8
1 ✽బెల్‌షస్సరురాజు ఏలిన మూడో ఏట నాకు – దానియేలుకు – మునుపు కలిగిన దర్శనం గాక మరో దర్శనం కలిగింది. 2 ఆ దర్శనంలో చూస్తూ ఉంటే, నేను ఎలాం ప్రదేశంలో రాజభవనం గల షూషను✽ పట్టణంలో ఉన్నట్లు అనిపించింది. ఆ దర్శనంలో నేను ఉలయి అనే కాలువ ఒడ్డున ఉన్నాను. 3 ✽నేను తలెత్తి చూస్తూ ఉంటే, నా ఎదుట ఒక పొట్టేలు ఆ కాలువ ఒడ్డున నిలబడి ఉండడం కనిపించింది. దానికి రెండు కొమ్ములు ఉన్నాయి. కొమ్ములు రెండూ పొడవైనవే గానీ ఒకటి రెండో దాని తరువాత పైకి వచ్చినా, అది దానికంటే పొడవుగా ఉంది. 4 ✽నేను చూస్తూ ఉన్నప్పుడు ఆ పొట్టేలు పడమటి దిక్కుకూ ఉత్తర దిక్కుకూ దక్షిణ దిక్కుకూ కొమ్ములతో పొడుస్తూ ఉంది. ఆ పొట్టేలు ఎదుట మరే జంతువూ నిలబడగలిగేది కాదు, దాని బారినుంచి తప్పించుకోగలిగేది కాదు. అది ఇష్టం వచ్చినట్టే జరిగిస్తూ, తనను గొప్ప చేసుకొంది.5 ✽నేను దీన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే, హఠాత్తుగా పడమటనుంచి భూతలమంతటి మీదా పరుగెత్తుతూ, కాళ్ళు నేల మోపకుండా ఒక మేకపోతు వచ్చింది. దాని కళ్ళ మధ్య సుస్పష్టంగా కనబడే కొమ్ము ఒకటి ఉంది. 6 ✽రెండు కొమ్ములున్న ఆ పొట్టేలు – కాలువ ఒడ్డున నిలబడి నాకు కనిపించిన ఆ పొట్టేలు వైపుకు ఈ మేకపోతు వచ్చింది. తీవ్ర కోపోద్రేకంతో పరుగెత్తింది. 7 నేను చూస్తూ ఉంటే, మేకపోతు ఆ పొట్టేలుదగ్గరికి చేరి అధిక ఆగ్రహం తెచ్చుకొని దానిమీదికి ఢీకొని దానిని గెలిచింది. దాని రెండు కొమ్ములను పగలగొట్టివేసింది. ఆ పొట్టేలు దాని ఎదుట నిలవలేక పోయింది. మేకపోతు దానిని నేలమీదికి పడగొట్టి త్రొక్కివేసింది. మేకపోతు బారినుంచి ఆ పొట్టేలును తప్పించడానికి ఎవరికీ చేతకాలేదు. 8 అప్పుడా మేకపోతు అధికంగా తనను గొప్ప చేసుకొంది గానీ ఎక్కువ బలం పుంజుకొన్న కాలంలోనే దాని పెద్ద కొమ్ము విరిగిపోయింది✽. దాని స్థలంలో సుస్పష్టంగా కనబడే నాలుగు కొమ్ములు✽ పైకి వచ్చి ఆకాశం నలుదిక్కులకు పెరిగాయి.
9 ఈ కొమ్ములలో ఒకదానిలోనుంచి చిన్న కొమ్ము✽ ఒకటి పైకి వచ్చింది. దక్షిణం వైపుకూ తూర్పు వైపుకూ అందమైన దేశం✽ వైపుకూ దాని బలం అధికంగా పెరిగింది. 10 ✽ఆకాశ సమూహమంత ఎత్తుగా అది పెరిగి కొన్ని నక్షత్రాలను భూమిమీదికి పడవేసి కాళ్ళక్రింద త్రొక్కివేసింది. 11 ఆ సమూహంయొక్క అధిపతి✽తో సాటినని తనను గొప్ప చేసుకొంది. ప్రతి రోజూ ఆయనకు అర్పించవలసిన అర్పణలను నిలిపివేసింది. ఆయన పవిత్రాలయం ఉన్న స్థలం హీనదశకు వచ్చింది. 12 ✽తిరుగుబాటు కారణంగా ఒక సమూహాన్నీ రోజూ అర్పించవలసిన అర్పణలనూ ఆ కొమ్ముకు అప్పగించడం జరిగింది. అది ఇష్టం వచ్చినట్టే జరిగిస్తూ వర్ధిల్లుతూ ఉంది. దానివల్ల సత్యం నేలమట్టం అయింది.
13 ✽అప్పుడు పవిత్రుడొకడు మాట్లాడడం నేను విన్నాను. అతడు మాట్లాడుతూ ఉంటే, మరో పవిత్రుడు అతణ్ణి ఇలా ప్రశ్నించాడు: “ఈ దర్శనం నెరవేరడానికి ఎంతకాలం పడుతుంది? రోజూ అర్పించవలసిన అర్పణల విషయం, నాశనానికి కారణమైన తిరుగుబాటు విషయం నెరవేరడం పవిత్ర స్థానాన్నీ సమూహాన్నీ కాళ్ళక్రింద త్రొక్కడం ఎంతకాలమనీ?”
14 అందుకు అతడు నాతో ఇలా అన్నాడు: “రెండు వేల మూడు వందల సాయంకాలాలూ ఉదయకాలాలూ గడిచేవరకు అలా జరుగుతుంది. అప్పుడు పవిత్ర స్థానం అతిక్రమంనుంచి విడుదల అవుతుంది.”
15 నేను – దానియేలును – ఆ దర్శనం చూచి దాని అర్థమేమిటో గ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, నా ఎదుట మనిషిలాంటి వాడొకడు నిలబడివుండడం కనిపించింది. 16 అప్పుడు ఊలయిమీదనుంచి ఒక స్వరం నాకు వినబడింది. ఆ స్వరం పలికిన మాట ఇది: “గబ్రియేల్✽! ఆ దర్శనం భావం ఆ మనిషికి తెలియజెయ్యి.”
17 అందుచేత నేను నిలుచున్న చోటికి అతడు వచ్చాడు. అతడు వస్తూ ఉంటే నేను ఎంతో భయపడి సాగిలపడ్డాను. అతడు “మానవపుత్రా✽, ఆ దర్శనం చివరి కాలాన్ని గురించినదని తెలుసుకో” అన్నాడు.
18 అతడు నాతో మాట్లాడుతుండగా నేను నిర్ఘాంతపోతూ, నేలమీద సాష్టాంగపడ్డాను. అతడు నామీద చెయ్యి ఉంచి నన్ను నిలువుగా లేవనెత్తాడు.
19 ✽అప్పుడతడు అన్నాడు, “ఇదిగో విను. తరువాత – కోపకాలంలో – ఏమీ జరుగుతుందో అది నీకు తెలియజేస్తాను. ఆ దర్శనం నిర్ణీతమైన చివరి కాలాన్ని గురించినది. 20 నీవు రెండు కొమ్ములు గల పొట్టేలును చూశావు గదా. మాదీయ పారసీక రాజులను అది సూచిస్తుంది. 21 బొచ్చుగల ఆ మేకపోతు గ్రీకుల రాజు. దాని కండ్ల మధ్య ఉన్న పెద్ద కొమ్ము అంటే వారి మొదటి రాజు. 22 ఆ కొమ్ము విరిగిపోయిన తరువాత దాని స్థానంలో నాలుగు కొమ్ములు పైకి వచ్చాయి గదా. ఆ ప్రజలో నలుగురు రాజులు పైకి వస్తారు గానీ ఆ మొదటి రాజుకు ఉన్నంత బలం వీరికి ఉండదు. 23 ✽వారి పరిపాలనలోని ఆఖరి రోజుల్లో, తిరుగుబాట్లు పూర్తి అయినప్పుడు, కౄర ముఖంగల మరో రాజు పైకి వస్తాడు. అతడు కుట్రలు చేయడంలో ఆరితేరినవాడై ఉంటాడు. 24 అతడి బలం అత్యధికం అవుతుంది గాని అది అతడి స్వబలం కాదు.✽ అతడు చేయబోయే వినాశ కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. అతడు ఇష్టం వచ్చినట్టు జరిగిస్తూ వర్ధిల్లుతాడు. బలాఢ్యులనూ పవిత్ర ప్రజ✽నూ ధ్వంసం చేస్తాడు. 25 అతడు ఉపాయశాలి కావడంచేత అతడి కపట క్రియలు సఫలం అవుతాయి. తాను గొప్పవాణ్ణి అనుకొంటాడు. క్షేమంగా ఉన్నామనుకొనే చాలామందిని హతం చేస్తాడు. రారాజు✽ను కూడా ఎదిరించడానికి నిలబడుతాడు. చివరికి, మానవ హస్తం✽ లేకుండా, అతడు నాశనం అవుతాడు.
26 “సాయంకాలాలు, ఉదయకాలాలను గురించిన దర్శనం నీకు వివరించాను. ఈ వివరణ వాస్తవం. చాలా కాలమైన తరువాత అదంతా జరుగుతుంది గనుక నీవు ఈ దర్శనాన్ని భద్రపరచు.”
27 ✽అప్పుడు నేను – దానియేలును – నీరసించిపోయాను. కొన్ని రోజులవరకు జబ్బుతో మంచం పట్టాను. తరువాత లేచి రాజుకోసం చేయవలసిన పని చేశాను. ఆ దర్శనం అంటే నేను ఎంతో కలవరపడ్డాను. అది నా గ్రహింపుకు మించింది.