5
1 ✽బెల్‌షస్సరురాజు తన అధికార ప్రముఖులలో వేయిమందికి గొప్ప విందు చేయించాడు. వాళ్ళతో కలిసి ద్రాక్షమద్యం సేవించాడు. 2 బెల్‌షస్సరు ద్రాక్షమద్యం✽ త్రాగుతూ, తన పూర్వీకుడైన నెబుకద్‌నెజరు జెరుసలం✽లో ఉన్న దేవాలయం నుంచి తీసుకువచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ జారీ చేశాడు. తానూ తన ప్రముఖులూ భార్యలూ ఉంపుడు కత్తెలూ వాటిలో ద్రాక్షమద్యం పోసి త్రాగాలని అతడి ఉద్దేశం. 3 ✽జెరుసలంలో ఉన్న దేవాలయంనుంచి తేబడ్డ బంగారు గిన్నెలు లోపలికి తీసుకువచ్చాక రాజూ అతడి ప్రముఖులూ అతడి భార్యలూ ఉంపుడు కత్తెలూ వాటిలో ద్రాక్షమద్యం పోసి త్రాగారు. 4 అలా ద్రాక్షమద్యం త్రాగుతూ, బంగారు వెండి కంచు ఇనుము కర్ర రాళ్ళతో చేసిన దేవతలను కీర్తించారు. 5 ఉన్నట్టుండి✽ మనిషి చేతివ్రేళ్ళు కనిపించాయి, దీపస్తంభానికి ఎదురుగా రాజభవనం గోడ పూతమీద ఏదో వ్రాత వ్రాయసాగాయి. ఆ చెయ్యి వ్రాస్తూ ఉంటే రాజు దానిని చూస్తూ ఉన్నాడు. 6 ✽అతడి ముఖం తెల్లపోయింది. అతడి మనసుకు కలిగిన కలవరంవల్ల అతడి మోకాళ్ళు ఒకదానికొకటి కొట్టుకొన్నాయి, అతడి తుంటికీళ్ళు సడలాయి.7 ✽అప్పుడు రాజు శకునజ్ఞులనూ జ్యోతిష్కులనూ సోదె చెప్పేవాళ్ళనూ పిలవండని గొంతెత్తి ఆజ్ఞ జారీ చేశాడు. ఈ బబులోను జ్ఞానులు వచ్చిన తరువాత రాజు వాళ్ళతో “ఈ వ్రాత చదివి, దీని భావం చెప్పగలవాడికి – అతడు ఎవడైనా సరే – అతడికి ఊదారంగు వస్త్రం తొడిగించడం, అతడి మెడకు బంగారు గొలుసు వేయడం జరుగుతుంది, అతడు రాజ్యంలో మూడో అధికారిగా పరిపాలిస్తాడు.”
8 రాజుకు చెందిన జ్ఞానులందరూ దగ్గరగా వచ్చారు. అయితే ఆ వ్రాత చదవడం గానీ దాని భావం రాజుకు చెప్పడం గానీ వాళ్ళచేత కాలేదు. 9 అందువల్ల బెల్‌షస్సరురాజుకు ఎక్కువ భయం వేసింది, అతడి ముఖం ఇంకా తెల్లబోయింది. అతడి అధికార ప్రముఖులు కూడా కలవరపడ్డారు.
10 రాజుకూ ప్రముఖులకూ సంభవించిన సంగతి తెలుసుకొని రాణి✽ విందుశాలకు వచ్చి ఇలా అంది: “రాజు చిరంజీవి అవుతాడు గాక! మీ తలంపులవల్ల కలవరపడకండి. మీ ముఖం తెల్లబోనివ్వకండి. 11 ✽మీ రాజ్యంలో ఒక మనిషి ఉన్నాడు. ఆయనలో పవిత్ర దేవుళ్ళ ఆత్మ ఉంది. మీ పూర్వీకుడి కాలంలో అతడికి దైవజ్ఞానంలాంటి జ్ఞానం, వివేకం, తెలివితేటలు ఉన్నాయని తెలిసింది. అందుచేత మీ పూర్వీకుడైన నెబుకద్‌నెజరురాజు శకునజ్ఞులకూ మాంత్రికులకూ జ్యోతిష్కులకూ సోదె చెప్పేవాళ్ళకూ అతణ్ణి అధిపతిగా నియమించాడు. 12 ఈ మనిషి దానియేలు. రాజు అతనికి బెల్‌తెషాజరు అనే పేరుపెట్టాడు. కలల భావాలను చెప్పడానికీ గూఢమైన సంగతులను స్పష్టం చేయడానికీ కఠిన ప్రశ్నలకు జవాబివ్వడానికీ జ్ఞాన వివేకాలూ సూక్ష్మబుద్ధీ అతనిలో కనబడ్డాయి. దానియేలును పిలవండి. అతడు మీకు ఈ వ్రాత అర్థం చెప్తాడు.”
13 వెంటనే దానియేలును రాజుదగ్గరికి తీసుకువచ్చారు. రాజు అతనితో ఇలా అన్నాడు: “రాజైన నా పూర్వీకుడు యూదానుంచి బందీలుగా తెచ్చిన వాళ్ళలో నీవు ఒక్కడివి గదా. నీ పేరు దానియేలు గదూ! 14 దేవుళ్ళ ఆత్మ నీలో ఉందని విన్నాను. నీకు వివేకం, తెలివితేటలు, విశేష జ్ఞానం ఉన్నాయట. 15 ఈ వ్రాత చదివి దాని అర్థం చెప్పడానికి జ్ఞానులనూ మాంత్రికులనూ పిలిపించాను గాని వాళ్ళు ఆ సంగతి తెలపలేకపోయారు. 16 ✽నీవు భావాలు బయలుపరచడానికీ, కఠిన ప్రశ్నలకు జవాబివ్వడానికీ సమర్థుడివని విన్నాను. ఒకవేళ నీవు ఈ వ్రాత చదివి దాని అర్థం నాకు చెప్పగలిగితే నీకు ఊదారంగు వస్త్రం తొడిగించడం, నీ మెడకు బంగారు గొలుసు ధరింపజేయడం జరుగుతుంది. నీవు రాజ్యంలో మూడో అధికారిగా పరిపాలిస్తావు.”
17 ✽దానియేలు రాజుకు ఇలా జవాబిచ్చాడు: “మీ కానుకలు మీరే ఉంచుకోండి. మీ బహుమతులు ఇంక ఎవరికైనా ఇవ్వవచ్చు. అయినా ఈ వ్రాత రాజుకు వినిపించి దాని అర్థం చెపుతాను. 18 రాజా! సర్వాతీతుడైన దేవుడు మీ పూర్వీకుడైన నెబుకద్‌నెజరుకు ఆధిపత్యం, ప్రతాపం, ఘనత, వైభవం ప్రసాదించాడు. 19 దేవుడు అతడికిచ్చిన ప్రతాపం కారణంగా అతడంటే అన్ని దేశాల ప్రజలూ ఆయా భాషలవాళ్ళూ భయపడేవాళ్ళు, అతడి సమక్షంలో వణికేవాళ్ళు. రాజు ఎవరిని చంపుదామనుకొన్నాడో వారిని చంపాడు. ఎవరిని బ్రతకనిద్దామనుకొన్నాడో వారిని బ్రతకనిచ్చాడు. ఎవరికి ఉన్నత పదవి కట్టబెట్టాలి అనుకొన్నాడో వారికి కట్టబెట్టాడు. ఎవరిని అణగద్రోక్కుదామనుకొన్నాడో వారిని అణగద్రొక్కాడు. 20 ✝కానీ అతడి హృదయం గర్వంతో ఉప్పొంగిపోయింది, అహంభావంతో బండబారిపోయింది. అప్పుడు అతణ్ణి రాజ్య సింహాసనంనుంచి త్రోసివేసి ఘనహీనుణ్ణి చేయడం జరిగింది. 21 అతణ్ణి మనుషుల సహవాసంనుంచి తరిమివేశారు. అతడి మనసు జంతువు మనసులాంటిదయింది. అతడు అడవిగాడిదల మధ్య ఉంటూ, పశువులలాగా గడ్డి మేస్తూ, ఆకాశంనుంచి పడే మంచుకు తడిసిపోతూ ఉన్నాడు. సర్వాతీతుడైన దేవుడే మనుషుల రాజ్యాలమీద అధికారి అనీ ఎవరిని వాటిపై నియమించాలనుకొంటాడో వారిని నియమిస్తాడనీ అతడు గుర్తించేవరకు ఆ స్థితిలో ఉండిపోయాడు.
22 “బెల్‌షస్సరు! మీరు అతని సంతానం. జరిగినదంతా మీకు తెలుసు✽. అయినా మీ హృదయాన్ని మీరు అణచుకోలేదు. 23 పరలోక ప్రభువుకు వ్యతిరేకంగా మిమ్మల్ని✽ మీరే గొప్ప చేసుకొన్నారు. ఆయన ఆలయ పాత్రలను తెప్పించి మీరూ మీ ప్రముఖులూ మీ భార్యలూ ఉంపుడుకత్తెలూ వాటిలో ద్రాక్షమద్యం పోసుకొని త్రాగారు. వెండి, బంగారం, కంచు, ఇనుము, కర్ర, రాళ్ళతో చేసిన దేవతలను – చూడలేని, వినలేని గ్రహించలేని దేవతలను – కీర్తించారు. మీ ప్రాణాన్నీ✽ మీ త్రోవలన్నిటినీ తన చేతిలో ఉంచుకొన్న దేవుణ్ణి మీరు గౌరవించలేదు. 24 అందుచేత ఆయన సమక్షంనుంచి ఈ చెయ్యి వచ్చి ఈ వ్రాత వ్రాసింది. 25 ✽వ్రాసిన నిర్ణయం ఏమంటే, మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్✽.
26 ✽“వ్రాసిన ఈ నిర్ణయానికి భావం ఇది: మెనే✽ అంటే, దేవుడు మీ పరిపాలన రోజులను లెక్కపెట్టి దానిని తుదముట్టించాడు. 27 టెకేల్✽ అంటే, ఆయన మిమ్మల్ని త్రాసులో తూచి మీరు తక్కువగా ఉండడం చూశాడు. 28 ✽ఫెరేస్ అంటే, మీ రాజ్యాన్ని విభజించి మాదీయ జాతికీ పారసీకులకూ ఇవ్వడం జరుగుతుంది”.
29 ✽వెంటనే బెల్‌షస్సరు ఆజ్ఞ జారీ చేశాడు. వారు దానియేలుకు ఊదారంగు వస్త్రం తొడిగించి అతని మెడలో బంగారు గొలుసు ధరింపజేసి రాజ్యంలో అతడు మూడో అధికారి అని చాటించాడు.
30 ✽ఆ రాత్రే కల్దీయవాళ్ళ రాజైన బెల్‌షస్సరు హతమయ్యాడు. 31 మాదీయవాడైన దర్యావేషు✽ సింహాసన మెక్కాడు. అప్పటికి అతని వయసు అరవై రెండేళ్ళు.