4
1 “లోకమంతట్లో నివసించే ప్రజలకూ అన్ని దేశాలవాళ్ళకూ అన్ని భాషలు మాట్లాడేవాళ్ళకూ నెబుకద్‌నెజరురాజు వ్రాసేదేమంటే, మీకందరికీ క్షేమం అధికమవుతుంది గాక! 2 సర్వాతీతుడైన దేవుడు నాపట్ల జరిగించిన అద్భుతాలనూ సూచకమైన క్రియలనూ మీకు తెలియజేయడం మంచిదని నాకు తోచింది. 3 ఆయన చేసే సూచకమైన క్రియలు ఎంత గొప్పవి! ఆయన చేసే అద్భుతాలు ఎంత ఘనమైనవి! ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం. ఆయన పరిపాలన తరతరాలకు ఉంటుంది.
4 “నేను – నెబుకద్‌నెజరును – ఇంట్లో హాయిగా జీవించాను. నా భవనంలో క్షేమం అనుభవించాను. 5 కానీ భయం కలిగించే ఒక కల నాకు వచ్చింది. నా పడకమీద పడుకొని ఉన్నప్పుడు నా మనసులో పడ్డ రూపాలవల్ల నాకు చాలా కంగారు కలిగింది. 6  కనుక ఆ కల భావాన్ని నాకు తెలియజేయడానికి బబులోనులోని జ్ఞానులందరూ నాదగ్గరికి రావాలని ఆజ్ఞ జారీ చేశాను. 7 శకునజ్ఞులూ మాంత్రికులూ జ్యోతిష్కులూ సోదె చెప్పేవాళ్ళూ వచ్చినప్పుడు నేను నా కల వాళ్ళకు చెప్పాను గాని దాని భావం వాళ్ళు తెలపలేకపొయ్యారు. 8 చివరికి, దానియేలు నా సమక్షంలోకి వచ్చాడు. నా దేవుడి పేరునుబట్టి అతడికి బెల్‌తెషాజరు అనే మారుపేరు ఉంది. అతనితో పవిత్ర దేవుళ్ళ ఆత్మ ఉంది. నేను నా కల అతనికి చెప్పాను.
9 “ఇలా అన్నాను, బెల్‌తెషాజరు! శకునజ్ఞులకు నీవు అధిపతివి. నీలో పవిత్ర దేవుళ్ళ ఆత్మ ఉందనీ ఏ రహస్యం నీకు కఠినం అనిపించుకోదనీ నాకు తెలుసు. నా కలలో నేను చూచిన వాటి భావం, కల భావం నాకు తెలియజెయ్యి. 10 నా పడకమీద పడుకొని ఉన్నప్పుడు నా మనసులో పడ్డ రూపాలు ఇవి: నేను చూస్తూవుంటే, భూలోకానికి మధ్య ఒక చెట్టు కనిపించింది. అది చాలా ఎత్తయినది. 11 ఆ చెట్టు పైకొమ్మలు ఆకాశాన్ని అందుకొనేవరకు అది పెరుగుతూ బ్రహ్మాండమై పోయింది. అది భూమి కొనలవరకూ కనిపించింది. 12 దాని ఆకులు అందమైనవి. దాని ఫలం సమృద్ధిగా ఉంది. సర్వజీవకోటికి దానిలో ఆహారం దొరికింది.
13 “నేనింకా పడకమీద పడుకొని ఉంటే, దర్శనాలలో నాకు కనిపించినదేమంటే, భూమిని చూస్తూ ఉండే ఒక పవిత్రుడు ఆకాశంనుంచి దిగివచ్చాడు. 14 ఆయన బిగ్గరగా ఇలా చెప్పాడు: ‘ఈ చెట్టును నరికివేసి దాని కొమ్మలను తెగగొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయండి! జంతువులను దాని నీడలోనుంచి తోలివేయండి! పక్షులను దాని కొమ్మలనుంచి లేవగొట్టండి! 15 గానీ దాని మొద్దును ఇనుముతో, కంచుతో కట్టి పొలం గడ్డిలో విడిచిపెట్టండి. దాని వేళ్ళు భూమిలో ఉండిపోనివ్వండి. అతడు ఆకాశంనుంచి పడే మంచుకు తడిసిపోతూ, జంతువులతోపాటు భూమిమీద ఉన్న పచ్చికలో భాగం పుచ్చుకోనివ్వండి. 16 మానవ మనసుకు బదులుగా జంతువు మనసు అతడికి కలగాలి. ఏడు కాలాలు గడిచేవరకు అతడు ఆ స్థితిలో ఉండిపోవాలి. 17 భూమిని చూస్తూ ఉండే దేవదూతలు ఈ నిర్ణయం చాటించారు. ఈ తీర్పును పవిత్రులు ప్రకటించారు. సర్వాతీతుడు మనుషుల రాజ్యాలపై అధికారి అని సజీవులంతా తెలుసుకొనేట్టు ఇలా జరుగుతుంది. తాను ఎన్నుకొన్నవారికే ఆయన ఆ రాజ్యాలను ఇస్తాడు. మనుషులందరిలో తక్కువైనవాళ్ళను వాటిపై నియమిస్తాడు.’
