3
1 “ఆ రోజుల్లో యూదావారికీ జెరుసలం నగర వాసులకూ ముందున్న క్షేమ స్థితి నేను మళ్ళీ ప్రసాదిస్తాను. ఆ కాలంలో ఇలా జరిగిస్తాను: 2 ఇతర జనాలన్నిటినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోకి రప్పిస్తాను. అక్కడ నా సొత్తయిన ఇస్రాయేల్ ప్రజ పక్షంగా వారి విషయం న్యాయ విచారణ జరిగిస్తాను. ఎందుకంటే, వారు నా ప్రజను ఇతర జనాల మధ్యకు చెదరగొట్టి నా దేశాన్ని పంచుకొన్నారు. 3 నా ప్రజలకు చీట్లు వేసి పిల్లవాణ్ణి ఇచ్చి వేశ్యలను తీసుకొన్నారు. త్రాగుదామని ద్రాక్షమద్యంకోసం పిల్లలను అమ్మివేశారు.
4 “తూరు సీదోను నగరవాసులారా! ఫిలిష్తీయప్రాంతం వారలారా! మీరు నాకేమి చేయాలని? నేను చేసినదానికి నాకు ప్రతీకారం చేస్తున్నారా? ఒకవేళ మీరు నాకు ప్రతీకారం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే, మీరు చేసినదాన్ని త్వరలోనే, చాలా శీఘ్రంగానే మీ నెత్తిమీదికి రప్పిస్తాను. 5 ఎందుకంటే, మీరు నా వెండి బంగారాలను తీసుకుపోయారు. నా శ్రేష్ఠమైన వస్తువులను పట్టుకుపోయి మీ గుళ్ళలో ఉంచారు. 6 యూదావారూ జెరుసలం నగరవాసులూ వారి ప్రాంతానికి దూరం కావాలని మీరు వారిని గ్రీస్ దేశస్ధులకు అమ్మివేశారు. 7 ఇదిగో వినండి, మీరు చేసినదాన్ని మీ నెత్తిమీదికి రప్పిస్తాను. మీరు వారిని అమ్మి పంపివేసిన స్థలాలనుంచి వారు తిరిగి వచ్చేలా వారిని పురికొలుపుతాను. 8 వారు మీ కొడుకులనూ కూతుళ్ళనూ కొనేలా చేస్తాను. వారు వాళ్ళను దూరంగా ఉన్న షేబ వారికి అమ్మి వేస్తారు.” యెహోవా ఈ మాట చెప్పాడు.
9 ఇతర జనాలకు ఈ విషయం చాటించండి: “యుద్ధానికి సిద్ధం చేయండి! వీరులను పురికొలపండి! సైనికులంతా సమకూడి రావాలి. 10  మీ నాగటి కర్రులను సాగగొట్టి ఖడ్గాలను చేయండి, చెట్ల కొమ్మలను నరికే కత్తులను తీసుకొని ఈటెలను చేయండి. బలహీనులు ‘మేము బలాఢ్యులం’ అని చెప్పుకోవాలి. 11 చుట్టుపట్ల ఉన్న ఇతర జనాల్లారా! మీరందరూ త్వరగా వచ్చి అక్కడ సమకూడండి.” యెహోవా! నీ బలాఢ్యులను వెంటబెట్టుకురా! 12 “నలుదిక్కుల ఉన్న ఇతర జనాలన్నిటికీ తీర్పు తీర్చడానికి నేను యెహోషాపాతు లోయలో కూర్చుంటాను గనుక వారు లేచి అక్కడికి రావాలి. 13 పంట పండింది. కొడవలి పెట్టి కోయండి. వచ్చి ద్రాక్షపండ్లను త్రొక్కండి. గానుగ నిండి ఉంది. తొట్లు పొర్లి పారుతున్నాయి – జనాల అపరాధం పూర్తిగా పండినట్టే ఉంది.”
14 తీర్పు లోయలో ప్రజలు గుంపులుగుంపులుగా ఉన్నారు! ఎందుకంటే తీర్పులోయలో యెహోవా దినం ఆసన్నమైంది. 15 సూర్యమండలం, చంద్రబింబం చీకటి అవుతాయి. నక్షత్రాలు కాంతి తప్పుతాయి. 16 యెహోవా సీయోనునుంచి గర్జిస్తాడు. జెరుసలం నుంచి ఆయన స్వరం వినబడుతుంది. భూమి, ఆకాశం కంపిస్తాయి. అయితే యెహోవా తన ప్రజకు శరణ్యం అవుతాడు, ఇస్రాయేల్ ప్రజకు కోటగా ఉంటాడు.
17 “అప్పుడు నేను యెహోవాను, మీ దేవుణ్ణి అనీ నేను నా పవిత్రమైన కొండ సీయోనుమీద నివసిస్తున్నాననీ మీరు తెలుసుకొంటారు. జెరుసలం పవిత్రంగా ఉంటుంది. అప్పటినుంచి మరెన్నడూ విదేశీయులు దానిమీదుగా వెళ్ళరు. 18 ఆ రోజుల్లో పర్వతాల మీదనుంచి క్రొత్త ద్రాక్షరసం పారుతుంది. కొండల మీదనుంచి పాలు పారుతాయి. యెహోవా ఆలయంలోనుంచి నీటి ఊట పెల్లుబికి ప్రవహిస్తూ షిత్తీం లోయను తడుపుతుంది. 19 కానీ ఈజిప్ట్‌దేశం పాడవుతుంది. ఎదోందేశం పాడైన ఎడారి అవుతుంది. ఎందుకంటే, ఈ దేశాలవారు యూదాప్రజను దౌర్జన్యానికి గురి చేసి వారి దేశంలో నిర్దోషుల రక్తం ఒలికించారు. 20 యూదాలో ప్రజలు సదాకాలం నివసిస్తారు. తరతరాలకు జెరుసలం నివాస స్థలంగా ఉంటుంది. 21 వారి ప్రాణ నష్టానికి నేను ఇది వరకు చేయని ప్రతీకారం ఆ దినం చేస్తాను.” యెహోవా సీయోనులో నివసిస్తున్నాడు!