యోవేలు
1
1 ఇది పెతూయేల్ కొడుకు యోవేలుకు యెహోవానుంచి వచ్చిన వాక్కు. 2 పెద్దలారా! ఆలకించండి! దేశ నివాసులారా! మీరంతా వినండి! ఈరోజుల్లో జరిగినది మీ కాలంలో గానీ మీ పూర్వీకుల కాలంలో గానీ ఎప్పుడైనా జరిగిందా? 3 ఈ సంగతి మీ పిల్లలకు తెలియజేయండి. వారు తమ పిల్లలకు, ఆ పిల్లల తరువాతి తరంవారికి తెలియజేయాలి. 4 ఎగిరే మిడతల గుంపులు విడిచినదానిని దూకే మిడతలు తినివేశాయి. దూకే మిడతలు విడిచినదానిని మిడత పిల్లలు తినివేశాయి. మిడత పిల్లలు విడిచినదానిని మరో రకం చిన్న మిడతలు తినివేశాయి.
5 త్రాగుబోతులారా! మేల్కోండి! కన్నీళ్ళు విడవండి! ద్రాక్షమద్యం సేవించేవారలారా! మీరంతా క్రొత్త ద్రాక్షరసాన్ని గురించి పెడబొబ్బలు పెట్టండి! అది మీ నోటికి అందకుండా పోయింది. 6 లెక్కలేనంత బలమైన సమూహం నా దేశం మీదికి వచ్చింది. వాటి పళ్ళు సింహం పళ్ళ లాంటివి, ఆడ సింహం కోరల్లాంటివి. 7 అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేశాయి. నా అంజూరు చెట్లను ధ్వంసం చేశాయి. బరెడు ఒలిచి పారవేశాయి. వాటి కొమ్మలు తెల్లబారాయి.
8 యువదశలో పెళ్ళి నిశ్చయమైనవాణ్ణి కోల్పోయి, గోనెపట్ట కట్టుకొని విలపించే కన్యలాగా విలపించండి. 9 నైవేద్యాలూ పానార్పణలూ యెహోవా ఆలయానికి రావడం లేదు. యెహోవాకు సేవ చేసే యాజులు శోకిస్తున్నారు. 10 పొలాలు పాడయ్యాయి. భూమి శోకిస్తున్నట్టుంది. ధాన్యం నాశనమైంది. క్రొత్త ద్రాక్షరసం లేదు. నూనె చెట్లు వాడిపొయ్యాయి. 11 పొలం పంట నాశనమైంది గనుక కర్షకులారా! గోధుమ, యవల విషయం ఆశాభంగం చెందండి. 12 ద్రాక్ష చెట్లు వాడిపొయ్యాయి గనుక ద్రాక్షచెట్లు పెంచేవారలారా, ఏడ్వండి. అంజూరు చెట్లు ఎండిపొయ్యాయి. దానిమ్మ చెట్లూ ఈత చెట్లూ ఆలీవ్ చెట్లూ తోటలో చెట్లన్నీ వాడిపొయ్యాయి. మనుషుల సంతోషం కూడా వాడిపోయింది.
13 యాజులారా! గోనెపట్ట కట్టుకొని శోకించండి. బలిపీఠందగ్గర సేవ చేసే వారలారా! ఏడ్వండి. నా దేవుని సేవకులారా! గోనెపట్ట కట్టుకొని రాత్రి అంతా అలా గడపండి. నైవేద్యాలూ పానార్పణలూ మీ దేవుని ఆలయానికి రాకుండా నిలిచిపోయాయి. 14 ఉపవాసంకోసం సమయం ప్రత్యేకించండి. పవిత్రసభకు ప్రజలను పిలవండి. పెద్దలను దేశవాసులందరినీ మీ దేవుడైన యెహోవా ఆలయానికి సమకూర్చండి. అక్కడ యెహోవాను బ్రతిమిలాడుకోండి! 15 యెహోవా దినం ఆసన్నమైంది. అయ్యో, అది ఎంత భయంకరమైన దినం! అది అమిత శక్తివంతుడైన దేవుని దగ్గరనుంచి నాశనంగా వస్తుంది.
16 మన కళ్ళెదుటే మన దేవుని ఆలయంలో సంతోషానందాలు లేకుండా పొయ్యాయి. మన ఆహారం నాశనమైంది. 17 విత్తనాలు మంటి గడ్డలక్రింద కుళ్ళి పొయ్యాయి, పైరు మాడిపోవడంచేత గిడ్డంగులు ఖాళీగా ఉన్నాయి, ధాన్యం కొట్లు నేల మట్టమయ్యాయి. 18 పశువులు ఎంత మూలుగుతున్నాయి! మేత లేక ఆవుల మందలు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాయి. గొర్రె మందలు సహా నాశనమవుతున్నాయి. 19 అరణ్యంలో ఉన్న పచ్చిక మైదానాలు అగ్ని చేత కాలిపొయ్యాయి. మంటలు తోటలోని చెట్లన్నిటినీ కాల్చివేశాయి. యెహోవా! నీకు మొరపెట్టుకొంటున్నాను. 20 నదులు ఎండిపోయినందుకూ అగ్నిచేత పచ్చిక మైదానాలు కాలిపోయినందుకూ అడవి మృగాలు కూడా అత్యాశతో నీవైపు చూస్తూ ఉన్నాయి.