12
1 “ఆ కాలంలో మిఖాయేల్✽ – నీ ప్రజల✽ తరఫున నిలబడే ఆ గొప్ప అధిపతి – నిలబడుతాడు. అప్పుడు బాధకాలం✽ వస్తుంది. ప్రజలు రాజ్యాలుగా ఏర్పడ్డ కాలంనుంచీ అప్పటివరకు ఎన్నడూ సంభవించనంత బాధకాలం అది. అయితే ఆ కాలం వచ్చేటప్పుడు నీ ప్రజలతో ఎవరి పేర్లు గ్రంథం✽లో వ్రాసి ఉన్నాయో వారు తప్పించుకొంటారు✽. 2 అంతే గాక, నేలమట్టిలో నిద్ర పోయినవారిలో చాలామంది సజీవంగా లేస్తారు✽. వీరు శాశ్వత జీవంలోకి లేస్తారు. మిగిలినవారు నిందపాలు కావడానికీ శాశ్వత తిరస్కారానికీ లేస్తారు. 3 అప్పుడు తెలివితేటలున్నవారు✽ ఆకాశంలో ఉన్న జ్యోతులలాగా ప్రకాశిస్తారు. అనేకులను న్యాయవంతులను చేసేవారు నక్షత్రాలలాగా శాశ్వతంగా ప్రకాశిస్తూ ఉంటారు. 4 దానియేలూ! ఈ మాటలను భద్రపరచు✽. అంతిమ కాలంవరకు గ్రంథం ముద్రించివెయ్యి. జ్ఞానం వృద్ధి అవుతుందని చెప్పి చాలామంది అటూ ఇటూ పరుగెత్తుతూ ఉంటారు.”5 ✽అప్పుడు నేను – దానియేలును – నదివైపు చూచినప్పుడు ఇద్దరు వ్యక్తులు కనబడ్డారు. ఒకడు అవతలి ఒడ్డున, ఒకడు ఇవతలి ఒడ్డున నిలుచున్నారు. 6 వారిలో ఒకడు, శ్రేష్ఠమైన బట్టలు తొడుక్కొని నది జలాల పైగా ఉన్నవాణ్ణి ఇలా ప్రశ్నించాడు: “ఎంతకాలానికి ఆశ్చర్యకరమైన ఆ సంగతులు ముగిసిపోతాయి?” 7 ✽శ్రేష్ఠమైన బట్టలు తొడుక్కొని నది జలాల పైగా ఉన్నవాడు తన కుడిచెయ్యి, ఎడమచెయ్యి రెండూ ఆకాశంవైపుకు ఎత్తి నిత్య సజీవుడైన దేవుని పేర ఇలా శపథం చేశాడు: “ఒక కాలం, రెండు కాలాలు, అర్ధకాలం✽ పడుతుంది. పవిత్ర ప్రజల✽ బలాన్ని కొట్టివేయడం జరిగేటప్పుడు ఈ సంగతులన్నీ ముగిసిపోతాయి.” అది నేను విన్నాను.
8 ✽అది నేను విన్నాను గానీ గ్రహించలేదు. గనుక “నా యజమానీ! వీటి పర్యవసానమేమిటి?” అని అడిగాను.
9 ✽అతడు ఇలా జవాబిచ్చాడు: “దానియేలూ! నీవిప్పుడు వెళ్ళిపో. ఎందుకంటే ఈ సంగతులు చివరి కాలంవరకు భద్రంగా ముద్రవేసి ఉన్నాయి. 10 చాలామంది శుద్ధులూ పవిత్రులూ విషమ పరీక్షలకు నిలిచినవారవుతారు✽. దుర్మార్గులు ఇంకా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దుర్మార్గులలో ఎవ్వడూ అర్థం చేసుకోడు. గానీ, జ్ఞానం ఉన్నవారు అర్థం చేసుకొంటారు. 11 ✽రోజూ అర్పించే అర్పణను నిలిపివేయడం, అసహ్యమైన వినాశకారిని నిలపడం జరిగే కాలం నుంచీ 1,290 రోజులు గడిచిపోతాయి. 12 ✽ఎదురు చూస్తూ, 1,335 రోజుల ముగింపువరకు బ్రతికేవారు ధన్యులు! 13 నీవైతే అంతం వరకు సాగిపో. అప్పుడు నీవు విశ్రమిస్తావు✽. నీకోసం నిర్ణయించిన వారసత్వాన్ని✽ పొందడానికి చివరి కాలంలో నిలబడుతావు✽.”