11
1 “మాదీయవాడైన దర్యావేషు✽ ఏలిన మొదటి ఏడాది మిఖాయేల్‌కు సహాయం, సంరక్షణ కోసం నేను నిలబడ్డాను.) 2 ✽ఇప్పుడు సత్యం నీకు తెలియజేస్తాను – ఇంకా ముగ్గురు రాజులు✽ పారసీకదేశాన్ని పరిపాలించబోతారు. వారి తరువాత అందరికంటే అధిక ధనికుడైన నాలుగో రాజు పరిపాలిస్తాడు. తన ధనంవల్ల అతడు బలం పొంది గ్రీస్‌వారి రాజ్యానికి వ్యతిరేకంగా అందరినీ పురికొలుపుతాడు. 3 ✽తరువాత పరాక్రమం ఉన్న రాజు పైకి వచ్చి మహా విశాల రాజ్యంపై పరిపాలిస్తాడు. ఇష్టానుసారంగా జరిగిస్తాడు. 4 అతడు పైకి వచ్చిన తరువాతే అతడి రాజ్యం చీలిపోయి ఆకాశం నలుదిక్కులకు✽ పంచిపెట్టబడుతుంది. ఆ రాజ్యాన్ని అతడి సంతానం పొందరు. దానిని పెరికివేసి ఇతరులకు ఇవ్వడం జరుగుతుంది. కనుక అతడు ఉపయోగించే అధికారం తరువాత వారికి ఉండదు.5 ✽“తరువాత దక్షిణ ప్రాంతం రాజు బలం పొందుతాడు. అయితే అతడికంటే అతడి అధిపతులలో ఒకడు ఎక్కువ బలం పొంది అతడి రాజ్యంకంటే ఎక్కువ విశాల రాజ్యమేలుతాడు. 6 కొన్ని ఏండ్లయిన తరువాత వాళ్ళిద్దరు సంధి చేసుకొంటారు. అంతేగాక, దక్షిణప్రాంతం రాజు కూతురు✽ ఉత్తరప్రాంతం రాజు✽తో సమాధానపడడానికి అతడిదగ్గరికి వెళ్ళిపోతుంది. అయినా, ఆమె బలం నిలుపుకోలేకపోతుంది. అతడు కూడా తన బలంతో నిలిచి ఉండడు. ఆమె, ఆమెను అక్కడికి తీసుకుపోయినవారు, ఆమె తండ్రి, ఆ కాలంలో ఆమెకు సహాయం చేసినవాడు ఇతరుల వశం అవుతారు. 7 అతడికి బదులుగా ఆమె వంశంలో ఒకడు✽ పైకి వస్తాడు. అతడు ఉత్తరప్రాంతం రాజుయొక్క సైన్యం పైబడి ఆ రోజు కోటలో చొరబడుతాడు; వాళ్ళపట్ల ఇష్టం వచ్చినట్టే జరిగించి వాళ్ళను గెలుస్తాడు; 8 వాళ్ళ దేవతలనూ పోత విగ్రహాలనూ వెండి బంగారు వస్తువులనూ పట్టుకొని ఈజిప్ట్‌కు తీసుకుపోతాడు. కొన్ని సంవత్సరాలు అతడు ఉత్తరప్రాంతం రాజుదగ్గరికి వెళ్ళకుండా ఉంటాడు.
9 “తరువాత ఉత్తరప్రాంతం రాజు దక్షిణప్రాంతం రాజుయొక్క దేశంలోకి దండెత్తి వస్తాడు గాని స్వదేశానికి తిరిగి వెళ్ళిపోతాడు. 10 అతడి కొడుకులు✽ యుద్ధానికి తమ్మును పురికొలుపుకొని మహా సైన్యాన్ని సమకూర్చుకొంటారు. ఆ సైన్యం వచ్చితీరుతుంది. వరద పొర్లిపారిన విధంగా వస్తుంది. కోట దరిదాపుల వరకు యుద్ధం చేస్తూ ఉంటుంది. 11 ✽అప్పుడతడు మహా కోపోద్రేకంతో బయలుదేరి ఉత్తరప్రాంతం రాజుతో యుద్ధం చేస్తాడు. ఉత్తరప్రాంతం రాజు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకొన్నా, అది ఓడిపోతుంది. 12 ఆ సైన్యాన్ని జయించి పట్టుకుపోయినందుచేత దక్షిణప్రాంతం రాజు విర్రవీగుతూ వేలాది మందిని హతమారుస్తాడు. కాని అతడి బలప్రభావాలు నిలవవు. 13 ఎందుకంటే ఉత్తరప్రాంతం రాజు మరో సైన్యాన్ని – ఆ మొదటి సైన్యంకంటే గొప్ప సైన్యాన్ని – సమకూరుస్తాడు. కొన్ని సంవత్సరాలైన తరువాత సమృద్ధి అయిన యుద్ధసామాను ఉన్న ఆ గొప్ప సైన్యంతోపాటు అతడు తిరిగి వస్తాడు.
14 “ఆ రోజుల్లో చాలామంది దక్షిణ✽ప్రాంతం రాజును ఎదిరిస్తారు. నీ ప్రజలో✽ కూడా బలాత్కారులు దర్శనాన్ని నెరవేర్చుకుందామని తిరగబడుతారు గాని వారు భంగపడిపోతారు. 15 ఈ లోగా ఉత్తరప్రాంతం రాజు వచ్చి కోట, గోడల పట్టణానికి✽ ముట్టడి దిబ్బ వేయించి పట్టణాన్ని పట్టుకొంటాడు. దక్షిణప్రాంతం సైన్యానికి వాళ్ళను ఎదిరించే శక్తి ఉండదు. దానిలో ఆరితేరినవాళ్ళు కూడా వీగిపోకుండా నిలబడడానికి చాలినంత బలం ఉండదు. 16 వచ్చినవాడు✽ ఇష్టం వచ్చినట్టు జరిగిస్తాడు. అతణ్ణి ఎవ్వరూ ఎదిరించలేక పోతారు. కొంతకాలం, నాశనం చేసే బలంతో అతడు ‘అందమైన దేశం’లో కూడా ఉండిపోతాడు. 17 తరువాత అతడు తన రాజ్యానికి ఉన్న బలమంతటితో పాటు రావడానికి నిశ్చయించుకొంటాడు. అతడు దక్షిణప్రాంతం రాజుతో సంధి చేసుకొంటాడు, గాని అతడి రాజ్యాన్ని నాశనం చేయడానికి ఒక కూతురు✽ను అతడికి ఇస్తాడు. అయితే ఆమె అతడిపక్షంగా నిలకడగా ఉండిపోదు. 18 అప్పుడతడు సముద్ర ప్రదేశాలకూ ద్వీపాలకూ వెళ్ళి చాలామందిని పట్టుకొంటాడు. కానీ అతడు కలిగించిన అవమానాన్ని ఒక సేనాధిపతి✽ తుదముట్టిస్తాడు, అతణ్ణి అవమానానికి గురిచేసి తీరుతాడు. 19 ✽అప్పుడతడు తన దేశంలో ఉన్న కోటలవైపు వెనక్కు వెళ్ళిపోతాడు గాని అతడు తడబడి కూలిపోయి మరెన్నడూ కంటికి కనబడడు. 20 ✽అతడికి మారుగా అధికారానికి వచ్చినవాడు రాజ్య వైభవాన్ని నిర్వహించడానికి సుంకాల వాణ్ణి పంపిస్తాడు. కానీ కొంత కాలంలోనే, ఎవరి ఆగ్రహానికీ గురి కాకుండా, యుద్ధానికి బయటే అతడు నాశనం అవుతాడు.