18 “నెబుకద్‌నెజరురాజునైన నాకు వచ్చిన కల అదే. బెల్‌తెషాజరు! దాని భావం నాకు తెలియజెయ్యి. నా రాజ్యంలో మరే జ్ఞానీ దాని భావం తెలుపలేదు. నీలో పవిత్ర దేవుళ్ళ ఆత్మ ఉంది గనుక నీవు దాన్ని చెప్పగలవు అన్నాను.
19 “అప్పుడు దానియేలు (అతడికి బెల్‌తెషాజరు అనే మారు పేరు ఉంది) గంటసేపు నిర్ఘాంతపోయాడు. అతని తలంపులు అతణ్ణి కలవరపరచాయి. అందుకు రాజు ‘బెల్‌తెషాజరు! ఆ కల గానీ దాని భావం గానీ నిన్ను కలవరపరచనియ్యకు’ అన్నాడు. “బెల్‌తెషాజరు ఇలా జవాబిచ్చాడు: ‘నా యజమానీ! ఆ కల మిమ్ములను ద్వేషించేవారిని గురించినదైతే ఎంత బావుండేది! కల భావం మీ శత్రువులకు చెంది ఉంటే ఎంత బావుండేది! 20 మీరు చూచిన చెట్టు ఆకాశాన్ని అందుకొనేవరకు పెరుగుతూ పెరుగుతూ బ్రహ్మాండమైపోయింది. అది భూమి కొనలకు కనిపించింది. 21 దాని ఆకులు అందమైనవి. దాని ఫలం సమృద్ధిగా ఉంది. సర్వ జీవకోటికి దానిలో ఆహారం దొరికింది. దాని నీడలో అడవి జంతువులు పడుకొన్నాయి. గాలిలో ఎగిరే పక్షులకు దాని కొమ్మల్లో ఉనికిపట్టు ఉంది. 22 రాజా, ఆ చెట్టంటే మీరే! మీరు ఆధిక్యమూ మహా బలప్రభావాలూ పొందారు. ఆకాశమంత ఎత్తుగా మీ ఆధిక్యం వృద్ధి చెందింది. మీ పరిపాలన భూమి కొనలకు వ్యాపించింది. 23 భూమిని చూస్తూ ఉండే పవిత్రుడొకడు ఆకాశంనుంచి దిగిరావడం మీరు చూశారు. ఆయన ఇలా చాటించాడు: చెట్టును నరికివేసి నాశనం చేయాలి గానీ దాని మొద్దును ఇనుముతో, కంచుతో కట్టి పొలం గడ్డి మధ్యలో విడిచిపెట్టాలి. దాని వేరులు భూమిలో ఉండిపోవాలి. ఏడు కాలాలు గడిచేవరకు అతడు ఆకాశంనుంచి పడే మంచుకు తడిసిపోతూ, జంతువులతో పాటు పచ్చికలో వంతు పుచ్చుకోవాలి.
24 “‘రాజా, కలభావం ఇదే, సర్వాతీతుడు నా యజమానుడైన రాజు విషయం చేసిన నిర్ణయం ఇదే– 25 మనుషుల సహవాసం నుంచి మిమ్ములను తరిమివేస్తారు. మీరు అడవి జంతువుల మధ్య ఉంటూ, పశువులలాగా గడ్డి తింటూ, ఆకాశంనుంచి పడే మంచుకు తడిసిపోతారు. సర్వాతీతుడు మనుషుల రాజ్యాలపై అధికారి అనీ ఆ రాజ్యాలు ఎవరికి ఇద్దామనుకొంటాడో వారికిస్తాడనీ మీరు గుర్తించేవరకు ఏడు కాలాలు మీకు ఇలా జరగాలి. 26 చెట్టు మొద్దునూ వేళ్ళనూ అలా విడిచిపెట్టాలి అనే ఆజ్ఞ భావమేమంటే, పరలోకం పరిపాలిస్తుందని మీరు గుర్తించినప్పుడు మీ రాజ్యం మీకు మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. 27 గనుక, రాజా, నా సలహా మీకు అంగీకారంగా ఉంటుంది గాక! మీ పాపాలను విడిచిపెట్టి న్యాయంగా ప్రవర్తించండి. మీ అపరాధాలను మాని దీనావస్థలో ఉన్న వారిమీద దయ చూపండి. అలా చేస్తే మీకున్న క్షేమం ఉండిపోవచ్చు.’”
