2
1 సీయోనులో బూర✽ ఊదండి! నా పవిత్ర పర్వతం✽మీద మేల్కొలిపే ధ్వని చేయండి! యెహోవా దినం రాబోతున్నది. అది ఆసన్నమైంది✽ గనుక దేశనివాసులంతా వణకాలి. 2 అది చీకటి✽ రోజు, గాఢాందకారమయమైన రోజు, నల్లటి మబ్బులు కమ్మేరోజు. కొండలమీద ఉదయకాంతి వ్యాపిస్తూ ఉన్నట్టు బలమైన మహా గొప్ప సమూహాలు✽ వస్తూ ఉన్నాయి. అలాంటివి ఇంతకుముందు ఎన్నడూ లేవు, తరువాత యుగయుగాలకూ ఉండవు✽. 3 ✽వాటి ముందర అగ్ని మండుతూ ఉంది, వాటి వెనుక మంటలు ప్రజ్వలిస్తూ ఉన్నాయి. అవి వచ్చేముందు భూమి ఏదెను తోటలాంటిది. అవి పోయాక అది పాడైన ఎడారిలాంటిది. వాటి బారినుంచి తప్పించుకొనేది ఏదీ లేదు. 4 ✝అవి గుర్రాలలాగా కనిపిస్తూ ఉన్నాయి. యుద్ధాశ్వాలలాగా పరుగెత్తుతూ ఉన్నాయి. 5 అవి చేసే చప్పుడు రథాల చప్పుడులాంటిది. ఎండిన దుబ్బు కాలుతూ ఉంటే చురచురమన్నట్టు అవి ధ్వని చేస్తున్నాయి. అవి కొండలమీద నుంచి దూకుతూ ఉన్నాయి. అవి యుద్ధానికి సిద్ధమైన మహా సైన్యవ్యూహంలాగా కనిపిస్తున్నాయి.6 వాటిని చూచి ప్రజలు✽ అల్లాడిపోతున్నారు. అందరి ముఖాలు పాలిపోతున్నాయి. 7 అవి వీరులలాగా వేగంతో ముందుకు వస్తున్నాయి. అటూ ఇటూ తిరుగకుండా అవన్నీ తిన్నగా నడుస్తున్నాయి. 8 ఒకదానిని ఒకటి త్రోసుకోకుండా అన్నీ నేరుగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఆయుధాలు ఎదుర్కొన్నా వరుస తప్పదు. 9 ✽అవి పట్టణాలలో దొమ్మిగా చొరబడుతున్నాయి. గోడలమీద పరుగెత్తుతూ ఉన్నాయి. దొంగల్లాగా కిటికీలలో గుండా ఇండ్లలో ప్రవేశిస్తున్నాయి.
10 ✝వాటికి ముందు భూమి కంపిస్తున్నది. ఆకాశాలు వణకుతున్నాయి. సూర్యమండలం, చంద్రబింబం చీకటి అవుతున్నాయి. నక్షత్రాలు కాంతి✽ తప్పుతున్నాయి. 11 యెహోవా తన సైన్యానికి ముందుగా వస్తూ ఉరుముతూ✽ ఉన్నాడు. ఆయన దండు✽ మహా గొప్పది✽. ఆయన ఆజ్ఞలను నెరవేర్చేది బలంగలది. యెహోవా దినం✽ గొప్పది, మహా భయంకరమైనది. దానిని తట్టుకోగలవారెవరు?✽
12 ✝యెహోవా ఇలా అంటున్నాడు: “ఇప్పుడైనా మీరు మనసారా నావైపుకు తిరగండి. ఉపవాసముండి ఏడుస్తూ శోకిస్తూ నా వైపుకు తిరగండి”.
13 మీ దేవుడు యెహోవా దయాళుడు, వాత్సల్యం✽ గలవాడు, త్వరగా కోపగించనివాడు, కరుణామయుడు. తాను కలిగిద్దామనుకొన్న ఆపద విషయం ఆయన జాలి చూపడానికి సంసిద్ధుడు✽, గనుక మీ బట్టలను✽ కాదు, మీ హృదయాలనే చించుకొని ఆయనవైపుకు తిరగండి✽! 14 ✽ ఒకవేళ ఆయన మీవైపుకు తిరిగి, జాలి చూపుతాడేమో, మీరు మీ దేవుడైన యెహోవాకు నైవేద్యాలనూ పానార్పణలనూ అర్పించేలా మిమ్మల్ని దీవిస్తాడేమో. అలా ప్రవర్తించడని ఎవరు చెప్పగలరు? 15 ✽సీయోనులో బూర ఊదండి! ఉపవాసం కోసం సమయం ప్రత్యేకించండి, పవిత్ర సభకు ప్రజలను పిలువండి. 16 వారిని సమకూర్చండి. సమావేశాన్ని పవిత్రం చేయండి. పెద్దలను రప్పించండి. చిన్నవాళ్ళనూ చంటిబిడ్డలనూ కూడా సమకూర్చండి. పెండ్లికొడుకు తన గదిలోనుంచి, పెండ్లికూతురు తన గదిలోనుంచి రావాలి. 17 ✽యెహోవాకు సేవచేసే యాజులు మంటపానికి బలిపీఠానికి మధ్య నిలుచుండి ఏడుస్తూ “యెహోవా! నీ ప్రజను చూచి కనికరించు. నీ సొత్తుగా ఉన్న✽ నీ వారినీ తిరస్కారానికి✽ గురి చేయకు. వారిమీద ఇతర ప్రజలను ప్రభుత్వం చేయనియ్యకు. ఇతర ప్రజలు ‘వీరి దేవుడు ఏమయ్యాడు✽?’ అని ఎందుకు చెప్పుకోవాలి?” అనాలి.
