6
1 “రండి, మనం యెహోవావైపు మళ్ళీ తిరుగుదాం. ఆయన మనలను చీల్చి ముక్కలు చేశాడు గాని ఆయన మనలను బాగు చేస్తాడు. మనలను గాయపరచాడు గాని మన గాయాలకు కట్టు కడతాడు. 2 ఇంకా రెండు రోజులకు ఆయన మనలను బ్రతికిస్తాడు. ఆయన సమక్షంలో మనం బ్రతికేలా మూడో రోజున ఆయన మనలను పైకెత్తుతాడు. 3 యెహోవాను తెలుసుకొందాం. ఆయనను తెలుసుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేద్దాం. ప్రొద్దు పొడవడం ఎంత నిశ్చయమో ఆయన రావడం అంత నిశ్చయం. వర్షంలాగా, భూమిని తడిపే తొలకరి వానలాగా ఆయన మనదగ్గరికి వస్తాడు.”
4 “ఎఫ్రాయింవారలారా! మిమ్ములను నేనేమి చేయాలి? యూదాప్రజలారా! నేను మిమ్ములను చేయవలసినదేమిటి? మీ భక్తి ఉదయం పొగమంచులాగా, ప్రొద్దున త్వరగానే ఆరిపోయే మంచులాగా ఉంది. 5 అందుచేత మిమ్ములను ప్రవక్తల మూలంగా ఖండించాను. నా నోటి మాటలచేత మిమ్ములను చంపివేశాను, నా తీర్పులు మీ మీదికి మెరుపులాగా వచ్చాయి. 6 మీరు కరుణ చూపడమే నాకిష్టం గాని బలియాగాలు అర్పించడం కాదు. హోమాలు అర్పించడంకంటే దేవుణ్ణి గురించిన జ్ఞానం మీకు కలగడం నాకిష్టం. 7 ఆదాములాగా వారు నా ఒడంబడిక మీరి నాపట్ల స్వామిద్రోహం చేశారు. 8 గిలాదు చెడుగు చేసేవాళ్ళతో నిండిన పట్టణం అక్కడ రక్తమయమైన అడుగుజాడలు కనిపిస్తున్నాయి. 9 యాజుల గుంపు దోపిడీ దొంగలలాగా మాటులో పొంచివుంటారు. షెకెంకు పోయే త్రోవలో వాళ్ళు హత్య చేస్తారు, సిగ్గుమాలిన పనులు చేస్తారు. 10 ఇస్రాయేల్ రాజ్యంలో ఘోరమైన సంగతి నాకు కనిపించింది. అక్కడ ఎఫ్రాయింవాళ్ళు వేశ్యలాగా ప్రవర్తిస్తున్నారు. ఇస్రాయేల్‌వారు తమను అశుద్ధం చేసుకొన్నారు. 11 యూదావారలారా! నేను నా ప్రజలకు ముందున్న క్షేమస్థితిని మళ్ళీ ప్రసాదించినప్పుడు మీకు కూడా పంట కోత జరుగుతుందని నియమించాను.