5
1 ✽“యాజులారా! ఇది వినండి! ఇస్రాయేల్ ప్రజలారా! ఆలకించండి! రాజవంశం వారలారా! చెవి ఒగ్గి వినండి! మీ విషయం తీర్పు తీర్చడం జరిగింది. మీరు మిస్పాలో ఉరిలాగా ఉన్నారు, తాబోరు మీద వలలాగా✽ ఉన్నారు. 2 ఈ ద్రోహులు అధిక సంహారం చేస్తున్నారు. నేను వారందరినీ శిక్షిస్తాను✽. 3 ఎఫ్రాయిం✽ గోత్రం విషయమంతా నాకు తెలుసు✽. నేను చూడకుండా ఇస్రాయేల్ ప్రజలు దాగుకోగలవారు కాదు. ఎఫ్రాయిం! నీవు వేశ్యవై✽ తిరుగుతున్నావు. ఇస్రాయేల్ ప్రజలు తమ్మును అశుద్ధం✽ చేసుకొన్నారు. 4 తమ పనులు వారు తమ దేవునివైపు మళ్ళీ తిరగకుండా✽ చేస్తున్నాయి. వారికి వ్యభిచార మనస్తత్వం✽ ఉంది. వారు యెహోవాను ఎరగరు✽. 5 ఇస్రాయేల్ ప్రజల గర్వం✽ వారికి విరోధ సాక్షిలాగా ఉంది. ఇస్రాయేల్ ప్రజలు, ఎఫ్రాయింవారు పాపాలచేత తొట్రుపడుతూ ఉన్నారు. వారితోపాటు యూదా✽ప్రజలు తొట్రుపడుతున్నారు. 6 వారు గొర్రెలనూ పశువులనూ తీసుకొని యెహోవాను వెదకడానికి✽ బయలుదేరుతారు గాని ఆయనను కనుక్కొలేకపోతారు. ఆయన వారిదగ్గరనుంచి వెళ్ళిపోయాడు. 7 ✽ వారు యెహోవాకు వ్యతిరేకంగా స్వామిద్రోహం చేశారు. వారి సంతానం అక్రమ సంతానం. కొంత కాలానికి అమావాస్య✽ కాలంలో వారు వారి భూములతోపాటు నాశనం అవుతారు.8 ✽“గిబియాలో పొట్టేలు కొమ్ము బూర ఊదండి! రామాలో బూర ఊదండి! ‘బెన్యామీను✽ గోత్రికులారా! మీ వెంట వస్తామ’ని బేత్ ఆవెనులో కేకలు పెట్టండి! 9 దండన రోజున ఎఫ్రాయిం పాడైపోతుంది✽. ఇస్రాయేల్ గోత్రాలకు నేను తెలియజేస్తున్నది జరిగితీరుతుంది✽. 10 యూదా✽ప్రజల నాయకులు సరిహద్దు రాళ్ళను తీసివేసేవారిలాంటివారు. నా కోపం నీళ్ళలాగా వారిమీద కుమ్మరిస్తాను. 11 ✝ఎఫ్రాయింవారు మానవ విధానాలను అనుసరించడానికి ఇష్టపడ్డారు, గనుక వారు క్రుంగిపోయిన స్థితిలో ఉన్నారు. తీర్పుకూ దౌర్జన్యానికీ గురి అయినవారు. 12 ✽నేను చిమ్మట పురుగులాగా ఎఫ్రాయింవారిని, కొరుకు పుండులాగా యూదా వంశీయులను నష్టపరుస్తున్నాను. 13 ✽తమకు వచ్చిన రోగం ఎఫ్రాయిం జనం చూచుకొన్నప్పుడూ యూదాజనం తమ పుండ్లు చూచుకొన్నప్పుడూ ఎఫ్రాయింవారు అష్షూరుకు వెళ్ళారు, ఆ గొప్ప రాజుకు కబురు పంపారు. అయితే అతడు మిమ్ములను బాగు చేయలేడు, మీ పుండ్లను మాన్పలేడు. 14 ✽ఎందుకంటే, నేను ఎప్రాయింజనానికి సింహంలాగా ఉంటాను. యూదాజనానికి కొదమ సింహంలాగా ఉంటాను. వారిని చీల్చి✽ ముక్కలు చేసి వారిని తీసుకుపోతాను. నేనే అలా చేస్తాను. విడిపించేవాడెవ్వడూ ఉండడు. 15 ✽వారు తమ అపరాధం ఒప్పుకొని నన్ను వెదికేవరకూ✽ నేను తిరిగి నా స్థలానికి వెళ్ళిపోతాను. వారి దురవస్థలో నన్ను త్వరగా వెదకుతారు.”