28 “పైన వ్రాసి ఉన్నదంతా నెబుకద్‌నెజరురాజుకు సంభవించింది. 29 పన్నెండు నెలలు గడిచాక రాజు బబులోను రాజభవనం మిద్దెమీద నడుస్తూ, 30 ‘ఈ బబులోను మహా నగరం కదా! నా మహత్తు వైభవాన్ని ప్రదర్శించడానికి నా మహా బలంచేత దీన్ని రాజధానిగా కట్టించుకొన్నాను! అనుకొన్నాడు. 31 ఈ మాటలు రాజు నోట్లో ఇంకా ఉండగానే ఆకాశంనుంచి వాణి ఇలా వినిపించింది: ‘నెబుకద్‌నెజరురాజా! ఈ ప్రకటన నీకే – రాజాధికారం నీకు ఉండకుండా తొలగిపోయింది. 32 మనుషుల సహవాసంనుంచి నిన్ను తరిమివేస్తారు. నీవు అడవి జంతువుల మధ్య ఉంటూ, పశువులలాగా గడ్డి మేస్తావు. సర్వాతీతుడు మనుషుల రాజ్యాలమీద అధికారి అనీ ఆ రాజ్యాలు ఎవరికీ ఇవ్వాలంటే వారికే ఇస్తాడనీ నీవు గుర్తించే వరకు ఏడు కాలాలు నీకిలాగు జరగాలి.’
33 “తక్షణమే ఆ మాట నెబుకద్‌నెజరు విషయం నెరవేరింది. అతణ్ణి మనుషుల సహవాసంనుంచి తరిమివేశారు. అతడు పశువులలాగా గడ్డి తిన్నాడు. అతడి శరీరం ఆకాశంనుంచి పడే మంచుకు తడిసిపోయింది. అతడి తలవెంట్రుకలు గరుడపక్షి ఈకలంత పొడవుగా పెరిగాయి. అతడి గోళ్ళు పక్షి గోళ్ళలాంటివయ్యాయి.
34 “ఆ రోజుల తరువాత నేను – నెబుకద్‌నెజరును – ఆకాశంవైపు తలెత్తి చూశాను. అప్పుడు మానవబుద్ధి నాకు మళ్ళీ వచ్చింది. నేను సర్వాతీతుణ్ణి స్తుతించాను. శాశ్వతంగా జీవించే ఆయనను కీర్తించాను, కొనియాడాను. ఆయన పరిపాలన శాశ్వతమైనది. ఆయన రాజ్యం తరతరాలకు ఉంటుంది. 35 ఆయన దృష్టిలో లోకప్రజలంతా శూన్యం. పరలోకంలోని సమూహాలపట్లా లోకంలోని జనాలపట్లా తనకిష్టం వచ్చినట్టు జరిగిస్తాడు. ఆయన చెయ్యి పట్టుకొని, ‘నీవు చేసేదేమిటి?’ అనగలిగే వాడెవ్వడూ లేడు. 36 నాకు బుద్ధి వచ్చిన సమయంలోనే నా రాజ్యానికి శోభ కలిగేలా ముందున్న ఘనత, వైభవం మళ్ళీ నాకు చేకూరాయి. నా మంత్రులూ గొప్ప వంశస్థులూ నాదగ్గరికి రాసాగారు. నేను రాజ్యాధికారం తిరిగి పొందాను. మునుపటికంటే అత్యధిక ప్రతాపం నాకు కలిగింది. 37 అప్పుడు నేను – నెబుకద్‌నెజరు – పరలోక రాజును స్తుతిస్తూ, కొనియాడుతూ, కీర్తిస్తూ ఉన్నాను. ఎందుకంటే, ఆయన చేసేదంతా సత్యం; ఆయన విధానాలన్నీ న్యాయం; ఆయన గర్వంగా ప్రవర్తించేవాళ్ళను అణచివేయగలడు.”