4
1 ఇస్రాయేల్ ప్రజలారా! యెహోవా వాక్కు వినండి – యెహోవా ఈ దేశవాసులమీద నేరం మోపుతూ ఉన్నాడు. ఏమంటే, “ఈ దేశంలో విశ్వసనీయత, కనికరం ఏమీ లేవు. దేవుణ్ణి గురించిన జ్ఞానమూ లేదు. 2 దూషణ, అబద్ధాలు, హత్య, దొంగతనం, వ్యభిచారం అంతటా ఉన్నాయి. వాళ్ళు దౌర్జన్యం చేస్తారు. రక్తపాతం వెంట రక్తపాతం జరుగుతూ ఉంది. 3 ఈ కారణంచేత దేశం శోకిస్తూ ఉంది. దేశవాసులంతా నీరసించిపోతున్నారు. అడవి జంతువులూ గాలిలో ఎగిరే పక్షులూ సరస్సులోని చేపలూ అంతర్ధానం అవుతున్నాయి.
4 “అయితే ఒక వ్యక్తి మరొకడిమీద నేరం మోపకూడదు. ఒకడు మరొకణ్ణి ఖండించకూడదు. నీ ప్రజలు యాజిమీద నేరం మోపేవాళ్ళలాగా ఉన్నారు. 5 పగలు మీరు తొట్రుపడుతూవున్నారు. నీతోకూడా ప్రవక్తలు రాత్రిపూట తొట్రుపడుతున్నారు. కనుక నేను నీ తల్లిని నాశనం చేస్తాను. 6 జ్ఞానం లేకపోవడం కారణంగా నా ప్రజలు నశించిన స్థితిలో ఉన్నారు. మీరు జ్ఞానాన్ని త్రోసివేశారు గనుక మీరు నాకు యాజులుగా ఉండకుండా మిమ్ములను త్రోసివేస్తున్నాను. మీరు మీ దేవుని ఉపదేశాన్ని తలచుకోలేదు గనుక నేను మీ పిల్లలను తలచుకోను. 7 యాజుల సంఖ్య పెరిగినకొద్దీ వారు నాకు వ్యతిరేకంగా పాపం చేశారు. నేను వారి ఘనతను అవమానానికి మారుస్తాను. 8 నా ప్రజలు పాపాలు చేస్తూ ఉన్నప్పుడు అది యాజులకు ఆహారంలాగా ఉంది. వారి అక్రమాలంటే యాజులకు అత్యాశ. 9 అందుచేత ప్రజలకు ఎలాగో యాజులకు అలాగే జరుగుతుంది. వారి ప్రవర్తననుబట్టి వారిని శిక్షిస్తాను. వారి పనులకు ప్రతీకారం చేస్తాను. 10 వారు యెహోవా మాట వినడం మానుకొన్నారు, గనుక వారు భోజనం చేస్తారు గాని వారికి తృప్తి అనిపించదు. వారు పడుపు పనులు చేస్తారు గాని అభివృద్ధి పొందరు.
11 “వ్యభిచారం, ద్రాక్షమద్యం, మద్యపానం – ఇవి వారి మనసును వశపరచుకొన్నాయి. 12 నా ప్రజలు కట్టెతో చేసిన విగ్రహానికి మనవి చేస్తారు. వారి కొయ్య వారికి సంగతి బయలుపరుస్తుంది. వ్యభిచార మనస్తత్వం వారిని సరైన త్రోవనుంచి తప్పిస్తుంది. వారు తమ దేవుణ్ణి విడిచి వ్యభిచారిణిలాగా ప్రవర్తిస్తున్నారు. 13 వారు పర్వతాల మీద బలులు అర్పిస్తారు. కొండల మీద ధూపం వేస్తారు. మంచి నీడ ఉందని సిందూర వృక్షాలూ చినారు వృక్షాలూ మస్తకి వృక్షాల క్రింద ధూపం వేస్తారు. మీ కూతుళ్ళు వేశ్యలు కావడానికీ, మీ కోడండ్రు వ్యభిచారిణులు కావడానికి కారణం అదే. 14 ఈ మనుషులు వ్యభిచారిణులతో పోతారు, గుళ్ళకు చెందిన వేశ్యలతో కలిసి బలులర్పిస్తారు, గనుక మీ కూతుళ్ళు వేశ్యలయితే, మీ కోడండ్రు వ్యభిచారిణులయితే నేను వారిని శిక్షించను. తెలివితేటలు లేని ప్రజలు నాశనానికి గురి అవుతారు.
15 “ఇస్రాయేల్ ప్రజలారా, మీరు వ్యభిచారిణిలాగా ప్రవర్తించారు. అయినా, యూదాప్రజలు అలాంటి పాపం చేయకుండా ఉంటారు గాక! గిల్‌గాల్‌కు వెళ్ళవద్దు. బేత్ ఆవెనుకు వెళ్ళవద్దు. ‘యెహోవా జీవంతోడ’ని ఒట్టుపెట్టుకోకు. 16 మొండి పెయ్యలాగా ఇస్రాయేల్ ప్రజలు మొండిగా మసులుతున్నారు. విశాలమైన మైదానంలో గొర్రెపిల్లలను మేపినట్టు యెహోవా వారిని ఎలా పోషిస్తాడు? 17 ఎఫ్రాయింవారు విగ్రహాలతో చేరారు. వారిని ఆ స్థితిలో ఉండనియ్యి. 18 వారి ద్రాక్షమద్యం అయిపోయినా వ్యభిచారం చేస్తూనే ఉన్నారు. వారి నాయకులకు సిగ్గుమాలిన పనులంటే చాలా ఇష్టం. 19 సుడిగాలి ఆ ప్రజలను చుట్టి తీసుకుపోతుంది. వారు అర్పించే బలుల కారణంగా వారికి ఆశాభంగం కలుగుతుంది.