18 ✽అప్పుడు యెహోవా తన దేశాన్ని గురించి అత్యాసక్తిపరుడై✽ తన ప్రజను కనికరిస్తాడు. 19 ✝ఆయన వారికి ఇలా జవాబిస్తాడు: “మీకు సంతృప్తి కలిగించేటంతగా ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, నూనె ప్రసాదిస్తాను. ఇకనుంచి మరెన్నడూ మిమ్ములను ఇతర ప్రజల తిరస్కారానికి గురి చేయను.
20 ✽“అంతేగాక, ఉత్తర దిశనుంచి వచ్చే సైన్యాన్ని మీకు దూరంగా పారదోలుతాను. దాన్ని ఎండిపోయి పాడైపోయిన ప్రాంతానికి తోలివేస్తాను. అది గొప్ప క్రియలు చేసినందుచేత దాని ముందుభాగాన్ని తూర్పుసరస్సు✽లో దాని వెనుక భాగాన్ని పడమటి సముద్రం✽లో పడగొట్టివేస్తాను. అది కంపు✽ కొడుతుంది. చెడ్డ వాసన వస్తుంది.”
21 ✽దేశమా! భయపడకు! యెహోవా గొప్ప క్రియలు చేశాడు గనుక సంతోషించు! ఆనందంతో గంతులు వెయ్యి! 22 పశువులారా! భయపడకండి! పచ్చిక మైదానాలు పచ్చగా ఉంటాయి. చెట్లు కాయలు కాస్తాయి. అంజూరుచెట్లూ ద్రాక్షచెట్లూ సమృద్ధిగా ఫలిస్తాయి. 23 సీయోను జనమా! ఆనందించండి! మీ దేవుడు యెహోవా మూలంగా సంతోషించండి. ఆయన సరిపడేటంతగా తొలకరి వాన కురిపిస్తాడు. మునుపటిలాగే తొలకరి వర్షం, కడవరి వర్షం✽ మీకు ప్రసాదిస్తాడు. 24 కళ్ళాలు ధాన్యంతో నిండి ఉంటాయి. క్రొత్త ద్రాక్షరసం, నూనె గానుగ తొట్లకు పైగా పొర్లి పారుతాయి.
25 ✝“నేను పంపిన ఎగిరేమిడతలూ దూకే మిడతలూ మిడత పిల్లలూ మరో రకం చిన్న మిడతలూ - ఆ నా మహా సైన్యం✽ తినివేసిన సంవత్సరాల పంటను నష్టపరిహారం✽గా మీకు ఇస్తాను. 26 మీరు కడుపునిండా తిని తృప్తి పడుతారు. మీ పట్ల అద్భుతంగా వ్యవహరించిన మీ దేవుడైన యెహోవా పేరును కీర్తిస్తారు✽. ఆ తరువాత నా ప్రజ మరెన్నడూ సిగ్గుపడనవసరం ఉండదు. 27 ✝అప్పుడు నేను ఇస్రాయేల్ ప్రజల మధ్య ఉన్నాననీ నేను మీ దేవుడు యెహోవాననీ వేరే దేవుడు ఎవడూ లేడనీ✽ మీరు తెలుసుకొంటారు. నా ప్రజ మరెన్నడూ సిగ్గుపడనవసరం ఉండదు✽.
28 ✽“తరువాత✽ నేను నా ఆత్మను సర్వ ప్రజల మీద కుమ్మరిస్తాను. మీ కొడుకులూ కూతుళ్ళూ✽ దేవునిమూలంగా పలుకుతారు. మీ ముసలివారు కలలు కంటారు. మీ యువకులకు దర్శనాలు కలుగుతాయి. 29 ఆ రోజుల్లో నా సేవకులమీదా సేవికలమీదా నా ఆత్మను కుమ్మరిస్తాను. 30 ✽ ఆకాశంలో అద్భుతాలు చూపుతాను, భూమిమీద రక్తం, మంటలు, బ్రహ్మాండమైన పొగ కలిగిస్తాను. 31 యెహోవా భయంకరమైన మహా దినం రాకముందు సూర్యమండలం చీకటిగాను, చంద్రబింబం రక్తంలాగా మారుతాయి. 32 అప్పుడు ఎవరైతే యెహోవా పేర ప్రార్థన చేస్తారో వారికి విముక్తి✽ కలుగుతుంది. యెహోవా చెప్పినట్టే సీయోను కొండమీద జెరుసలంలో తప్పించుకొన్నవారి మధ్య✽ రక్షణ✽ ఉంటుంది. వారిని యెహోవా పిలుస్తాడు✽.