7
1 “నేను ఇస్రాయేల్ ప్రజను బాగు చేద్దామనుకుంటే ఎఫ్రాయింవారి పాపాలూ షోమ్రోను వారి చెడుగూ బట్టబయలుగా కనిపిస్తాయి. వారు మోసం చేస్తూనే ఉంటారు. దొంగలు ఇండ్లలో చొరబడుతారు. దోపిడీగాళ్ళు బయట దోచుకొంటారు. 2 వాళ్ళ దుర్మార్గమంతా నేను జ్ఞాపకముంచుకొంటానని వాళ్ళు ఆలోచించరు. ఇప్పుడు వాళ్ళ క్రియలు వాళ్ళను చుట్టు ముట్టాయి. అవి నా కళ్ళెదుటే ఉన్నాయి. 3  వాళ్ళు చేసిన చెడుగు రాజుకు సంతోషం కలిగిస్తుంది. వాళ్ళ అబద్ధాలు అధిపతులను సంతోష పరుస్తాయి. 4 వారంతా వ్యభిచారం చేసేవాళ్ళు, రొట్టెలు చేసేవాడు వేడి చేసిన పొయ్యిలాంటి వాళ్ళు, ముద్ద పిసికిన తరువాత అది పొంగేవరకు అతడు నిప్పు కదల్చనక్కరలేని పొయ్యివంటివాళ్ళు. 5 మన రాజు ఉత్సవ దినాన అధిపతులు జబ్బుపడేటంతగా ద్రాక్షమద్యం త్రాగుతారు. రాజు పరిహాసకులతో కలిసిమెలసి ఉంటాడు. 6 వాళ్ళ హృదయాలు పొయ్యిలాంటివి. కుట్రతో వాళ్ళు సమీపిస్తారు. రాత్రంతా వాళ్ళ కోపాగ్ని లోలోపలే రగులు కొంటూ ఉంటుంది. ప్రొద్దున అది తీవ్రమైన మంటలాగా ప్రజ్వలిస్తుంది. 7 వాళ్ళు పొయ్యిలాంటివాళ్ళు. వారు తమ పరిపాలకులను దిగమ్రింగివేస్తారు. వారి రాజులందరూ కూలారు. వారిలో ఒక్కడు కూడా నన్ను ప్రార్థించడు.
8 “ఎఫ్రాయింవంశం వేరు వేరు జనాలతో కలుసుకొన్నది. ఆ వంశం త్రిప్పివేయని అట్టులాంటిది. 9 విదేశీయులు వారి బలాన్ని దిగమ్రింగివేస్తారు గాని వారికి అది తెలియదు. తలమీద నెరసిన వెంట్రుకలు కనిపిస్తూ ఉన్నా ఆ సంగతి ఎరగరు. 10 ఇస్రాయేల్ ప్రజల గర్వం వారికి విరోధ సాక్షిలాగా ఉంది. ఇదంతా జరిగినా వారు తమ దేవుడైన యెహోవావైపు తిరగడం లేదు, ఆయనను వెదకడం లేదు. 11 ఎఫ్రాయిం వంశం తెలివితేటలు లేని గువ్వలాంటిది. వారు ఈజిప్ట్‌వాళ్ళను పిలుస్తారు; తరువాత అష్షూరుదేశస్థుల దగ్గరికి పోతారు. 12 వారు పోతూ ఉంటే నేను వారిమీద నా వల వేస్తాను. గాలిలో ఎగిరే పక్షులలాగా వారిని పడగొట్టివేస్తాను. వారి సమాజానికి వచ్చిన సమాచారం ప్రకారమే వారిని శిక్షిస్తాను.
13 “వారికి బాధ తప్పదు. వారు నన్ను వదలివేసి తప్పిపోయేవాళ్ళు. వారికి నాశనం తప్పదు. వారు నామీద తిరుగుబాటు చేసేవారు. వారిని విముక్తులను చేద్దామనుకొన్నా వారు నామీద అబద్ధాలు చెపుతారు.
14 “నన్ను హృదయపూర్వకంగా ప్రాధేయపడరు గాని పడకలమీద పడుకొని విలపిస్తారు. నన్ను వదలిపెట్టి ధాన్యం, ద్రాక్షరసం కావాలని గుంపుగా సమకూడుతారు. 15 వారికి శిక్షణ ఇచ్చినది, బలం ప్రసాదించినది నేనే. అయినా వారు నామీద దురాలోచన చేస్తున్నారు. 16 వారు సర్వాతీతునివైపు తిరగరు. ఎక్కుపెడితే సరిగా వంగని విల్లులాగా ఉన్నారు. వారి అధిపతులు గర్వంగా మాట్లాడే తమ నాలుకల కారణంగా కత్తిపాలవుతారు. ఈ విధంగా వారు ఈజిప్ట్‌దేశస్థుల ఎగతాళికి గురి అవుతారు.