయాషు కొడుకు యరొబాం✽ రాజుగా ఉన్నాడు. 2 ✽ఆమోసు ఇలా అన్నాడు: యెహోవా సీయోనునుంచి గర్జిస్తూ✽ ఉన్నాడు. జెరుసలంనుంచి ఆయన కంఠం వినబడుతూ ఉంది. కాపరుల పచ్చిక మైదానాలు వాడిపోతూ ఉన్నాయి. కర్మెల్ పర్వత శిఖరం ఎండిపోతూ✽ ఉంది.3 ✽యెహోవా చెప్పేదేమంటే✽, “దమస్కు నగరవాసులు చేసిన మూడు అపరాధాలు✽, నాలుగు అపరాధాల కారణంగా నేను వారిని శిక్షించితీరుతాను. ఎందుకంటే, వారు గిలాదు✽ను ఇనుప పళ్ళుగల యంత్రంలో నూర్చారు. 4 ✽నేను హజాయేల్ ఇంటిమీద మంటలు పంపిస్తాను. అవి బెన్‌హదదు భవనాలను దహించివేస్తాయి. 5 దమస్కు ద్వారాల అడ్డగడియలను విరగగొట్టిస్తాను✽. ఆవెను లోయలో ఉన్న నివాసులను నాశనం చేస్తాను. బేత్ ఏదెనులో రాజదండం వహించినవాణ్ణి నాశనం చేస్తాను. సిరియా దేశస్థులు బందీలుగా కీర్✽ ప్రాంతానికి వెళ్ళిపోవలసి వస్తుంది. ఇది యెహోవా వాక్కు.”
6 యెహోవా చెప్పేదేమంటే, “గాజా✽ పట్టణస్థులు చేసిన మూడు అపరాధాలు, నాలుగు అపరాధాల కారణంగా నేను వారిని శిక్షించితీరుతాను. ఎందుకంటే వారు చాలామందిని✽ బందీలుగా తీసుకుపోయి ఎదోంవారి వశం చేశారు. 7 నేను గాజా ప్రాకారాలమీద మంటలు పంపిస్తాను. అవి వారి భవనాలను దహించి వేస్తాయి. 8 ✽అష్డోదు నగరవాసులను నాశనం చేస్తాను. అష్‌కెలోనులో రాజదండం వహించినవాణ్ణి నాశనం చేస్తాను. ఫిలిష్తీయ ప్రజలో తక్కినవారు నశించే వరకు✽ ఎక్రోనును నేను దెబ్బతీస్తాను. ఇది ప్రభువైన యెహోవా వాక్కు.”
9 యెహోవా చెప్పేదేమంటే, “తూరు✽ నగరవాసులు చేసిన మూడు అపరాధాలు, నాలుగు అపరాధాల కారణంగా నేను వారిని శిక్షించి తీరుతాను. వారు బంధువులతో చేసుకొన్న ఒడంబడికను✽ తలచుకోకుండా చాలా మందిని బందీలుగా తీసుకుపోయి ఎదోం వారి స్వాధీనం చేశారు. 10 నేను తూరు ప్రాకారాలపై మంటలు పంపిస్తాను. అవి దాని భవనాలను దహించివేస్తాయి.”
11 యెహోవా చెప్పేదేమంటే, “ఎదోం✽ దేశస్థులు చేసిన మూడు అపరాధాలు, నాలుగు అపరాధాల కారణంగా నేను వారిని శిక్షించితీరుతాను. ఎందుకంటే వారు జాలి అణచివేసుకొంటూ ఖడ్గం చేతపట్టుకొని తమ బంధువులను✽ తరుముతూ వచ్చారు. వారు తమ ఆగ్రహాన్ని ఎన్నడూ వదలివేయక, ఎడతెరపి లేకుండా కోపిస్తూ వారిని చీల్చారు. 12 నేను తేమాను మీద మంటలు పంపిస్తాను. అవి బొస్రాలో ఉన్న భవనాలను దహించివేస్తాయి.”
13 యెహోవా చెప్పేదేమంటే, “అమ్మోను✽ దేశస్థులు చేసిన మూడు అపరాధాలు, నాలుగు అపరాధాల కారణంగా నేను వారిని శిక్షించితీరుతాను. ఎందుకంటే, సరిహద్దులను విశాలం చేయాలని✽ గిలాదు✽లో ఉన్న గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చారు. 14 ✽నేను రబ్బా ప్రాకారాలను తగలబెట్టిస్తాను. అది దాని భవనాలను దహించివేస్తుంది. యుద్ధకాలంలో రణధ్వనులు వినబడుతూ ఉన్నప్పుడు, తుఫాను రోజున పెనుగాలి వీస్తూ ఉన్నప్పుడు అలా జరుగుతుంది. 15 వారి రాజు అతని పరివారంతోపాటు బందీగా దేశాంతరం పోతాడు. ఇది యెహోవా వాక్కు.”