9
1 “ఇస్రాయేల్ జనమా! సంతోషించవద్దు. ఇతర జనాలలాగా ఉత్సాహపడవద్దు. నీవు నీ దేవుణ్ణి వదలిపెట్టి వ్యభిచారిణిలాగా ప్రవర్తించావు. ప్రతి కళ్ళంమీద నీవు పడుపు కూలి ఆశించావు. ధాన్యం కావాలన్నావు. 2 అయితే కళ్ళాలూ ద్రాక్ష గానుగ తొట్లూ ఈ ప్రజను పోషించవు. క్రొత్త ద్రాక్షరసం ఉండదు. 3 వారు యెహోవా దేశంలో నిలిచి ఉండరు. ఎఫ్రాయింవారు ఈజిప్ట్‌కు తిరిగి వెళ్తారు. అష్షూరులో వారు అశుద్ధమైనవాటిని తినవలసి వస్తుంది. 4 అప్పుడు యెహోవాకు ద్రాక్షరస పానార్పణలు అర్పించరు. వారు అర్పించే బలులంటే ఆయనకు ఇష్టం ఉండదు. వారి నైవేద్యాలు శోకించేవారి ఆహారంలాగా ఉంటాయి. వాటిని తినేవారంతా అశుద్ధులవుతారు. వారి ఆహారపదార్థాలు వారికే సరిపడుతాయి. అవి యెహోవా ఆలయానికి రావు. 5 నియామక ఉత్సవాలలో, యెహోవా పండుగ రోజులలో మీరేమి చేస్తారు? 6 ప్రజలు నాశనంనుంచి పారిపోతారు. అయితే వారు ఈజిప్ట్‌లో సమకూడడం, మెంఫెస్‌లో వారిని పాతిపెట్టడం జరుగుతుంది. వెండితో చేసినవారి ప్రియ వస్తువులను ముండ్ల మొక్కలు ఆవరిస్తాయి. వారి ఇండ్లలో గచ్చతీగెలు పెరుగుతాయి.
7 “దండన రోజులు రానే వచ్చాయి. ప్రతీకార కాలం వచ్చే ఉంది. ఇస్రాయేల్ ప్రజ ఇది తెలుసుకోవాలి. మీ పాపాలు అనేకం, మీరు చూపిన విరోధ భావం అధికం. గనుక ప్రవక్త తెలివితక్కువవాడనీ దైవావేశంవల్ల పలికేవాడు పిచ్చిపట్టిన వాడనీ మీరు అనుకొంటారు. 8 ప్రవక్త దేవునితోపాటు ఎఫ్రాయిం ప్రజలకు కావలివాడు. అయితే అతని త్రోవలన్నిట్లో వేటకాండ్ల వలలు పరచివున్నాయి. అతని దేవుని ఆలయంలో కూడా అతనికి పగ! 9 గిబియా రోజులలో లాగే ఈ ప్రజలు చాలా చెడ్డగా ప్రవర్తించారు. దేవుడు వారి దుష్టత్వాన్ని మరవడు. వారి పాపాలకు వారిని శిక్షిస్తాడు.
10 “నేను ఇస్రాయేల్ ప్రజను కనుక్కొన్నప్పుడు అది ఎడారిలో ద్రాక్షపండ్లను కనుక్కొన్నట్టే. మీ పూర్వీకులను చూచినప్పుడు అది అంజూరు చెట్టుమీద మొదటి పండ్లు దొరికినట్టే. అయితే వారు బేల్‌పెయోరుకు వచ్చి అక్కడ సిగ్గుమాలినదానికి తమను సమర్పించుకొన్నారు. తాము ఆశించినది ఎంత నీచమో వారు కూడా అంత నీచులయ్యారు. 11 ఎఫ్రాయింవారి ఘనత పక్షిలాగా ఎగిరిపోతుంది. గర్భం ధరించడం, గర్భంతో ఉండడం పిల్లలను కనడం – ఇవేమీ ఉండవు. 12 ఒక వేళ సంతానాన్ని పెంచినా వారికి ఎవ్వరూ లేకుండా చేస్తాను. వారివైపునుంచి నా ముఖం త్రిప్పినప్పుడు వారికి బాధ తప్పదు. 13 తూరులాగా ఎఫ్రాయిం అందమైన స్థలంలో నాటబడి ఉండడం నేను చూశాను. కానీ ఎఫ్రాయింవారు తమ పిల్లలను సంహారానికి బయటికి తేవలసివస్తుంది.”
14 యెహోవా! వారికి ప్రతీకారం చెయ్యి! నీవు ఏమి ప్రతీకారం చేస్తావు? వారి స్త్రీలకు గర్భస్రావం కలిగించు. వారిని చనుపాలు లేనివారుగా చెయ్యి.
15 “వారి చెడుతనమంతా గిల్‌గాల్‌లో కనిపిస్తున్నది. అక్కడ వారిని అసహ్యించుకొన్నాను. వారు చేసిన చెడుగును బట్టి నేను వారిని నా ఆలయంలో నుంచి పారదోలుతాను. ఇక నుంచి వారిని ప్రేమతో చూడను. వారి నాయకులంతా తిరుగుబాటు చేసేవారు. 16 ఎఫ్రాయింప్రజలు దెబ్బలు తిన్నవాళ్ళు. వారి వేళ్ళు ఎండిపోయాయి. వారివల్ల ఫలం రాదు. ఒకవేళ వారికి సంతానం కలిగినా వారి ముద్దు బిడ్డలను చంపిస్తాను.”
17 వారు నా దేవుని మాట వినలేదు గనుక ఆయన వారిని త్రోసివేశాడు. ఇతర జనాలలో వారు తిరుగుతూ ఉంటారు.