2
1 ✽ “మీరు మీ సోదరులను ‘నా జనం’ అనండి; మీ సోదరీలను ‘వాత్సల్యం పొందినవారు’ అనండి.2 “మీ తల్లి✽తో వాదించండి, వాదించండి. ఆమె నా భార్య కాదు✽. నేను ఆమె భర్తను కాను. ఆమె తన కండ్లనుంచి వ్యభిచారం చూపులు తొలగించుకోవాలి✽. తన రొమ్ము మీదనుంచి తన జారత్వాన్ని తీసివేసుకోవాలి. 3 ✝లేకపోతే ఆమెను దిగంబరం చేస్తాను. ఆమె బట్టలు తీసివేసి పుట్టిన నాటిలాగా ఆమెను నగ్నంగా చేస్తాను. ఆమెను నీళ్ళు లేని ఎడారిగా చేస్తాను. దాహంచేత ఆమెను చంపుతాను. 4 ✽ ఆమె సంతానం వ్యభిచారంవల్ల పుట్టినవారు గనుక వారిపట్ల వాత్సల్యం చూపను. 5 వారి తల్లి వ్యభిచారిణిలాగా ప్రవర్తించింది. వారిని కన్న ఆమె సిగ్గుమాలిన విధంగా మసులుకొంది. ఆమె ఇలా అంది: ‘నా విటులు నాకు ఆహారం, నీళ్ళు, గొర్రెబొచ్చు, జనపనార, నూనె, మద్యం ఇస్తున్నారు. వాళ్ళ వెంట పోతాను✽.’ 6 ✽అందుచేత ఆమె త్రోవకు ముండ్ల కంచె అడ్డంగా వేస్తాను. ఆమెకు తన త్రోవలేమీ కనిపించకుండా గోడ నిర్మిస్తాను. 7 ✽తన ప్రేమికులను వెంటాడుతూ ఉన్నప్పుడు వారిని కలుసుకోలేకపోతుంది. ఎంత వెదికినా వారు కనబడరు. అప్పుడామె ‘నా మొదటి భర్తదగ్గరికి తిరిగి పోతాను. ఇప్పటికంటే అప్పుడు నా స్థితిగతులు బాగున్నాయి’ అనుకొంటుంది. 8 ✽ ఆమెకు ధాన్యం, ద్రాక్షరసం, నూనె, చాలా వెండి బంగారాలు ఇచ్చినది నేనే అని ఒప్పుకోకుండా అవి బయల్ దేవుడికోసం✽ వినియోగించు కొన్నారు.
9 ✽“గనుక కోత కాలంలో నా ధాన్యం ఆమె దగ్గరనుంచి తీసివేస్తాను. దాని కాలంలో నా ద్రాక్షరసం తీసివేస్తాను. ఆమె దిగంబరత్వాన్ని కప్పుకొనేందుకు ఇద్దామనుకొన్న గొర్రెబొచ్చు, జనపనార తీసివేస్తాను. 10 ఆమె ప్రేమికుల కండ్లెదుటే ఆమె సిగ్గుమాలిన ప్రవర్తన వెల్లడి చేస్తాను. నా చేతిలో✽నుంచి ఆమెను ఎవ్వరూ విడిపించరు. 11 ✽ఆమె ఉత్సవకాలాలనూ పండుగలనూ అమావాస్యలనూ విశ్రాంతి దినాలనూ – ఆమె నియామక కాలాలన్నిటినీ నిలిపివేస్తాను. 12 ఆమె ద్రాక్ష చెట్లనూ అంజూరు చెట్లనూ పాడు చేస్తాను. ‘అవి నా ప్రేమికులు నాకిచ్చిన జీతం’ అని ఆమె చెప్పింది గదా. వాటిని దట్టమైన అడవిగా మారుస్తాను. అడవి జంతువులు వాటిని తింటాయి. 13 ✽ఆమె నన్ను మరిచిపోయి✽ బయల్ దేవుడి విగ్రహాలకు ధూపం వేసింది, నగలూ ఆభరణాలూ పెట్టుకొని ఆమె ప్రేమికుల వెంట వెళ్ళింది గనుక నేను ఆమెను శిక్షిస్తాను. ఇది యెహోవా వాక్కు.
14 ✽“అయినా, ఆమెను ఆకర్షించి ఎడారిలోకి నడిపించి ఆమెతో మృదువుగా మాట్లాడుతాను. 15 అక్కడ ఆమెకు ఆమె ద్రాక్షతోటలు మళ్ళీ ఇస్తాను✽. ‘ఆకోరు✽ లోయ’ను ఆశాభావానికి ద్వారంగా చేస్తాను. అక్కడ ఆమె తన యువప్రాయం✽లో, ఈజిప్ట్✽నుంచి వచ్చిన కాలంలో లాగే మళ్ళీ గానం చేస్తుంది. 16 ఆ రోజు నీవు నన్ను భర్త✽ అంటావు. అప్పటినుంచి యజమాని✽ అనవు. ఇది యెహోవా వాక్కు. 17 ✽ బయల్ దేవుళ్ళ పేర్లు ఆమె నోట రాకుండా చేస్తాను. అప్పటినుంచి ఆ పేర్లు మళ్ళీ జ్ఞప్తికి కూడా రావు. 18 ✽ఆ రోజు నా ప్రజకోసం అడవి జంతువులతో గాలిలో ఎగిరే పక్షులతో, నేలను ప్రాకే జంతువులతో ఒడంబడిక చేస్తాను. విల్లు, ఖడ్గం, యుద్ధం✽ దేశంలో లేకుండా చేస్తాను. వారు నిర్భయంగా నిద్రపోయేలా చేస్తాను. 19 ✽నీవు శాశ్వతంగా నా భార్యవై ఉండేలా చేస్తాను. నీతిన్యాయాలలో, కృప కనికరాలలో, 20 విశ్వసనీయతలో నీవు నా భార్యవై ఉండేలా చేస్తాను. అప్పుడు నీవు యెహోవాను తెలుసుకొంటావు✽.
21 ✽“ఆ రోజున నేను మాట్లాడుతాను. ఆకాశాలతో మాట్లాడుతాను. అవి భూమితో మాట్లాడుతాయి. 22 భూమి ధాన్యంతో, ద్రాక్షరసంతో, నూనెతో మాట్లాడుతుంది. అవి యెజ్రేల్‌తో మాట్లాడుతాయి. 23 నేను ఆమెను దేశంలో✽ నాటుకొంటాను. వాత్సల్యం పొందని✽ ఆమెపట్ల వాత్సల్యం చూపుతాను. ‘నా ప్రజ✽ కానివారిని’ చూచి ‘మీరు నా ప్రజ’ అంటాను. వారు నన్ను ‘నీవు మా దేవుడివి✽’ అంటారు. ఇది యెహోవా వాక్కు.”