13
1 ✽మునుపు ఎఫ్రాయింవారు మాట్లాడితే ఇతరులు వణికారు✽. ఇస్రాయేల్‌లో ఆ గోత్రం ఘనతకెక్కింది. అయితే బయల్✽ దేవుడి విషయంలో అపరాధం చేసి నశించిన స్థితి✽లోకి దిగజారిపోయింది. 2 ఇప్పుడు వారు ఇంకా✽ పాపం చేస్తూ ఉన్నారు. తమకోసం వెండితో పోత విగ్రహాలను చేయించు కొన్నారు. అవి పనివారు✽ నిపుణతతో చేసినవి. ఈ ప్రజను గురించి ఏమంటారంటే, “ఆ దూడ విగ్రహాలకు బలులర్పించేవాళ్ళు✽ వాటిని ముద్దాడుతారు.” 3 ✽అందుచేత ఈ ప్రజ ఉదయం మంచులాగా, ప్రొద్దున త్వరగానే ఆరిపోయే మంచులాగా ఉంటారు. కళ్ళంలోనుంచి గాలి ఎగరగొట్టే పొట్టులాగా కిటికీలో గుండా పోయే పొగలాగా ఉంటారు.4 ✝“నేను యెహోవాను, మీరు ఈజిప్ట్ దేశాన్ని విడిచి వచ్చినప్పటినుంచి మీ దేవుణ్ణి. నేను తప్ప మరే దేవుణ్ణి లక్ష్యపెట్టకూడదు. నేను తప్ప రక్షకుడెవ్వడూ లేడు. 5 ✝ఎడారిలో – మహా ఎండకు కాలిన ఆ ప్రదేశంలో – మిమ్ములను లక్ష్యపెట్టాను. 6 ✽ నేను వారికి ఆహారం ప్రసాదించినప్పుడు వారు తిని తృప్తిపడ్డారు. తృప్తిపడి గర్వించారు. అప్పుడు వారు నన్ను మరచిపోయారు. 7 ✝✽గనుక నేను వారిపట్ల సింహంలాగా వ్యవహరిస్తాను. వారి దారి ప్రక్కన చిరుతపులిలాగా పొంచి ఉంటాను. 8 ✽ పిల్లలు పోయిన ఎలుగుబంటిలాగా నేను వారి పైబడి వారి గుండెలను చీల్చివేస్తాను. ఆడసింహంలాగా వారిని మ్రింగివేస్తాను. అడవిమృగం వారిని చీల్చి ముక్కలు చేస్తుంది. 9 ఇస్రాయేల్ ప్రజలారా! మీకు అండగా ఉన్న నన్ను ఎదిరించిన కారణంగా మీకు నాశనం తప్పదు. 10 ✝మీ పట్టణాలలో దేనిలో అయినా మిమ్ములను మీ రాజు రక్షించాలంటే అతడు ఏమయ్యాడు? మీ నాయకులు ఏమయ్యారు? ‘రాజునూ అధిపతులనూ మామీద నియమించుమ’ని మీరు మనవి చేశారు, 11 నేను కోపపడి మీకు రాజును నియమించాను. ఇప్పుడు ఆగ్రహించి మీ రాజును తొలగించాను.
12 ✝“ఎఫ్రాయింవారి అపరాధాలు వ్రాసి ఉన్నాయి. వారి పాపాలు పోగుపడుతూ✽ ఉన్నాయి. 13 ✝ప్రసవవేదనలాంటి వేదనలు వారికి వచ్చాయి. అయితే పిల్ల పుట్టే సమయంలో✽ వారు బయటికి రాని శిశువులాంటివారు. వారు తెలివితేటలు లేనివారు.
14 ✽“మృత్యులోక✽ వశంలోనుంచి నేను వారిని విమోచిస్తాను. వెల ఇచ్చి✽ మరణంనుంచి✽ వారిని విడిపిస్తాను. మరణమా! నీ విజయమెక్కడ? ఓ మృత్యులోకమా! నీ విషపుకొండి ఎక్కడ? నేను పశ్చాత్తాపపడను. 15 ✽ఎఫ్రాయిం వారు తమ సోదరులలో వర్ధిల్లినా, తూర్పు గాలి✽ – యెహోవా పుట్టించే గాలి – ఎడారినుంచి వీస్తుంది; వారి నీటిబుగ్గలు ఎండిపోతాయి, బావులు ఇంకిపోతాయి. వారు కూడబెట్టుకొన్న విలువైన వస్తువులన్నిటినీ కొల్లగొట్టడం జరుగుతుంది. 16 ✝షోమ్రోనుప్రజలు తమ దేవునికి వ్యతిరేకంగా తిరగబడ్డారు, గనుక శిక్షకు గురి అవుతారు. వారు కత్తిపాలవుతారు. వారి పిల్లలను రాళ్ళకు వేసి ముక్కలు చేయడం, గర్భిణి స్త్రీల కడుపులు చీల్చడం జరుగుతుంది.”