11
1 “ఇస్రాయేల్ జనం చిన్నతనంలో ఉన్నప్పుడు వారిని ప్రేమతో చూశాను. ఈజిప్ట్ నుంచి నా కుమారుణ్ణి పిలిచాను. 2 ఇస్రాయేల్ ప్రజను పిలిచినకొలది వారు నా నుంచి దూరమైపోయారు! వారు బయల్ దేవుళ్ళకు బలులర్పించారు, విగ్రహాలకు ధూపం వేశారు. 3 ఎఫ్రాయిం ప్రజను చేతితో తీసుకొని నడవడానికి నేర్పినవాణ్ణి నేనే. వారిని బాగు చేసినది కూడా నేనే గాని ఆ సంగతి వారు గ్రహించలేదు. 4  మనుషులు తమ వారిని నడిపించినట్టు నేను వారిని ప్రేమబంధాలతో నడిపించాను. వారి మెడమీద నుంచి కాడి తొలగించాను. వంగి వారికి భోజనం పెట్టాను.
5 “ఇప్పుడు నావైపుకు తిరగడానికి వారు నిరాకరిస్తున్నారు. గనుక ఈజిప్ట్‌కు మళ్ళీ వెళ్ళిపోరా? అష్షూరు రాజు వారిమీద ప్రభుత్వం చేయడా? 6 వారి పట్టణాలలో ఖడ్గాలు తళుక్కుమంటాయి! వారి పట్టణాల తలుపుల గడియలను పాడు చేస్తాయి! వారి ఉపాయాలను తుదముట్టిస్తాయి!
7 “నా ప్రజకు నానుంచి వైదొలగే మనసు ఉంది. ఒకవేళ వారు సర్వాతీతుణ్ణి ప్రాధేయపడ్డా, ఎవ్వడూ ఆయనను గౌరవించడు. 8 ఎఫ్రాయిం జనమా! నేను మిమ్ములను ఎలా వదలివేయగలను? ఇస్రాయేల్ ప్రజలారా! మిమ్ములను ఎలా విసర్జించగలను? ఆదమాపట్ల జరిగించినట్టు మీకు ఎలా జరిగించగలను? సెబోయీంను చేసినట్టు మిమ్ములను ఎలా చేయగలను? దానినుంచి నా హృదయం వెనక్కు తీస్తుంది. నాకు జాలి వేస్తున్నది. 9 నా తీవ్ర కోపాన్ని ప్రయోగించను, ఎఫ్రాయింను మళ్ళీ నాశనం చేయను. నేను దేవుణ్ణి. మనిషిని కాను. మీ మధ్య ఉన్న పవిత్రుణ్ణి నేను. కోపాగ్నితో రాను. 10 వారు యెహోవాను అనుసరిస్తారు. ఆయన కంఠ ధ్వని సింహ గర్జనలాగా ఉంటుంది. ఆయన కంఠం అలా ధ్వనించేటప్పుడు ఆయన సంతానం పడమటినుంచి వణకుతూ వస్తారు. 11 వణకుతూ, పక్షులలాగా వేగంతో ఈజిప్ట్‌నుంచి వస్తారు. పావురాలలాగా అష్షూరునుంచి వస్తారు. వారు తమ ఇండ్లలో నివసించేలా చేస్తాను. ఇది యెహోవా వాక్కు.”
12 ఎఫ్రాయింవారు అబద్ధాలు చెపుతూ నన్ను ఆవరించారు. ఇస్రాయేల్ ప్రజల మోసం నాచుట్టూరా ఉంది. యూదా ప్రజ కూడా నమ్మకమైన పవిత్ర దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు.