10
1 ✽పారసీక చక్రవర్తి కోరెషు పరిపాలించిన మూడో సంవత్సరంలో బెల్‌తెషాజరు అనే మారుపేరు పొందిన దానియేలుకు ఒక సంగతి వెల్లడి చేయబడింది. ఆ సంగతి నిజం. అది గొప్ప యుద్ధాన్ని గురించినది. తనకు కలిగిన దర్శనంవల్ల అతడు ఆ సంగతి గ్రహించాడు. 2 ✽ఆ రోజుల్లో నేను – దానియేలును – మూడు వారాలు శోకిస్తూ ఉన్నాను. 3 ఆ మూడు వారాలు గడిచేవరకూ ఇష్టమైన ఆహారమేమీ తినలేదు. మాంసం గానీ ద్రాక్షరసం గానీ నా నోట్లో పడలేదు. స్నానాభిషేకం చేసుకోలేదు. 4 మొదటి నెల ఇరవై నాలుగో రోజున నేను హిద్దెకెల్ అనే గొప్ప నది ఒడ్డున ఉన్నాను. 5 ✽నేను తలెత్తి చూస్తే, సన్నని నారబట్టలు తొడుక్కొని ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. అతని నడిమికి మేలిమి బంగారు నడికట్టు ఉంది. 6 అతని శరీరం గోమేధికం లాంటిది. అతని ముఖం మెరుపులాగా ఉంది. అతని కండ్లు మండుతూ ఉన్న దివిటీలలాంటివి. అతని చేతులూ కాళ్ళూ మెరుగు పెట్టిన కంచులాగా తళతళలాడుతూ ఉన్నాయి. అతని కంఠధ్వని మానవ సమూహం చేసే కలకలంలాంటిది.7 నేను – దానియేలును – ఒక్కణ్ణే ఈ దర్శనం చూశాను. నాతో ఉన్నవారు దానిని చూడలేదు గాని వారికి ఎంతో భయం వేసినందుచేత దాక్కొందామని పారిపోయారు. 8 ✝నేను ఒక్కణ్ణే మిగిలి ఈ గొప్ప దర్శనం చూశాను. నాలో బలమేమీ నిలవలేదు. నా ముఖకాంతి హరించుకుపోయింది. నా బలమంతా పోయింది. 9 అయినా అతడు చెప్పిన మాటలు విన్నాను. వింటూ ఉంటే, నేను నిర్ఘాంతపోయి సాష్టాంగపడ్డాను. 10 ✽అప్పుడు ఒక చెయ్యి నన్ను తాకింది, వణకుతున్న నా మోకాళ్ళను అరచేతులను నేలమీద మోపింది.
11 అతడు “దానియేలూ! నీవు ఎంతో ప్రియమైనవాడివి✽. దేవుడు పంపగా నేను నీ దగ్గరకు వచ్చాను గనుక నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పబోయే మాటలు గ్రహించు” అన్నాడు. అతడా మాటలు నాతో చెప్పగానే నేను వణకుతూ లేచి నిలబడ్డాను.
12 అప్పుడతడు అన్నాడు, “దానియేలు! భయపడకు! అర్థం చేసుకోవడానికి మనసు పెట్టి దేవుని సన్నిధానంలో నిన్ను నీవు తగ్గించుకొన్న మొదటి రోజు✽నుంచి నీ మాటలు వినబడ్డాయి. నీ మాటల కారణంగానే నేను వచ్చాను. 13 ✽కానీ పారసీకుల రాజ్యంపై ఉన్న అధిపతి✽ ఇరవై ఒక రోజులు నన్ను ఎదిరించాడు. నేను పారసీకుల రాజు ఎదుట ఉండిపోవలసి వచ్చినందుచేత మిఖాయేల్ నా సహాయానికి వచ్చాడు. మిఖాయేల్ ప్రముఖ అధిపతులలో ఒకడు. 14 అప్పుడు నీ ప్రజకు✽ భవిష్యత్తులో జరగబోయేవాటిని నీకు తెలియ జేయడానికి వచ్చాను. ఈ దర్శనం రాబోయే కాలాన్ని గురించినది.”
15 అతడా మాటలు నాతో చెపుతూ ఉండగా నేను ముఖం క్రిందకి దించుకొని మాట్లాడలేకపోయాను. 16 ✽వెంటనే మనిషిలాంటివాడొకడు నా పెదవులను తాకాడు. నేను నోరు తెరచి నా ఎదుట నిలుచున్న వ్యక్తితో “నా యజమానీ! ఈ దర్శనంవల్ల అల్లాడిపోతున్నాను. నా బలమంతా పోయింది. 17 నా యజమానులైన మీతో మీ దాసుడైన నేను ఎలా మాట్లాడగలను? నాకు బలమేమీ మిగలలేదు. ఊపిరి విడవలేక ఉన్నాను” అన్నాను.
18 మనిషిలాంటి ఆ వ్యక్తి మళ్ళీ నన్ను తాకి నాకు బలం కలిగించాడు. 19 “నీవు ఎంతో ప్రియమైనవాడివి. భయపడకు! నీకు క్షేమం కలుగుతుంది. బలం పుంజుకో! బలం పుంజుకో!” అన్నాడతడు. అతడు నాతో ఇలా చెప్పగానే నాకు బలం కలిగింది.
నేను “నా యజమానీ! మీరు నాకు బలం కలిగించారు. ఇప్పుడు మాట్లాడండి” అన్నాను.
20 అతడు ఇలా అన్నాడు: “నేను నీదగ్గరికి వచ్చినది ఎందుకో తెలుసా? కాసేపటికి పారసీక అధిపతితో యుద్ధం చేయడానికి తిరిగి వెళ్ళిపోతాను. నేను బయలుదేరిన తరువాత గ్రీసు అధిపతి✽ వస్తాడు. 21 అయితే ఇప్పుడు సత్య గ్రంథం✽లో వ్రాసి ఉన్నదానిని నీకు తెలియజేస్తాను. (వాళ్ళను ఎదిరించడానికి నాకు ఒక్కడే సహాయకుడు. అతడు నీ ప్రజాధిపతి మిఖాయేల్. మరెవ్వరూ లేరు.