9
1 బలిపీఠం✽ దగ్గర యెహోవా నిలబడి ఉండడం నేను చూశాను✽. ఆయన ఇలా అన్నాడు: “గడపలు కదలి పోయేలా స్తంభాల పై భాగాలను కొట్టు✽. పై కప్పు అందరి తలలమీదా పడేలా వాటిని పగలగొట్టు. మిగిలిన వాళ్ళను తరువాత నేను కత్తిపాలు చేస్తాను✽. ఒక్కడూ కూడా పారిపోలేడు. ఎవ్వరూ తప్పించుకోరు. 2 ✽ వాళ్ళు మృత్యులోకం వరకు రంధ్రం తొలుచుకొని పోయినా, అక్కడనుంచి నా చెయ్యి వాళ్ళను బయటికి లాగివేస్తుంది. అంతరిక్షం ఎక్కిపోయినా, అక్కడనుంచి కూడా వాళ్ళను దించివేస్తాను. 3 వాళ్ళు కర్మెల్✽ పర్వత శిఖరాన దాక్కొన్నా, నేను వాళ్ళ వెంటబడి అక్కడ వాళ్ళను పట్టుకొంటాను. నా కండ్లకు కనిపించకుండా వాళ్ళు సముద్రం క్రిందిభాగంలో దాక్కొన్నా, అక్కడి సర్పానికి వాళ్ళను కరువమని ఆజ్ఞాపిస్తాను. 4 శత్రువులు వాళ్ళను బందీలుగా దేశాంతరం తీసుకుపోయినా, అక్కడ ఖడ్గం ధరించినవారికి వాళ్ళను చంపమని ఆజ్ఞాపిస్తాను. వాళ్ళమీదికి మేలు కాదు, కీడే వచ్చేలా✽ నా చూపు వాళ్ళమీద నిలుపుతాను.”5 ఆయన ప్రభువు, సేనలప్రభువు యెహోవా. ఆయన భూమిని తాకితే అది కరిగిపోతుంది✽, భూనివాసులంతా విలపిస్తారు. నైలు నదిలాగా అదంతా లేస్తుంది. ఈజిప్ట్✽లోని నదిలాగా అణగిపోతుంది. 6 ✽ఆయన తన కోసం ఆకాశాలలో మేడగదులు కట్టుకొనేవాడు. ఆకాశ మండలాన్ని భూమికి పైగా సుస్థిరం చేసేవాడు. సముద్రం నీళ్ళనూ భూతలం మీద కురిపించడానికి రప్పించేవాడు. ఆయన పేరు యెహోవా✽.
7 “ఇస్రాయేల్ ప్రజలారా! నా దృష్టిలో మీరూ కూషుదేశస్ధులూ✽ సమానులే గదా. ఇస్రాయేల్ ప్రజను ఈజిప్ట్ నుంచి తెచ్చిన నేను ఫిలిష్తీయప్రజను కఫ్తోరునుంచి, సిరియా ప్రజను కీరునుంచి తెచ్చాను గదా” అని యెహోవా అంటున్నాడు.
8 “ప్రభువైన యెహోవా అనే నేను ఈ పాపిష్టి రాజ్యాన్ని కండ్లారా✽ చూస్తున్నాను. అయినా యాకోబు వంశాన్ని పూర్తిగా నాశనం చేయను✽” అని యెహోవా అంటున్నాడు. 9 “ఇప్పుడు నేను ఆజ్ఞ జారీ చేస్తున్నాను. మనిషి ధాన్యం జల్లెడ✽లో వేసి ఒక గింజ కూడా నేల పడకుండా జల్లించే విధంగా ఇస్రాయేల్ ప్రజను అన్ని దేశాలవారి మధ్య✽ జల్లిస్తాను. 10 ✽నా ప్రజలో ‘విపత్తు మనలను అందుకోదు, మనమీదికి రాదు’ అని చెప్పుకొనే పాపాత్ములందరూ ఖడ్గానికి గురి అయి చస్తారు.
11 ✽ “శిథిలమైపోయిన దావీదు నివాసం✽ ఆ కాలంలో✽ నిలబెట్టి దాని గోడలను బాగు చేస్తాను. పాడైన భాగాలను బాగు చేస్తాను. అది మునుపు ఉన్నట్టు దాన్ని మళ్ళీ నిర్మిస్తాను. 12 వారు ఎదోం జనంలో మిగిలినవారినీ నా పేరు ధరించిన ఇతర ప్రజలనందరినీ స్వాధీనం చేసుకొనేలా నేను ఈ విధంగా చేస్తాను” అంటున్నాడు యెహోవా. ఆయన అలాగే జరిగిస్తాడు.
13 ✝“ఒక కాలం రాబోతుంది. అప్పుడు మనుషులు పంట కోస్తూ ఉండగానే భూమి దున్నడానికి మనుషులు వస్తారు. విత్తనాలు చల్లుతూ ఉండగానే ద్రాక్ష పండ్లు త్రొక్కేవారు వస్తారు. పర్వతాలమీద నుంచి మధురమైన ద్రాక్షరసం పారుతుంది. అది కొండలన్నిటి మీద నుంచి ప్రవహిస్తుంది. 14 ✝నేను బందీలుగా దేశాంతరం పోయిన నా ఇస్రాయేల్ ప్రజను తిరిగి తీసుకువస్తాను. వారు శిథిలమైన పట్టణాలను మళ్ళీ కట్టుకొని వాటిలో నివాసం ఉంటారు. ద్రాక్షతోటలు నాటి ద్రాక్షరసం త్రాగుతారు, తోటలు వేసి పండ్లు తింటారు. 15 ✽ నేను ఇస్రాయేల్ ప్రజను వారి స్వదేశంలో నాటుతాను. నేను వారికిచ్చిన✽ దేశంలోనుంచి వారిని పెళ్ళగించడం ఇంకెన్నడూ జరుగదు. ఇది మీ దేవుడు యెహోవా వాక్కు.”