14
1 ఇస్రాయేల్ ప్రజలారా! మీ దేవుడు యెహోవా వైపుకు మళ్ళీ తిరగండి. మీరు చేసిన పాపాల కారణంగా మీరు కూలారు. 2 మాటలు సిద్ధం చేసుకొని యెహోవా వైపుకు మళ్ళీ తిరగండి. ఆయనతో ఇలా చెప్పండి: “మా పాపాలన్నీ క్షమించు. మమ్మల్ని దయతో స్వీకరించు. పశువులకు బదులుగా నీకు మా పెదవుల స్తుతి సమర్పిస్తాం. 3 అష్షూరు దేశస్థులు మమ్ములను రక్షించలేరు. ఇక నుంచి యుద్ధాశ్వాలను ఎక్కము. మా చేతులు చేసిన పని చూచి ‘మా దేవుడు’ అని మరెన్నడూ చెప్పము. తండ్రి లేనివారిపట్ల వాత్సల్యం చూపేవాడివి నీవే గదా.”
4 “వారు మళ్ళీ నానుంచి తిరగకుండేలా వారిని బాగు చేస్తాను. నిరాఘాటంగా వారిని ప్రేమతో చూస్తాను. వారిమీద ఉన్న కోపాగ్ని చల్లారింది. 5 ఇస్రాయేల్ జనం కలువలాగా వికసించేలా, లెబానోను దేవదారు వృక్షంలాగా వేరు పారేలా, నేను దానికి మంచులాంటివాణ్ణి అవుతాను. 6 ఇస్రాయేల్ చిగుర్లు బాగా పెరుగుతాయి. అది ఆలీవ్‌చెట్టులాగా అందంగా ఉంటుంది. లెబానోను దేవదారు వృక్షానికి ఉన్నంత పరిమళం దానికి ఉంటుంది. 7 దాని నీడలో మనుషులు నివసించడానికి తిరిగి వస్తారు. ధాన్యంలాగా విస్తరిల్లుతారు. ద్రాక్షచెట్టులాగా వికసిస్తారు. ఇస్రాయేల్ ప్రఖ్యాతి లెబానోను ద్రాక్షరసం పొందిన ప్రఖ్యాతిలాంటిది అవుతుంది. 8 ఎఫ్రాయింవారు ‘ఇకనుంచి విగ్రహాలతో మాకేం పని?’ అంటారు. వారి ప్రార్థనకు నేను జవాబిస్తాను. వారిని దయ చూస్తాను. నేను పచ్చని సరళ వృక్షంలాంటివాణ్ణి. నాచేతనే మీకు ఫలం దొరుకుతుంది.”
9 జ్ఞానులెవరు? వారు ఈ విషయాలు గ్రహించాలి. తెలివితేటలు ఉన్నవారెవరు? వారు వాటిని అర్థం చేసుకోవాలి. యెహోవా విధానాలు చక్కనివి. న్యాయవంతులు వాటిని అనుసరిస్తారు గాని ఎదురు తిరిగినవారు వాటిలో తడబడి కూలుతారు.