7
1 బబులోనురాజు బెల్‌షస్సరు పరిపాలించిన మొదటి సంవత్సరం✽లో దానియేలుకు ఒక కల వచ్చింది. పడకమీద పడుకొని ఉన్నప్పుడు దర్శనాలు కలిగాయి. అతడు ఆ కల విషయం క్లుప్తంగా వివరించి వ్రాశాడు. 2 ✽దానియేలు చెప్పినదేమంటే, రాత్రివేళ నా దర్శనాలలో నేను తేరిపార చూస్తూ ఉంటే, ఆకాశం నాలుగు గాలులు✽ విసరుతూ, మహాసముద్రాన్ని కదలించివేయడం కనిపించింది. 3 ✽సముద్రం లోనుంచి నాలుగు బ్రహ్మాండమైన మృగాలు పైకి వచ్చాయి. అవి ఒకదానికొకటి వేరువేరుగా ఉన్నాయి.4 ✽మొదటి మృగం సింహంలాంటిది. దానికి గరుడపక్షి రెక్కలున్నాయి. నేను చూస్తూ ఉన్నప్పుడు దాని రెక్కలను పీకివేసి దాన్ని లేవనెత్తి మనిషిలాగా రెండు పాదాలతో నిలబడేలా చేయడం జరిగింది. దానికి మనిషి✽ మనసు ఇవ్వబడింది.
5 ✽రెండో మృగం ఎలుగుబంటిలాంటిది. దానికి ఒక ప్రక్కకంటే రెండో ప్రక్క ఎత్తుగా ఉంది. దాని నోట పళ్ళమధ్య మూడు ప్రక్కటెముకలు ఉన్నాయి. దానితో కొందరు “లే! మాంసం బాగా మ్రింగెయ్యి!” అన్నారు.
6 ✽తరువాత నేను చూస్తూ ఉంటే, ఇంకో మృగం కనిపించింది. అది చిరుతపులిలాంటిది. దాని వీపుకు పక్షి రెక్కలలాంటి నాలుగు రెక్కలున్నాయి. ఈ మృగానికి నాలుగు తలలు✽న్నాయి. దానికి పరిపాలించే అధికారం ఇవ్వబడింది.
7 ✽తరువాత, రాత్రివేళ కలిగిన ఆ దర్శనాలను నేను చూస్తూవున్నప్పుడు, నాలుగో మృగం కనిపించింది. అది ఘోరమైనది. భయంకరమైనది, మహా బలంగలది. దానికి పెద్ద ఇనుప✽ పళ్ళు ఉన్నాయి. ఎదురుపడ్డ వాటన్నిటినీ అది ముక్కలు చేసి మ్రింగివేసింది. మిగిలినదాన్ని కాళ్ళక్రింద త్రొక్కివేసింది. మునుపు కనిపించిన మృగాలన్నిటికీ ఈ మృగం భిన్నమైనది. దానికి పది కొమ్ములున్నాయి. 8 ✽ఈ కొమ్ములను చూస్తూవుంటే వాటి మధ్య మరో కొమ్ము పైకి వచ్చింది. అది చిన్నది. దాని ఎదుట ఆ మొదటి కొమ్ములలో మూడు కొమ్ములను పీకివేయడం జరిగింది. ఈ కొమ్ముకు మనిషి కండ్ల✽లాంటి కండ్లున్నాయి. గొప్పలు చెప్పుకొనే నోరు✽ కూడా ఉంది.
9 ✽నేను ఇంకా చూస్తూ ఉంటే, సింహాసనాలు✽ నెలకొల్పడం జరిగింది. అనాది సిద్ధమైనవాడు✽ కూర్చున్నాడు. ఆయన వస్త్రం చలిమంచంత తెలుపు. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన తెల్లని గొర్రెబొచ్చులాగా ఉన్నాయి. ఆయన సింహాసనం మంటలతో మండుతూ ఉంది. దాని చక్రాలు✽ నిప్పులాంటివి. 10 మంటల✽ ప్రవాహం ఆయన ఎదుటనుంచి పారుతూ ఉంది. వేలాది వేలమంది✽ పరిచారకులు ఆయనకు సేవ చేస్తూ ఉన్నారు. కోటాను కోట్లమంది ఆయన ఎదుట నిలుచున్నారు. న్యాయసభ ఆరంభం అయింది, గ్రంథాలు✽ విప్పడం జరిగింది. 11 ✽ఆ చిన్న కొమ్ము గొప్పలు చెప్పుకోవడం కారణంగా నేనింకా చూస్తూనే ఉన్నాను. అప్పుడు ఆ మృగం హతం అయింది. నాశనమైనదాని శవాన్ని మండుతూ ఉన్న మంటల్లో వేయడం జరిగింది. అంతవరకు చూస్తూ ఉన్నాను. 12 ✽అంతకుముందు ఆ ఇతర మృగాల ప్రభుత్వం తొలగిపోయినా, అవి ఇంకా ఒక సమయం ఒక కాలం బ్రతకడానికి నిర్ణయం అయింది.