21 ✽అతడి స్థానంలో ఒక నీచుడు అధికారానికి వస్తాడు. రాజుకు చెందే ఘనత అతడిపట్ల జరగదు. నెమ్మది కాలంలో అతడు వచ్చి మాయోపాయాలచేత రాజ్యాన్ని స్వాధీనం చేసుకొంటాడు. 22 ✽అతడి ఎదుటనుంచి ఒక సైన్యం వరదలాగా పారిపోయి ఒప్పందం చేసిన నాయకుడితో కూడా నాశనం అవుతుంది. 23 అతడితో సంధి జరిగిన తరువాత అతడు మోసంగా ప్రవర్తిస్తాడు. అతణ్ణి కొద్దిమంది మాత్రమే అనుసరించినా, అతడి బలం వృద్ధి అవుతుంది. 24 నెమ్మది కాలంలో, ఎక్కువ ధనం ఉన్న ప్రదేశాలలోకి దండెత్తి వెళ్ళి తన పూర్వీకులు ఎన్నడూ జరిగించనిదానిని జరిగిస్తాడు – అక్కడ కొల్లసొమ్మునూ దోపిడీనీ ధనాన్నీ తన అనుచరులకు పంచియిస్తాడు. కోట గోడల పట్టణాలను ఎలా పట్టుకోవాలో కొంత కాలంపాటు కుట్ర పన్నుతాడు.
25 “తరువాత అతడు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకొని దక్షిణప్రాంతం రాజు✽తో యుద్ధం చేయడానికి తననూ తన బలాన్నీ పురికొల్పుతాడు. దక్షిణప్రాంతం రాజు మహా బలం గల గొప్ప సైన్యాన్ని సమకూర్చుకొని యుద్ధానికి బయలుదేరుతాడు, గాని కొందరు అతడికి వ్యతిరేకంగా కుట్రలు పన్నడంచేత అతడు నిలబడలేకపోతాడు. 26 అతడు పెట్టిన తిండి తినేవాళ్ళు అతడి నాశనానికి కారకులవుతారు. అతడి సైన్యం✽ ఓడిపోతుంది. చాలామంది హతమై కూలుతారు. 27 ఆ ఇద్దరు రాజులు✽ కీడును ఉద్దేశిస్తూ, ఒకే బల్లదగ్గర కూర్చుని ఒకడితో ఒకడు అబద్ధాలాడుతూ ఉంటారు. అలా చేసినా లాభం ఉండదు. ఆ సంగతి నిర్ణీత కాలంలోనే అంతం అవుతుంది. 28 ఉత్తరప్రాంతం రాజు చాలా సొమ్ము తీసుకొని స్వదేశానికి తిరిగి వెళ్ళిపోతాడు. అయితే పవిత్రమైన ఒడంబడిక✽ విషయం అతడి మనసులో విరోధ భావం ఉండడంచేత, దానికి వ్యతిరేకంగా జరిగిస్తాడు. ఆ తరువాత స్వదేశానికి వెళ్ళిపోతాడు.
29 “నిర్ణీత కాలం✽లో అతడు మళ్ళీ దక్షిణప్రాంతానికి దండెత్తిపోతాడు. కానీ మునుపు జరిగినట్టు ఈ సారి జరగదు. 30 పడమటి కోస్తా ప్రాంతాలనుంచి ఓడలు✽ వచ్చి అతణ్ణి ఎదిరిస్తాయి. అందుచేత అతడు నిరుత్సాహపడుతాడు. వెనక్కు తిరిగి పవిత్రమైన ఒడంబడిక✽ విషయం అధికంగా కోపగించి దానికి వ్యతిరేకంగా జరిగిస్తాడు. మళ్ళీ వచ్చి పవిత్రమైన ఒడంబడికను విడిచిపెట్టిన✽వాళ్ళను గమనిస్తాడు. 31 ✽అతడి సైనికులలో కొందరు దేవాలయానికి చెందిన కోటను అపవిత్రం చేసి రోజూ అర్పించే బలిని నిలిపివేస్తారు. అప్పుడు అసహ్యమైన వినాశకారిని నిలుపుతారు. 32 ✽అతడు ముఖస్తుతి చేసి ఒడంబడికను మీరినవాళ్ళను చెడగొడతాడు. అయితే తమ దేవుణ్ణి తెలుసుకొన్నవారు బలం పుంజుకొని గొప్ప క్రియలు చేస్తారు. 33 ప్రజలో తెలివితేటలు ఉన్నవారు చాలామందికి ఉపదేశం ఇస్తారు. గాని కొంత కాలం వారిని ఖడ్గంచేత హతమార్చడం, అగ్నితో కాల్చడం, చెరపట్టడం, దోచుకోవడం జరుగుతుంది. 34 వారు దీనావస్థలోకి దిగిపోయినప్పుడు కొద్ది సహాయం దొరుకుతుంది. అయితే చాలామంది కపటంగా✽ వారి పక్షం చేరుతారు. 35 తెలివితేటలు ఉన్నవారిలో కొంతమంది దీనావస్థలోకి దిగి✽పోతారు. వారిని పరీక్షించి పవిత్రపరచి శుద్ధి చేయడానికి చివరి కాలం✽వరకు అలా జరుగుతుంది. అది నిర్ణీత కాలంలో సంభవిస్తుంది.
