10
1 ఇస్రాయేల్ ప్రజ వ్యాపిస్తూ ఉన్నా, ద్రాక్ష చెట్టు✽లాగా ఉండేదీ వారు ఫలించినదీ తమ కోసమే✽. ఫలం ఎక్కువ అయినకొద్దీ వారు ఎక్కువ బలిపీఠాలను కట్టుకొన్నారు. వారి భూమి సారవంతమైన కొద్దీ వారి దేవతాస్తంభాలను✽ అలంకరించారు. 2 వారిది కపట మనసు✽. ఇప్పుడు వారి అపరాధానికి✽ వారు శిక్ష పొందాలి. యెహోవా వారి బలిపీఠాలను బ్రద్దలు చేస్తాడు✽. వారి దేవతాస్తంభాలను పాడు చేస్తాడు.3 ✽అప్పుడు వారు ఇలా చెప్పుకొంటారు: “యెహోవా అంటే మనకు భయభక్తులు లేకపోవడం కారణంగా మనకు రాజు లేడు. రాజు ఉన్నా మనకోసం ఏం చేయగలుగుతాడు?”
4 ✽ వారు వాగ్దానాలు చేస్తారు. అబద్ధ శపథాలు చేస్తారు. ఒప్పందాలు చేసుకొంటారు. అందుచేత వ్యాజ్యాలు పొలం చాళ్ళలోని విషపు మొక్కలలాగా అంకురిస్తాయి. 5 షోమ్రోను నగరవాసులు బేత్‌ఆవెనులో ఉన్న దూడ విగ్రహం✽ విషయం కంగారుపడుతారు. ప్రజలూ పూజారులూ – దాని ఘనత విషయం సంతోషించేవాళ్ళంతా – అది పోయిందని విచారపడుతారు. 6 అష్షూరువాళ్ళు దాన్ని తీసుకుపోయి వాళ్ళ మహారాజుకు కానుకగా ఇస్తారు. ఎఫ్రాయింవాళ్ళకు తలవంపులు✽ కలుగుతాయి. ఇస్రాయేల్ ప్రజలు తాము అనుసరించిన ఆలోచనలను బట్టి సిగ్గుపడుతారు. 7 ✝షోమ్రోను నాశనం అవుతుంది. దాని రాజు నీళ్ళమీద విరిగి పడిపోయిన రెమ్మలాగా కొట్టుకుపోతాడు. 8 ఆవెనులో ఉన్న ఎత్తయిన పూజా స్థలాలు✽, ఇస్రాయేల్‌వారు పాపం✽ చేసిన ఆ స్థలాలు నాశనం అవుతాయి. ముండ్ల చెట్లు, గచ్చపొదలు వారి బలిపీఠాలమీదికి పెరుగుతాయి. ఆ కాలంలో వారు పర్వతాలతో “మమ్మల్ని మరుగు చేయండి!” అంటారు, కొండలతో “మా మీద పడండి✽!” అంటారు.
9 ✽ “ఇస్రాయేల్ ప్రజలారా, గిబియా రోజులనుంచి మీరు పాపాలు చేస్తూనే ఉన్నారు✽. మీరు ఆ స్థితిలో ఉండిపోయారు. అయితే గిబియాలో ఉన్న దుర్మార్గుల మీదికి యుద్ధం రాలేదా? 10 నాకు ఇష్టం వచ్చినప్పుడు✽ వారిని శిక్షిస్తాను. విదేశీయులు సమకూడి వారిమీదికి వచ్చి వారిని బంధిస్తారు. వారు చేసిన రెండు పాపాల✽ కారణంగా ఇలా జరుగుతుంది.
11 “ఎఫ్రాయిం✽ జనం తర్బీతు పొందిన పెయ్యలాగా ఉంది. నూర్పిడి అంటే దానికి చాలా ఇష్టం గనుక దాని నున్నని మెడకు నేను కాడి వేస్తాను. దాన్ని నాగటికి కడతాను. యూదావారు భూమి దున్నాలి. యాకోబు ప్రజలు దాన్ని చదును చేయాలి. 12 మీకోసం న్యాయాన్ని విత్తనాలలాగా చల్లండి! కరుణ అనే పంట✽ వచ్చేలా చేయండి! యెహోవా వచ్చి నీతి న్యాయాలను మీమీద కురిపించేవరకూ✽ ఆయనను వెదకడానికి✽ సమయం ఇదే గనుక మీ బీడు భూమి✽ దున్నండి! 13 ✽మీరు దుర్మార్గాన్ని నాటారు. చెడుగు అనే కోత కోశారు. వంచన✽ ఫలాలు తిన్నారు. ఎందుకంటే, మీ విధానాలమీద, మీ అనేక వీరులమీద✽ నమ్మకం ఉంచారు. 14 ✽అందుచేత మీ ప్రజలమీదికి అల్లరి వస్తుంది. యుద్ధకాలంలో షల్మానురాజు బేత్‌అర్బేల్‌ను పాడు చేసినట్టే మీ కోటలన్నీ నాశనం అవుతాయి. ఆ రోజు తల్లులు పిల్లలతోపాటు నేలకు పడగొట్టబడి ముక్కలయ్యారు. 15 బేతేల్✽ నివాసులారా! మీ దుర్మార్గం ఘోరమైనది. గనుక మీకు అలాగే జరుగుతుంది. ఆ రోజు ఉదయం కాగానే ఇస్రాయేల్ ప్రజల రాజు తప్పక నశించిపోతాడు.