6
1 రాజ్యమంతటిలోనూ పాలించడానికి నూట ఇరవైమంది అధిపతులను నియమించడం దర్యావేషుకు ఇష్టం అయింది. 2 ✽ఆ అధిపతుల మీద ముగ్గురు పాలకులను కూడా నియమించాడు. ఆ ముగ్గురిలో దానియేలు ఒకడు. చక్రవర్తికి ఏమీ నష్టం కలగకుండా ఆ అధిపతులు ఆ ముగ్గురికి లెక్క అప్ప చెప్పాలని రాజు నిర్ణయించాడు. 3 దానియేలు ఉత్తమోత్తమ బుద్ధి గలవాడు గనుక అతడు ఇతర పరిపాలకులనూ అధిపతులనూ పరిపాలనలో మించి పోయాడు. అతణ్ణి రాజ్యమంతటిమీదా నియమించాలని చక్రవర్తి ఉద్దేశించాడు.4 ✽అందుచేత పరిపాలకులూ అధిపతులూ రాజ్యపాలన విషయంలో దానియేలుమీద ఏదో నేరం మోపడానికి అవకాశాలు వెదకసాగారు. అయితే అవకాశం ఏమీ కనుక్కోలేకపోయారు. దానియేలు నిజాయితీపరుడు. అక్రమం, అన్యాయం చేసేవాడు కాడు. కనుక అతని విషయంలో వాళ్ళకు అక్రమమేమీ కనిపించలేదు. 5 అప్పుడు వాళ్ళు “దానియేలుమీద నేరం మోపడానికి మరే విషయంలోనూ అవకాశం మనకు దొరకదు గానీ అతని దేవుని ధర్మశాస్త్రం విషయంలో దొరకవచ్చు” అని చెప్పుకొన్నారు.
6 కాబట్టి ఆ పరిపాలకులూ అధిపతులూ పోగై చక్రవర్తి దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పారు: “దర్యావేషు చక్రవర్తి! మీరు చిరంజీవులు అవుతారు గాక! 7 ఈ రాజ్యంలోని పరిపాలకులూ ప్రముఖులూ అధిపతులూ మంత్రులూ రాష్ట్రపతులూ అందరూ✽ ఒక సంగతి గురించి ఆలోచన చేసి ఏకీభవించారు. చక్రవర్తీ, ముప్ఫయి రోజులవరకు మీకు తప్ప మరి ఏ మనిషికీ ఏ దేవుడికీ ఎవ్వడూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేస్తే వాణ్ణి సింహాల గుహలో పడవేయడం జరగాలి. ఈ ప్రకారం మీరు ఒక చట్టం నిర్ణయించి ఖచ్చితంగా అమలులోకి వచ్చేలా చేయాలని మా ఆలోచన. 8 చక్రవర్తీ, ఈ విధంగా శాసనం నిర్ణయించి దానిపై సంతకం చేయండి. మాదీయ పారసీకుల తిరుగులేని శాసనాలలాగా ఈ శాసనం మార్చడం జరగకూడదన్న మాట.” 9 అందుచేత దర్యావేషు చక్రవర్తి ఆ శాసనం వ్రాయించి సంతకం చేశాడు.
10 ✽ఆ శాసనంమీద చక్రవర్తి సంతకం చేశాడని దానియేలు తెలుసుకొన్నప్పుడు కూడా ఇంటికి వెళ్ళాడు. అతని మేడగది కిటికీలు జెరుసలం వైపుకు తెరచివున్నాయి. మునుపటిలాగే రోజుకు మూడు సార్లు అతడు మోకరించి తన దేవునికి ప్రార్థన చేస్తూ కృతజ్ఞత✽ చెప్పుకొన్నాడు. 11 దానియేలు తన దేవుణ్ణి ప్రార్థిస్తూ, సహాయంకోసం వేడుకొంటూ ఉంటే ఆ మనుషులు గుమికూడి వచ్చి చూశారు.
12 వెంటనే వాళ్ళు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి రాజశాసనాన్ని గురించి అతడితో, “చక్రవర్తీ! ముప్ఫయి రోజులవరకు మీకు తప్ప మరే మనిషికీ దేవుడికీ ఎవ్వడూ ప్రార్థన చేయకూడదనీ, ఎవడైనా చేస్తే వాణ్ణి సింహాల గుహలో పడవేయాలనీ మీరు ఆజ్ఞ జారీ చేశారు గదా” అన్నారు.
అందుకు చక్రవర్తి “మాదీయ పారసీక తిరుగులేని శాసనాలలాగా ఆ నిర్ణయం స్థిరం. ఎవరూ దాన్ని మార్చలేరు” అన్నాడు.
13 అందుకు వాళ్ళు “యూదానుంచి బందీలుగా వచ్చినవాళ్ళలో ఒకడైన దానియేలు మిమ్మల్ని గానీ మీరు సంతకం చేసిన శాసనాన్ని గానీ ఏమీ లక్ష్యపెట్టడం లేదు. అతడింకా రోజుకు మూడు సార్లు ప్రార్థన చేస్తున్నాడు” అన్నారు.