36 ✽✽ “ఆ రాజు ఇష్టం వచ్చినట్టు జరిగిస్తాడు. సర్వదేవత సమూహానికి పైగా తనను హెచ్చించుకొని గొప్పలు చెప్పుకొంటూ ఉంటాడు. దేవాది దేవునికి వ్యతిరేకంగా విపరీతమైన సంగతులు చెపుతాడు. కోప కాలం✽ పూర్తి అయ్యేవరకు అతడు వర్ధిల్లుతూ ఉంటాడు. నిర్ణయించినది జరిగితీరాలి. 37 ✽అతడు తన పూర్వీకుల దేవుణ్ణి లెక్క చేయడు. స్త్రీలు కోరే దేవుడు అన్నా మరో దేవుడూ దేవతా అన్నా అతడికి లక్ష్యం ఉండదు. వారందరికంటే పైగా తనను హెచ్చించు కొంటాడు. 38 తన పూర్వీకులకు తెలియని దేవుణ్ణి గౌరవిస్తాడు. ఆ దేవుడు ‘కోటలమీద దేవుడు✽.’ అతడు వెండి, బంగారం, ప్రశస్త రత్నాలు, హెచ్చు వెలగల వస్తువులు అర్పించి ఆ దేవుణ్ణి గౌరవిస్తాడు. 39 అతడు విదేశీ దేవుడిమూలంగా అన్నిటిలో బలమైన కోటలను ముట్టడి వేస్తాడు. తనను అంగీకరించిన వాళ్ళకు మహా ఘనత ఇస్తాడు. వాళ్ళను అనేకులమీద అధికారులుగా నియమిస్తాడు. వెల కట్టి దేశాన్ని✽ పంచియిస్తాడు.
40 ✽“అంతిమ కాలంలో దక్షిణప్రాంతం రాజు అతడితో యుద్ధం చేస్తాడు. ఉత్తర ప్రాంతం రాజు రథాలనూ గుర్రపు దండునూ యుద్ధ నావల సమూహాన్నీ సమకూర్చి తుఫానులాగా అతడిమీద పడుతాడు. వేరువేరు దేశాలమీదుగా ప్రవాహంలాగా వెళ్తాడు. 41 అతడు ‘అందమైన దేశం✽’ లో కూడా చొరబడుతాడు. అనేక జనాలు ఓడిపోతాయి గాని ఏదోం✽వాళ్ళూ మోయాబువాళ్ళూ అమ్మోనువాళ్ళ నాయకులూ అతడి చేతినుంచి తప్పించుకొంటారు. 42 అతడు ఇతర దేశాలమీదికి తన సైన్యాలను పంపిస్తాడు. ఈజిప్ట్ తప్పించుకోదు. 43 ఈజిప్ట్‌లో ఉన్న వెండి, బంగారం, విలువైన వస్తువులన్నీ అతడు స్వాధీనం చేసుకొంటాడు. లుబీయవాళ్ళూ కూషువాళ్ళూ అతడికి లొంగిపోతారు. 44 అయితే తూర్పునుంచీ ఉత్తర దిక్కు✽నుంచీ సమాచారాలు వచ్చి అతడికి కలవరం కలిగిస్తాయి. అప్పుడతడు అనేకులను నాశనం చేయడానికీ నిర్మూలించడానికీ మహా కోపోద్రేకంతో బయలుదేరుతాడు. 45 అతడు తన రాజనగరు గుడారాలను సముద్రాల మధ్య✽, అందమైన పవిత్ర పర్వతం✽ దగ్గర వేస్తాడు. అయినా అతడు అంతరిస్తాడు✽. అతడికి సహాయం చేసేవాడు ఎవ్వడూ ఉండడు.