13 రాత్రివేళ కలిగిన దర్శనాలను నేను ఇంకా చూస్తూ ఉంటే, మానవ పుత్రుని✽లాంటివాడు ఆకాశ మేఘాలతో✽ రావడం కనిపించింది. ఆయన అనాది సిద్ధమైనవాణ్ణి సమీపించాడు. ఆయనను ఆయన సన్నిధానంలోకి తీసుకువచ్చారు. 14 ✽ఆయనకు పరిపాలన, ప్రతాపం, రాజ్యాధికారం ఇవ్వబడ్డాయి. సర్వప్రజలూ అన్ని దేశాలవారూ అన్ని భాషలవారూ ఆయనకు సేవకులయ్యారు. ఆయన పరిపాలన శాశ్వతమైనది. అది ఎన్నటికీ గతించదు. ఆయన రాజ్యం ఎప్పటికీ నాశనం కాదు.
15 నేను – దానియేలును – మనసులో ఆందోళన పడ్డాను. ఆ దర్శనాలవల్ల నాకు భయం వేసింది.
16 అక్కడ నిలుచున్నవారిలో నేను ఒక వ్యక్తి✽ దగ్గరికి వెళ్ళి దీనంతటిని గురించిన నిజం చెప్పండని మనవి చేశాను. అతడు ఆ విషయాల అర్థం తెలియజేస్తూ నాతో ఇలా అన్నాడు: 17 “ఆ నాలుగు బ్రహ్మాండమైన మృగాలు ఈ లోకంలో బయలుదేరే నలుగురు రాజులను సూచిస్తాయి. 18 గానీ సర్వాతీతుని పవిత్రులే రాజ్యాధికారం పొందుతారు✽. రాజ్యం వారికి యుగయుగాలకూ శాశ్వతంగా ఉంటుంది.”
19 అప్పుడు ఆ ఇతర మృగాలన్నిటికీ భిన్నమైన ఆ నాలుగో మృగాన్ని గురించిన వాస్తవం తెలుసుకోవాలని కోరాను. ఆ మృగం చాలా ఘోరమైనది. దానికి ఇనుప పళ్ళూ కంచు గోళ్ళూ ఉన్నాయి. అది ఎదురుపడే వాటన్నిటినీ ముక్కలు చేసి మ్రింగివేసి మిగిలినదానిని కాళ్ళక్రింద త్రొక్కివేసేది. 20 దాని తలకు ఉన్న పది కొమ్ముల విషయమూ తరువాత పైకివచ్చిన ఆ వేరే కొమ్ము విషయమూ కూడా తెలుసుకోవాలని కోరాను. ఆ కొమ్ములలో మూడు ఈ కొమ్ము ఎదుట కూలిపొయ్యాయి. ఆ కొమ్ములన్నిటికంటే ఈ కొమ్ముకు ఎక్కువ బలం ఉన్నట్టు కనిపించింది. దానికి కండ్లూ గొప్పలు చెప్పుకొనే నోరూ ఉన్నాయి. 21 ✽నేను చూస్తూవుంటే, ఈ కొమ్ము✽ పవిత్రులతో యుద్ధం చేస్తూ, వారిని గెలుస్తూ ఉంది. 22 అనాది సిద్ధమైనవాడు వచ్చి సర్వాతీతుని పవిత్రుల పక్షంగా తీర్పు విధించేవరకు✽ అలా జరుగుతూనే ఉంది. అయితే ఆ సమయం వచ్చినప్పుడు పవిత్రులు రాజ్యం పొందారు.
23 ✽అతడు ఇలా చెప్పాడు: “ఆ నాలుగో మృగం లోకంలో ఉండబోయే నాలుగో రాజ్యాన్ని సూచిస్తుంది. ఈ రాజ్యం ఆ ఇతర రాజ్యాలన్నిటికీ భిన్నంగా ఉంటుంది. అది లోకమంతా అణగద్రొక్కుతూ, చితగ్గొట్టివేస్తూ మ్రింగివేస్తుంది. 24 ఆ పది కొమ్ములు ఆ రాజ్యంలో కనిపించబోయే పదిమంది రాజులను✽ సూచిస్తాయి. వాళ్ళ తరువాత వేరొక రాజు పైకి వస్తాడు. మునుపున్న ఆ రాజులకు భిన్నంగా ఉంటాడు. వారిలో ముగ్గురు రాజులను లొంగదీస్తాడు. 25 అతడు సర్వాతీతునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ✽, ఆయన భక్తులను బాధిస్తాడు. నిర్ణీత కాలాలనూ శాసనాలనూ మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. పవిత్రులను ఒక కాలం, కాలాలు, అర్ధకాలం✽ అతడి వశం చేయడం జరుగుతుంది✽. 26 ✝గానీ న్యాయసభ సమకూడుతుంది, అతడి అధికారం కొట్టివేయబడుతుంది. అది ఇంకెన్నటికీ ఉండకుండా నిర్మూలం అవుతుంది. 27 ✽అప్పుడు ఆకాశ మండలమంతటి క్రింద ఉన్న రాజ్యాలన్నిటికీ చెందిన పరిపాలన, అధికారం, మహత్యం సర్వాతీతుని ప్రజలైన పవిత్రులకు ఇవ్వడం జరుగుతుంది. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం. అధికారులందరూ ఆయనకు లోబడుతూ, సేవ చేస్తూ✽ ఉంటారు.”
28 ఇంతలో సంగతి సమాప్తం అయింది. నేను – దానియేలును – నా తలంపులవల్ల చాలా భయాందోళన చెందాను. నా ముఖం తెల్లబోయింది. అయినా నేను ఆ సంగతి ఎవరికీ చెప్పలేదు.