హోషేయ
1
1 ఇది బెరి కొడుకు హోషేయ✽కు యెహోవానుంచి వచ్చిన వాక్కు✽. ఉజ్జియా, యోతాం, ఆహాజు, హిజ్కియా అనే యూదా రాజుల✽ కాలాలలో, యెహోయాషు కొడుకు✽ యరొబాం అనే ఇస్రాయేల్ రాజు కాలంలో ఈ వాక్కు వచ్చింది.2 యెహోవా హోషేయ ద్వారా మాట్లాడడం✽ ఆరంభించినప్పుడు ఆయన అతనితో ఇలా అన్నాడు: “ఈ దేశం యెహోవాను విడిచిపెట్టి నీచంగా వ్యభిచారిణిలాగా ప్రవర్తిస్తూ ఉంది గనుక నీవు వెళ్ళి వ్యభిచారం✽ చేసిన స్త్రీని✽ పెండ్లి చేసుకో. వ్యభిచారంవల్ల పుట్టిన ఆమె పిల్లలను స్వీకరించు.”
3 ✽అందుచేత హోషేయ వెళ్ళి దిబ్లయీం కూతురు గోమెరును పెండ్లి చేసుకొన్నాడు. ఆమె గర్భవతి అయి అతనికి మగబిడ్డను కన్నది. 4 అప్పుడు యెహోవా హోషేయతో ఇలా అన్నాడు: “వాడికి యెజ్రేల్✽ అనే పేరు పెట్టు. ఎందుకంటే, యెజ్రేల్‌లో జరిగిన రక్తపాతం విషయంలో కొంత కాలానికి✽ నేను యెహూ✽ రాజవంశంవారిని శిక్షిస్తాను, ఇస్రాయేల్ రాజ్యాన్ని✽ తుదముట్టిస్తాను. 5 ✽ఆ రోజు యెజ్రేల్ లోయలో నేను ఇస్రాయేల్ ప్రజల విల్లు విరగగొట్టివేస్తాను.”
6 మరోసారి గోమెరు గర్భవతి అయి ఆడపిల్లను కన్నది. అప్పుడు యెహోవా హోషేయతో ఇలా అన్నాడు: “ఆ బిడ్డకు లో–రూహామా✽ అని పేరు పెట్టు. ఎందుకంటే ఇకనుంచి నేను ఇస్రాయేల్ ప్రజను ఏమాత్రం క్షమించను, వారిపట్ల వాత్సల్యం చూపను. 7 ✽యూదాప్రజ పట్ల వాత్సల్యం చూపుతాను, వారిని వారి దేవుడు యెహోవా ద్వారా సంరక్షిస్తాను గాని విల్లు, ఖడ్గం, యుద్ధం, గుర్రాలు రౌతుల మూలంగా కాదు✽.”
8 లో–రూహామాకు పాలు మాన్పించిన తరువాత గోమెరు గర్భవతి అయి మరో మగపిల్లవాణ్ణి కన్నది. 9 యెహోవా ఇలా అన్నాడు: “వాడికి లో–అమ్మి✽ అని పేరు పెట్టు. ఎందుకంటే, మీరు నా జనం కాదు.
10 ✽ “అయినా, ఇస్రాయేల్ ప్రజల సంఖ్య సముద్రం ఇసుక✽ రేణువులలాగే అమితంగా, లెక్క పెట్టలేనంతగా ఉంటుంది. ‘మీరు నా జనం కాదు’ అని చెప్పిన స్థలం✽లోనే వారిని ‘సజీవ దేవుని సంతానం’ అనడం జరుగుతుంది. 11 యూదాజనం, ఇస్రాయేల్ జనం మళ్ళీ ఒకటే అవుతాయి✽. తమమీద ఒకే ఒక నాయకుణ్ణి✽ ఎన్నుకొంటారు. అప్పుడు వారు ఈ దేశంనుంచి బయలుదేరుతారు. ఎందుకంటే, యెజ్రేల్ రోజు✽ మహా దినమవుతుంది.