8
1 “బూర నీ నోటికి పెట్టుకో! శత్రువులు గరుడపక్షిలాగా యెహోవా ఇంటిమీదికి వస్తారు. ఎందుకంటే, ఈ ప్రజలు నా ఒడంబడిక మీరి నా ఉపదేశానికి దూరమయ్యారు. 2 ఇస్రాయేల్ ప్రజలు ‘మా దేవా! నిన్ను ఎరుగుదుము’ అని నాకు ఆక్రందన చేస్తారు. 3 అయితే ఇస్రాయేల్ ప్రజలు మంచిని విసర్జించారు. శత్రువులు వారిని తరుముతారు. 4 నా సమ్మతి లేకుండా వారు రాజులను నియమించుకొన్నారు. నా అనుమతి లేకుండా అధిపతులను ఎన్నుకొన్నారు. తమ వెండి బంగారాలు తీసుకొని తమ కోసం విగ్రహాలు చేసుకొన్నారు. ఇది వారి నాశనానికే. 5 షోమ్రోను నగరవాసులారా! మీ దూడ విగ్రహం అసహ్యకరం! నా కోపం వారిమీద రగులుకొంది. ఎంతకాలమని వారు నిర్దోషులు కాకుండా ఉంటారు? 6 ఆ విగ్రహం ఇస్రాయేల్‌వారు చేతితో చేసినదే. స్వర్ణకారుడు దాన్ని చేశాడు. అది దేవుడు కాదు. ఆ షోమ్రోను దూడ చిన్నాభిన్నమవుతుంది. 7 వారు గాలిని విత్తి తుఫానును కోస్తారు. దంటుకు కంకులు లేవు. అది పంటకు రాదు. ఒకవేళ పంటకు వస్తే విదేశీయులు దాన్ని దిగమ్రింగుతారు.
8 “ఇస్రాయేల్‌జనాన్ని దిగమ్రింగడం జరిగింది. ఎవరికీ ఇష్టం కాని పాత్రలాగా అది ఇతర జాతుల మధ్య ఉంది. 9 ఒంటరిగా తిరుగాడే అడవిగాడిదలాగా వారు అష్షూరుకు వెళ్ళారు. ఎఫ్రాయిం కానుకలిచ్చి ప్రేమికులను పిలుచుకొంది. 10 కానుకలిచ్చి ప్రేమికులను పిలుచుకొన్నా ఆ జనాన్ని ఇప్పుడు సమకూరుస్తాను. మహా పరివారం ఉన్న రాజు పెట్టే భారంక్రింద వారు నీరసించిపోవడం మొదలవుతుంది. 11 పాపాలకోసమైన బలులు అర్పించడానికి ఎఫ్రాయింవారు అనేక బలిపీఠాలు కట్టారు. అయితే అవి పాపాలు జరిగే స్థలాలయ్యాయి.
12 “నేను నా ధర్మశాస్త్రంలో గొప్ప విషయాలు వారికోసం వ్రాయించాను గాని అవి విడ్డూరంగా భావించుకొన్నారు. 13  నాకు అర్పించిన బలిపశువులను వధించి వాటి మాంసం తింటారు. కానీ వారంటే యెహోవాకు సంతోషం లేదు. ఇప్పుడు వారి అపరాధాన్ని తలచుకొని వారి పాపాలను చూచి వారిని శిక్షిస్తాడు. వారు ఈజిప్ట్‌కు మళ్ళీ వెళ్ళవలసివస్తుంది. 14 ఇస్రాయేల్ ప్రజ తమ సృష్టికర్తను మరచిపోయి భవనాలు కట్టుకొన్నారు. యూదాప్రజ కోట, గోడల పట్టణాలు కట్టుకొన్నారు. అయితే నేను వారి పట్టణాల మీదికి జ్వాలలను పంపుతాను. అవి వాటి భవనాలను కాల్చివేస్తాయి.