14 ఇది విని చక్రవర్తి విచారపడ్డాడు✽. దానియేలును కాపాడుదామని నిశ్చయించుకొని ప్రొద్దుక్రుంకే సమయంవరకు అతణ్ణి విడిపించడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. 15 అయితే ఆ మనుషులు మళ్ళీ గుమికూడి చక్రవర్తి దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: “చక్రవర్తి మాదీయ పారసీకులకూ ఉన్న శాసనాల ప్రకారం చక్రవర్తి నిర్ణయించిన శాసనం గానీ చట్టం గానీ మార్చడం జరగకూడదని గుర్తుచేసుకోండి.”
16 ✽అప్పుడు చక్రవర్తి ఆజ్ఞ జారీ చేశాడు. భటులు దానియేలును తీసుకువచ్చి సింహాల గుహలో పడద్రోశారు. చక్రవర్తి “ఎడతెరపి లేకుండా నీవు సేవిస్తూ ఉన్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు గాక!” అని దానియేలుతో అన్నాడు.
17 వాళ్ళు రాయి తెచ్చి గుహద్వారానికి వేశారు. దానియేలు విషయం ఎవరూ దేనినీ మార్చలేకుండేలా చక్రవర్తి తన ముద్రనూ తన ప్రముఖుల ముద్రనూ ఆ రాతిపై ముద్రవేశారు. 18 ఆ తరువాత చక్రవర్తి తన భవనానికి వెళ్ళి ఆహారం లేకుండా, వినోద కాలక్షేపమేమీ జరగకుండా రాత్రి గడిపాడు. నిద్ర అతడికి దూరమైపోయింది. 19 తెల్లవారగానే చక్రవర్తి లేచి సింహాల గుహ దగ్గరికి త్వరగా వెళ్ళాడు. 20 గుహ దగ్గరికి చేరి దుఃఖాన్ని వెల్లడి చేసే కంఠంతో దానియేలును బిగ్గరగా పిలిచాడు: “దానియేలూ! సజీవ దేవుని✽ సేవకుడా! ఎడతెరిపి లేకుండా నీవు సేవించే నీ దేవుడు ఆ సింహాల బారినుంచి నిన్ను రక్షించగలిగాడా?” అని అడిగాడు.
21 “చక్రవర్తి చిరంజీవి అవుతాడు గాక! 22 ✝నా దేవుడు తన దూతను పంపి ఈ సింహాల నోళ్ళను మూయించాడు. ఇవి నాకేమీ హాని చేయలేదు. ఎందుకంటే, ఆయన దృష్టిలో నేను నిర్దోషిని. చక్రవర్తీ! నేను మీకు ఎన్నడూ కీడు చేయలేదు గదా” అని దానియేలు జవాబిచ్చాడు.
23 చక్రవర్తి ఎంతో సంతోషించాడు. దానియేలును ఆ గుహలోనుంచి పైకి తీయాలని ఆజ్ఞ జారీ చేశాడు. అతణ్ణి బయటికి తీసిన తరువాత అతని శరీరానికి గాయమేమీ లేకుండడం చూశారు. ఎందుకంటే, దానియేలు తన దేవుణ్ణి నమ్ముకొన్నాడు✽. 24 ✝చక్రవర్తి జారీ చేసిన మరో ఆజ్ఞప్రకారం దానియేలుమీద నింద మోపినవాళ్ళను భటులు తెచ్చి సింహాల గుహలో పడద్రోశారు. వాళ్ళతోపాటు వాళ్ళ భార్యలనూ పిల్లలనూ కూడా అందులో పడద్రోశారు. వాళ్ళు గుహ అడుగుభాగానికి చేరకముందే సింహాలు వాళ్ళను పట్టుకొని వాళ్ళ ఎముకలు అన్నిటినీ పగలగొరికి ముక్కలు చేశాయి.
25 ✽అప్పుడు దర్యావేషు చక్రవర్తి దేశమంతటా నివాసముండే సర్వ ప్రజలకూ జనాలకూ ఆయా భాషలవాళ్ళకూ ఈ లేఖ వ్రాశాడు:
“మీకు క్షేమం అధికమవుతుంది గాక! 26 నేను నిర్ణయించినది ఏమంటే, నా రాజ్యంలోని అన్ని ప్రదేశాలలో ఉన్న ప్రజలు దానియేలుయొక్క దేవుని ఎదుట భయభక్తులతో వణకాలి. ఎందుకంటే, ఆయనే సజీవ దేవుడు. ఆయన యుగయుగాలకు ఉండేవాడు. ఆయన రాజ్యం నాశనం కాబోదు. ఆయన పరిపాలనకు అంతం అంటూ ఉండదు. 27 ఆయన మనుషులను విడిపించేవాడు, రక్షించేవాడు. ఆకాశాలలో, భూమిమీద ఆయన సూచకమైన క్రియలూ అద్భుతాలూ చేసేవాడు. ఆయన దానియేలును సింహాల బారినుంచి రక్షించాడు.”
28 దర్యావేషు రాజ్యపరిపాలనలో, పారసీకుడైన కోరెషు రాజ్య పరిపాలనలో దానియేలు వర్ధిల్లాడు.